Take a fresh look at your lifestyle.

‌బ్రహ్మోత్సవ శుభవేళ

భగవంతుణ్ని భక్తులు రకరకాల పేర్లతో పిలుస్తారు, కొలుస్తారు. ‘శ్రీవారు’ అనగానే స్ఫురించే దేవుడు మాత్రం- శ్రీ వేంకటేశ్వరుడే! దేశంలో ఎన్నో దేవాలయాలు క్షేత్రాలు ఉండగా- ‘కలియుగ వైకుంఠం’ అనే ప్రాశస్త్యం మాత్రం తిరుమల పుణ్యక్షేత్రానికే దక్కింది. సంస్కృతంలో సప్తగిరీశుడని, తేటతెలుగులో ఏడు కొండలవాడని భక్తులు స్వామిని ఆరాధిస్తూ గోవిందనామాలతో స్తుతిస్తూ, పరవశిస్తూ, తరిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో బిల్వపత్రాలతో అర్చన జరుగుతుంది. కాబట్టి స్వామివారు శివుడి అవతారమని కొందరి భావన. పద్మపీఠంపై వెలశాడు కాబట్టి బ్రహ్మదేవుడి అంశ అని కొందరి భావన. ‘కాదు, అది అమ్మవారి స్వరూపం. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకమే దానికి గట్టి ఆధారం’ అని మరికొందరంటారు. ఆనందనిలయానికి నలుదిక్కులా సింహ ప్రతిమలు, ‘బాలాత్రిపురసుందరి’ అని ధ్వనించే బాలాజీ పేరు- వారి వాదనను సమర్థించే సాక్ష్యాలు. వాస్తవానికి పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగేది- శ్రీవారి వక్షంపై కొలువున్న శ్రీమహాలక్ష్మికి! భక్తుల మనోభావాలను క్రోడీకరిస్తూ ‘కొలుతురుమిము వైష్ణవులు- కూరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు- పరబ్రహ్మం అనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులు- శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు- ఆది భైరవుడనుచు’ అని అన్నమాచార్యుడు అంటూనే ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు’ అని తేల్చాడు చివరకు. శ్రీనివాసుడు ఆయా సందర్భాల్లో ధ్రువమూర్తిగా, భోగమూర్తిగా, కొలువుమూర్తిగా, ఉగ్రమూర్తిగా, ఉత్సవమూర్తిగా కనువిందు చేస్తాడు. వాటికి పంచబేరాలని వ్యవహార నామం. ఆనంద నిలయం మధ్యభాగంలో సాలగ్రామం శివమూర్తిగా అభివ్యక్తమయ్యే దివ్యసుందర మహిమాన్విత మూలవిరాట్‌ ‌స్వరూపమే – ధ్రువమూర్తి.ధ్రువమూర్తి స్థానంలో నిత్యం అభిషేక భోగాన్ని ఏకాంత సేవాభాగ్యాన్ని అందుకొంటూ నిత్యశోభనమూర్తిగా విరాజిల్లే ‘మన్యళప్పెరుమాళ్‌’ (‌పెండ్లి కుమారుడు)- భోగ శ్రీనివాస మూర్తి! వైఖానస ఆగమం ‘కౌతుక మూర్తి’గా, ‘పురుష బేరం’గా వర్ణించింది… భోగమూర్తినే. మూలవిరాట్టుకు సుప్రభాత తోమాలసేవ ముగిశాక, స్నపన మండపంలో పసిడి సింహాసనంపై సుఖాసీనుడై, తిథివార నక్షత్రాలతో పంచాంగ నివేదనను ఆలకించే మూర్తి- కొలువుమూర్తి. ఆలయ ఆదాయ వివరాలు, హుండీ రాబడి, ప్రసాద విక్రయాల ద్వారా చేకూరిన సొమ్ము తదితరాలన్నీ కొలువు మూర్తికే విన్నవిస్తారు. తిరుమల ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో ఒకప్పుడు ఉగ్రశ్రీనివాస పంచలోక మూర్తులు విహరించేవి. 1330లో జరిగిన కొన్ని సంఘటనలరీత్యా ఈ ప్రతిమలను ఆనాటి నుంచి ఊరేగింపులనుంచి ఉపసంహరించారు. అయిదోది ఉత్సవమూర్తి. ఈయనకే ‘మలయప్పస్వామి’ అని పేరు. మూలవిరాట్టు స్వయంభువు అయిన సాలగ్రామశిలామూర్తి. మలయప్పస్వామి సప్తగిరుల్లో స్వయం వ్యక్తమైన పంచలోహమూర్తి. భక్తులను తన దగ్గరకు పిలిచి దర్శనమిచ్చేవాడు ధ్రువమూర్తి. భక్తులకు దగ్గరగావచ్చి అనుగ్రహించే స్వామి- ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి! ఈ పావన సంచారమూర్తి ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నప్పుడు మాత్రమే ధ్రువమూర్తికి అంటే మూలవిరాట్టుకు నివేదనలు జరుగుతాయి. శ్రీనివాస నిత్యకల్యాణమూర్తికి జరిగే ఉత్సవాలన్నింటా మకుటాయమానమని చెప్పుకోదగిన వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడే అంకురారోపణ జరుగుతోంది. ఈ శుభవేళ శ్రీవారి దివ్యానుగ్రహానికై మనం అందరం ప్రార్థిద్దాం!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy