Take a fresh look at your lifestyle.

‌ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

  • అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురి దిగ్బ్రాంతి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్‌ ‌ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సాయం చేశారు. కందికొండ స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం.

ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్‌ ‌చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లి కూయవే గువ్వా’ పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‌వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నారు. కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు రాశారు.

తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయడంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, ప్లలె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. ఆయన మృతికి సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు.

Leave a Reply