Take a fresh look at your lifestyle.

‌సింధు విజయం చారిత్రాత్మకం

భారత బాడ్మింటన్‌ ‌క్రీడాకారిణి పూసర్ల వెంకట(పివి) సింధు చారిత్రాత్మక విజయాన్ని సాధించడం మన దేశానికి, రెండు తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా మహిళా క్రీడారంగానికి ఎంతో గర్వకారణం. పడిలేచిన కిరణంలా వరుసగా మూడు సార్లు ఫైనల్‌కు చేరిన పివి సింధు చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంది. భారతదేశం కూడా నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసిడి పతకాన్ని సింధు రూపంలో గెలుచుకోగలిగింది. ఇప్పటివరకు ప్రకాశ్‌ ‌పడుకోనె, పుల్లల గోపిచంద్‌లను ఆదర్శంగా తీసుకుంటూ వస్తున్న యువ క్రీడాకారులు ఇక నుండి ఆ పేర్ల సరసన సింధు పేరును చేర్చుకోక తప్పదు. ప్రపంచ క్రీడాకారుల్లో అయిదవ ర్యాంకర్‌గా ఉన్న సింధు నాల్గవ ర్యాంకరైన జపాన్‌కు చెందిన క్రీడాకారిణి నొజోమి ఒకుహారాపై 21-7, 21-7 తేడాతో విజయం సాధించింది. విచిత్రమేమంటే 2017లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకుహారాతో ఫైనల్‌ ‌పోరులో ఓడిన సింధు పోయిన దగ్గరే వెతుక్కో వాలన్నట్లు ఆదివారం జరిగిన ఫైనల్‌ ఆటలో జగజ్జేతగా నిలిచింది. ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు నాలుగు పతకాలు గెలుచుకున్న సింధు, ఈసారి స్వర్ణం గెలుచుకోవడంతో తన లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 2013లో చైనాలో అంతర్జాతీయ బాట్మింటన్‌ ‌సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ‌పక్షాన మొదటిసారిగా పతకాన్ని సాధించిన క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఆసియన్‌ ‌క్రీడలు, కామన్వెల్త్ ‌క్రీడలు, రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఫైనల్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఎలాగైనా బంగారు పతకాన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో కఠోరశ్రమ ఫలితంగా తా••గా స్విట్జర్లాండ్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచిన తొలి భారత షట్లర్‌గా విశ్వఖ్యాతిని సాధించుకుంది. దీంతో అత్యధిక పతకాలు గెలిచిన చైనా క్రీడాకారిణికి సమాన స్థాయిని సాధించుకోకగలిగింది. నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్‌ ‌చరిత్రలో చైనా క్రీడాకారిణి జాంగ్‌ ‌నింగ్‌ ఒక స్వర్ణం, రెండు రజితాలు, రెండు కాంస్యాలు గెలుచుకోవడం ద్వారా అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును సింధు సమానం చేసింది. తాజాగా సాధించిన స్వర్ణంతోపాటు గతంలో రెండు రజతాలు, రెండు కాంస్యాలను పొంది ఉండడంతో జాంగ్‌ ‌నింగ్‌తో సమానురాలైంది. తనపై వచ్చిన అనేక విమర్శలకు తన రాకెట్‌తోనే సింధు సమాధానమిచ్చింది. ఈ గెలుపు కోసం తాను కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానంటూ సింధు తన గెలుపుపై మాట్లాడటం చూస్తుంటే ఎంత కఠోర శ్రమ చేసిందన్నది అర్థమవుతోంది. ప్రపంచ చాంపియన్‌ ‌కన్నా అత్యంత గౌరవప్రదమైన పురస్కారమేముంటుందంటోన్న సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. విశ్వవిజేత సింధుకు యావత్‌ ‌భారత ప్రజలతోపాటు, విదేశాల్లోని భారతీయులంతా ప్రశంసలను అందజేస్తున్నారు. ‘దేశమంతా గర్వించదగిన క్షణాలివి, లక్షలాది మందికి ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందని’ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ అన్నమాటలు అక్షర సత్యాలు. కాగా, సింధు సాధించిన విజయాన్ని చూసి భారత్‌ ‌మరోసారి గర్విస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో తెలిపారు, రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులుకూడా అమెను ప్రశంసలతో ముంచెత్తారు. విజయపరంపర కొనసాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఈ ‌క్రీడలో స్వర్ణంగెలిచిన తొలి భారతీయురాలిగా నిల్వడం తెలుగువారికి గర్వకారణమని ఏపి సిఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి పేర్కొన్నతీరు క్రీడాకారులంద రికీ స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి. కేవలం ఇరవై నాలుగేళ్ళ వయస్సులో నాలుగు ప్రపంచ చాంపియన్‌ ‌పతకాలు, ఒలంపిక్స్‌లో రజితానికి తోడుగా సూపర్‌ ‌సిరీస్‌ ‌టోర్నీలో విజయాల పరం పరంలో ఇప్పుడు స్వర్ణాన్ని చేర్చుకున్న సింధు తన విజయాన్ని కన్నతల్లికి అంకితమివ్వడం తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న గౌరవభావానికి నిదర్శనం. మరో విచిత్రకర విషయమేమంటే కాకతాళీయంగా బంగారు పతకాన్ని పొందిన ఆదివారం నాడే సింధు తల్లి పుట్టినరోజు కావడం.
బ్యాడ్మింటన్‌ ‌వరల్డ్ ‌ఫెడరేషన్‌ ‌నేతృత్వంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ ‌పోటీలను 1977లో ప్రారంభించారు. 1983 వరకు మూడేళ్ళకు ఒకసారి ఈ పోటీలను నిర్వహి ంచగా, 1985 నుండి2005 వరకు ప్రతీ రెండేళ్ళకు ఒకసారి, ఆ తర్వాత 2006 నుండి ప్రతీఏటా నిర్వహిస్తున్నారు. ఈ చాంపియన్‌ ‌షిప్‌లో 1983లో కాంస్య పతకాన్ని సాధించిన ప్రకాశ్‌ ‌పడుకోన్‌ ‌తొలి భారతీయ క్రీడాకారుడు. కాగా నైనా నెహ్వాల్‌ 2015‌లో రజితం, 2017లో కాంస్యం సాధించగా, 2013, 2014లో కాంస్యం,, 2017, 2018లో రజతం సాధించి 2019లో సింధు స్వర్ణం గెలుచుకుంది. కాగా పురుషుల సింగిల్‌లో కూడా ఈసారి భారత్‌ ‌తనకీర్తిని చాటుకుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌, ‌రెండుసార్లు ఒలింపిక్‌ ‌స్వర్ణ పతకాలను సాధించుకున్న చైనా క్రీడాకారుడు లిన్‌ ‌డాన్‌ ‌పైన గెలుపొందిన ప్రణయ్‌ ‌క్రీడారంగంలో భారత్‌కు మరింత ప్రతిష్టను కట్టబెట్టాడు. ప్రపంచ 17వ ర్యాంకర్‌ ‌లిన్‌ ‌డాన్‌తో ప్రణయ్‌ ఇం‌తవరకు అయిదుసార్లు తలపడి మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలువడం విశేషం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy