Take a fresh look at your lifestyle.

‌మలుపులు తిరుగుతున్న ‘మహా’రాజకీయాలు

దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా మహారాష్ట్ర రాజకీయాలు పలు మలుపులు తిరుగుతూ చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోకి చేరింది. వింత రాజకీయ ఎత్తుగడలతో దేశ ప్రజలను ఆలోచింపజేస్తున్న ఇక్కడి రాజకీయలకు మంగళవారమైనా తెరపడుతుందా లేదా అన్నది ఆందరిని ఉత్కంఠతకు గురిచేస్తున్నది. మహారాష్ట్ర ప్రజలు ఈసారి ఏ రాజకీయ పార్టీకికూడా సంపూర్ణ మెజార్టీని ఇవ్వపోడం రాజకీయ అనిశ్చితకు దారితీసింది. సిఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న విషయంలో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఇదిమిత్థ్దంగా చెప్పలేకుండా ఉంది. విశ్వాసం, అవిశ్వాసం, అనైతికత, వెన్నుపోటు అన్నీకలగలుపుగా మారాయి ఇక్కడి రాజకీయాలు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులవుతారో, ఎప్పుడు మిత్రులవుతారో తెలియదన్నట్లుగానే కొద్దిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. రాజకీయ ఉద్ధ్దండులుకూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రివరకున్న పరిణామం తెల్లవారి నిద్రలేచేలోగా మారిపోయిందంటే రాజకీయ పార్టీలు నిద్రాహారాలుమాని ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్నది అర్థమవుతుంది. అనేక మలుపులు తిరుగుతున్న ఆ పరిణామాలను సామాన్య ప్రజలు, ఆయా పార్టీలు కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని రాత్రి హాయిగా నిద్రపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తెల్లవారి నిద్రలేచేసరికి మారిన సమీకరణలకారణంగా ఎంతటి మనస్థాపానికిగురైనాడంటే ఆఫీసుకెళ్ళి పనిచేయలేనని సెలవుపెట్టాడంటే ప్రజలు ఎంత టెన్షన్‌కు గురిఅవుతున్నారో అర్థమవుతున్నది. అలాగే ఒక ప్రధాన పార్టీకి చెందిన కార్యకర్త క్షణాల్లో మారిన పరిస్థితిని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినవార్తకూడా గుప్పుమంటోంది. పై రెండు సంఘటనలుకూడా శివసేనకు అధికారం వచ్చినట్లే వచ్చి జారీపోవడంతో ఆ పార్టీ వీరాభిమానులు తట్టుకోలేపోతున్నారు. బిజెపితో ఇంతకాలం సఖ్యతగా ఉన్న శివసేన ఇంతవరకు ఒకసారికూడా అధికారం చేపట్టలేదు. ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే స్థాయిలో ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై బేరసారాలుసాగించింది. బిజెపి అందుకు ససేమిరా అనడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం శివసేనకు వొచ్చింది. అయితే కాంగ్రెస్‌, ఎన్‌సిపి సహకరిస్తేతప్ప అధికారం చేపట్టే పరిస్థితి ఆ పార్టీకి లేకపోవడంతో, ఒక పక్క ఆ పార్టీలతో మంతనాలు జరుపుతున్న నేపథ్యంలోనే బిజెపి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనతోపాటు ఎన్‌సిపి పార్టీకి చెందిన అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఊహించని పరిణామం. విచిత్రమేమంటే వీరిరువురు ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రధాని మోదీ వారిని అభినందించడం. అంటే రాష్ట్రస్థాయినుండి, కేంద్ర స్థాయి నాయకులు మహారాష్ట్ర అధికారాన్ని తమ చేతినుండి ఎట్టిపరిస్థితిలో జారవిడుచుకోవద్దన్న దిశగా అనూహ్యంగా పావులు కదిపినట్లు స్పష్టమవుతున్నది. కాని, ఎన్‌సిపి అభిమానులనుండి బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. అనేక ఆరోపణలను ఎదుర్కుంటున్న అజిత్‌పవార్‌కు తాము మద్దతిచ్చేదిలేదని ఆ పార్టీ ఎంఎల్‌ఏలు, అభిమానులు ముక్తకంఠంగా చెబుతుంతడడం, పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌కూడా అజిత్‌పవార్‌ ‌చర్యను తీవ్రంగా ఖండించడంతో అజిత్‌ ‌పవార్‌ ‌తాను రాంగ్‌ ‌స్టెప్‌ ‌వేసానని భావించాడా అన్నట్లు తాను శరద్‌పవార్‌ ‌నాయకత్వంలో, ఎన్సీపీలోనే ఉన్నానంటూ చేసిన ప్రకటన గందగోళానికి దారితీసింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి వెనక్కురావాల్సిందిగా శరద్‌ ‌పవార్‌తోపాటు, ఎన్సీపీ నేతలంతా ఆయన్ను డిమాండ్‌ ‌చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం రాజీనామాపై స్పందించడంలేదు. దీంతో ఎన్సీపి రెండుగా విడిపోవడం ఖాయమంటున్నారు. ఇప్పుడు అజిత్‌పవార్‌ ‌వెంట ఎవరుంటారు, శరద్‌పవార్‌ ‌వెంట ఎవరుంటారన్నది తేలాల్సిఉంది. అలాగే శివసేనకు మద్దతిచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్‌ ‌పరిస్థితికూడా అలానే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం నిలుపుకోవాలని మంత్రాంగాన్ని నడుపుతున్న బిజెపి ఆకర్ష్ ‌పథకం కింద ఎంతమంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను ఆకర్షిస్తుందన్నది అర్థంకాకుండా పోయింది. ఇప్పుడీ మూడు పార్టీలు తమ ఎంఎల్‌ఏలను కాపాడుకునే పనిలోపడ్డాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం చేయించిన ఆ రాష్ట్ర గవర్నర్‌ ఏ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాడన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఆ విషయమై ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. ఏదిఏమైనా అధికారం చేపట్టేందుకు బిజెపికున్న 104 ఎంఎల్‌ఏలకు తోడు మరో 40 మంది మద్దతు అవసరం. ఎన్సీపిలోఉన్న 54 మందిలో ఎంతమంది ఆ పార్టీని వీడుతారన్నది అసెంబ్లీ బల పరీక్షలోకాని తేలదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!