వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌యురేనియం’పై నల్లమల బంద్‌

September 9, 2019

కదం తొక్కిన జనం… నాయకుల అరెస్ట్
పరిస్థితి ఉద్రిక్తం
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు కదం తొక్కారు. అఖిలపక్షం ఇచ్చిన బంద్‌ ‌పిలుపుతో నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌, ‌పదర మండలాల్లో సంపూర్ణ బంద్‌ ‌జరిగింది. బంద్‌ ‌సందర్భంగా పోలీసులు నాయకులను అరెస్ట్ ‌చేయడంతో ఆగ్రహించిన వేలాది జనం పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. శ్రీశైలం-హైదరాబాద్‌ ‌జాతీయ రహదారి జనంతో నిండిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్లమల నుంచి యురేనియం వెలికితీయొద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌ ‌చేయడంతో పాటు ఈగలపెంట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ, అఖిల పక్ష నాయకులు, యురేనియం వ్యతిరేక పోరాట జేఏసీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో వారిని అరెస్టు చేసి ఈగలపెంట పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడం వల్ల నల్లమల ప్రాంతంలోని 110 చెంచుపెంటలు, వన్యప్రాణులు, అటవీ సంపద నాశనం అయ్యే అవకాశం ఉందని.. వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సై అనడంతో స్థానికులు కూడా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని అంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి, యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని అంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. సోమవారం జరిగిన బంద్‌, ఆం‌దోళన కార్యక్రమాల్లో నల్లమల ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామని వారు హెచ్చరించారు.