Take a fresh look at your lifestyle.

‘‌హుజూర్‌’ ఎన్నిక నేడే

అoదరూ ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది. గతంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. అయినా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నియోజకవర్గం ఎన్నికపైన రాష్ట్ర స్థాయి నుండి కేంద్రస్థాయి రాజకీయ నాయకులు దృష్టిసారించారు. నేడిక్కడ జరిగే ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అలాగే యుపిలో పలు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో మాత్రం ఒక్క హుజూర్‌నగర్‌ ‌స్థానంలో జరిగే ఉప ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి నుండి మొత్తం 28 మంది పోటీపడుతున్నా ప్రధానంగా నాలుగు రాజకీయపక్షాలు ఎవరికి వారు తమదే గెలుపన్న ధీమాతో ప్రచారాన్ని కొనసాగించారు. ఇది అందివచ్చిన అవకాశంగా భావిస్తూ తమ సత్తాఏమిటో నిరూపించుకోవాలని అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర కృషిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో పాల్గొనలేకపోయిన తెలుగుదేశం పార్టీ కూడా తనకింకా తెలంగాణలో క్యాడర్‌ ఉం‌దని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నది. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీ తిరిగి తన ప్రతిష్టను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ స్థానం నుండి తన అభ్యర్థినిగా చావా కిరణ్మయిని పోటీలో నిలిపింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది తమ జంఢానే అని చెబుతున్న భారతీయ జనతాపార్టీ కూడా ఈ ఎన్నిక గెలుపు రాబోయే ఎన్నికలకు మార్గదర్శకం అవుతుందన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. అందుకే రాష్ట్ర నాయకులతోపాటు కేంద్ర పదవుల్లో ఉన్న నాయకులను తీసుకొచ్చి తమ అభ్యర్థి రామారావు గెలుపుకోసం నిర్విరామ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించింది. అవునన్నా కాదన్న ఈ రెండు పార్టీలకు గెలుపుమీద అంతగా నమ్మకంలేక పోయినా తమ ఉనికిని చాటుకునేందుకే ఈ ఎన్నికల్లో నిలబడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కాగా ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస, కాంగ్రెస్‌ ‌మధ్య ఉండబోతున్నది. ఈ రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒక విధంగా హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. ఎందుకంటే 2009 నుండి ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఇక్కడ గెలుస్తుండడమే. తాజా (2018) శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే స్థానంనుండి గెలిచినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎంపిగా గెలవడంతో తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతమాత్రాన నియోజకవర్గాన్ని పోగొట్టుకునే ప్రసక్తేలేదని, ఆయన ఇక్కడినుండి తన భార్య పద్మావతిరెడ్డిని పోటీలో పెట్టి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌లో అంతర్ఘత విభేదాలున్నప్పటికీ ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో అధికార పార్టీ చేతికి చిక్కనివ్వొద్దన్న పట్టుదలతో ఆ పార్టీ ప్రధాన నాయకులందరూ కలిసికట్టుగా పద్మావతి ప్రచార కార్యక్రమంలో భాగస్వా ములైనారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పోటీపడిన ఉత్తమ్‌, ‌రేవంత్‌ ‌రెడ్డిలు కూడా ఒక్కటవడం ఆ పార్టీ క్యాడర్‌లో నూతనో త్సాహాన్ని నింపినట్లు అయింది. ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ఎం‌పికూడా అయిన రేవంత్‌రెడ్డి చివరిలో చేసిన ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఊపునిచ్చింది. కెటిఆర్‌ ‌తన చెల్లెలు కవితను గెలిపించుకోలేకపోయాడుగాని, తాను మాత్రం తన సోదరి (పద్మావతి)ని గెలిపించుకుంటానంటూ రేవంత్‌ ‌చేసిన ప్రకటన పలువురిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే సహజంగా ఏ రాష్ట్రంలోనైనా జరిగే ఉప ఎన్నికలు ఆ రాష్ట్రంలో అధికారంలోఉన్న పార్టీకే అనుకూలంగా ఉంటాయన్న అభిప్రాయముంది. ఇక్కడ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌వెలువడేనాటి పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి తేడా రాడంతో అ నియోజకవర్గానికి ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి నల్లేరుమీద నడికేమీకాదన్న వాదన వినిపిస్తున్నది. మంత్రులు ఎంఎల్‌ఏలు, ఎంపిలు పలువురు ప్రచారకార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ, పదహారు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసి సమ్మె ప్రభావం తప్పకుండా ఈ ఎన్నికపై పడుతుందంటున్నారు. రాజకీయ పార్టీలు, న్యాయస్థానం, ప్రజలు అందరూ ప్రభుత్వాన్నే వేలెత్తి చూపుతున్న దశలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ చోటుచేసుకుంది. గోటితోపోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చుకుందన్న విమర్శ ప్రభుత్వంపై ఉంది. నిన్నటివరకు మాటల మాంత్రికుడిగా పేరున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ ‌విషయంలో మౌనవ్రతాన్ని పాటించడం, ట్రబుల్‌ ‌షూటర్లు, ఆపద్భాందవుల్లా ఉంటామని చెప్పుకునేవారెవరూ ఈ సమ్మెను పరిష్కరించేందుకు చొరవచూపకపోవడం కూడా ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్ల ఒక విధమైన నైరాశ్యానికి కారణంగా మారుతున్నది. దానికి తగినట్లుగా ఇక్కడ జరుగాల్సిన కెసిఆర్‌ ‌భారీ బహిరంగసభ వర్షం కారణంగా చివరి క్షణంలో రద్దుకావడం కూడా ఆ పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరం• •మారింది. ఈ మొత్తం పరిణామలదృష్ట్యా ప్రజలు ఎవరిపక్షమన్నది గురువారం నాటికిగాని తేలదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy