Take a fresh look at your lifestyle.

‌ప్రధాని క్షమాపణ చెప్పాలి ..!

  • తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా…
  • కదం తొక్కిన టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు
  • మంత్రుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు
  • ట్విట్టర్‌లో గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు
  • హైకోర్టు ఎదుట మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన న్యాయవాదులు
  • జనగామలో ఉద్రిక్తంగా టిఆర్‌ఎస్‌ ‌నిరసన…దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని అడ్డుకున్న బిజెపి

ప్రజాతంత్ర. హైదరాబాద్‌ : ‌పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించేలా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో కదం తొక్కాయి. మంత్రుల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలతో  సైకిల్‌, ‌బైక్‌ ‌ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ‌మద్దతుదారులు ట్విట్టర్‌ ‌వేదికగా మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  మోదిఎనిమీతెలంగాణ పేరుతో ట్విట్టర్‌లో హ్యాష్‌టాగ్‌లతో గంటలోపే దాదాపు 25 వేల ట్వీట్లు చేశారు.  ట్విట్టర్‌ ‌ట్రెండింగ్‌లో టీఆర్‌ఎస్‌ ‌మద్దతుదారుల ట్వీట్లు మొదటి స్థానంలో నిలిచాయి. తెలంగాణకు చెందిన నెటిజన్లు సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఈక్వాలిటీ ఫర్‌ ‌తెలంగాణ అంటూ డిమాండ్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రధాని కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. గుజరాత్‌ ‌కంటే తెలంగాణ ముందకు వెళుతున్నదనే భావన ఆయనలో ఉన్నదనీ, అందుకే పార్లమెంటులో తెలంగాణ గురించి అసందర్బంగా, అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారనీ, విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషం మాటలు చెప్పారనీ, తల్లిని చంపి బిడ్డనిచ్చారనీ, ఇవి ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా అవి, అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాన్ని కించపరచినట్లు మాట్లాడటం సమంజసమేనా అంటూ ఇది ప్రజాస్వామ్య పక్రియను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.పార్లమెంటు సాక్షిగా తెలంగాణను అవమానించినందుకు ప్రధాని మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్డతీసే విధంగా ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌విమర్శించారు.

తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమ హయాంలో రాష్ట్రాలను ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా విభజించినట్లు ప్రధాని చెప్పారనీ, 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాతనే కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని  ప్రధాని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి బదులు ప్రధాని విషం కక్కుతున్నారని విమర్శించారు.  ప్రధాన మంత్రి హోదాలో ఉండి ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అమరవీరులను అపహాస్యం చేశారని విమర్శించారు. మరోసారి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

జనగామలో ఉద్రిక్తంగా టిఆర్‌ఎస్‌ ‌నిరసన…దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని అడ్డుకున్న బిజెపి
జనగామ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులకు, టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ ‌నాయకులపై బీజేపీ శ్రేణులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియపై మంగళవారం రాజ్యసభలో చేసిన విషపు వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బైక్‌ ‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కూడా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ ‌చేపట్టిన ర్యాలీని కూడా బీజేపీ నాయకులు అడ్డుకుని దాడి చేశారు. మొత్తంగా జనగామ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply