Take a fresh look at your lifestyle.

‌ప్రధాని అలా మాట్లాడవచ్చా ?

ప్రధాని పదవిలో ఉన్నవ్యక్తి ఎవరైనా సాధారణ రాజకీయనాయకుడిలా మాట్లాడటమన్నది ఇప్పటివరకు జరుగలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ స్థానాన్ని అధిరోహించిన వారంతా ఆ పదవికున్న హూందాతనాన్ని కాపాడారు. ఒకవేళ ఎవరిగురించైనా విమర్శలు చేయాల్సి వచ్చినా నర్మగర్భితంగా మాట్లాడటం ద్వారా ఆ పదవికి వన్నెతెచ్చినవారే. అయితే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపట్ల పలువురు విమర్శిస్తున్నారు. ఆయన ఆ పదవికున్న హూందాతనాన్ని, గౌరవాన్ని నీరుగారుస్తున్నారన్నది వారి ఆరోపణ. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన ప్రసంగం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక్క మమతా బెనర్జీకే కాకుండా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌లాంటివారు కూడా మోదీని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్‌ అధికారపార్టీ తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మోదీ ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడిగా ప్రకటించాలని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆపార్టీ డిమాండ్‌ ‌చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఎదుటిపార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే 72 గంటలపాటు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మోదీ చేసినవ్యాఖ్యలకు ఆయనకు కేవలం 72 గంటలే కాదు, 72 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని సమాజ్‌వాదిపార్టీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ ‌చేశాడు. ఈ మొత్తం వివాదానికి మమతా బెనర్జీని కించపర్చే విధంగా ప్రధాని మాట్లాడటమే ప్రధానకారణం. రెండు రోజుల కింద పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘దీదీ.. ఆప్‌కో ఢిల్లీ బహుత్‌ ‌దూర్‌హై’ అంటూ మాటలు సంధించాడు. మే 23న వెలువడే ఫలితాల్లో దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందని చెప్పడంతోపాటు, ప్రధాని కావాలన్న మమత కల కలగానే ఉండిపోతుందని భవిష్యవాణిని చెప్పాడు మోదీ. కొన్ని సీట్లతో మమత ఢిల్లీని చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే తృణముల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన 40మంది ఎంఎల్‌ఏలు తనతో సంప్రదిస్తున్నారంటూ ఒక విధంగా మాహాకూటమి కట్టాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల గుండెలపై బాంబు వేసినంతపని చేశాడు మోదీ. మహాకూటమి కట్టే విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ మమత బెనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి కావడం కూడా ఇందుకు మరో కారణం. ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంట్‌ ‌స్థానాలుండగా, మహారాష్ట్రలో 48, ఆ తర్వాత 42 స్థానాలతో పశ్చిమ బెంగాల్‌ ‌నిలుస్తుంది. 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తృణముల్‌ ‌కాంగ్రెస్‌ 211 ‌స్థానాలతో అధికారాన్ని చేపట్టింది. అలాగే ఇక్కడున్న 42 పార్లమెంట్‌ ‌స్థానాల్లో 34 స్థానాలను ఆ పార్టీనే గెలుచుకుంది. ఇంత పెద్ద రాష్ట్రంలో తమ జంఢా ఎగురవేయాలని కాషాయ పార్టీ చాలాకాలంగా ప్రణాళిక రచిస్తున్నది. దానికి తగినట్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్‌కు, ఈ రాష్ట్ర సిఎం మమత బెనర్జీకి ఉప్పులో నిప్పులా ఉంది. దీంతో కేంద్రంలో బిజెపి సర్కార్‌కు మరోసారి అవకాశం రాకుండా చేయాలన్న దీక్షతో ఆమె కేంద్రరాజకీయాలపై దృష్టిసారించింది. అది మహాకూటమి రూపంలో రూపుదిద్దుకుంటోంది. దీని సారథులుగా మమతతోపాటు మరికొందరి పేర్లు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైర్‌ ‌బ్రాండ్‌గా ఉండే మమతకు ఏమాత్రం అవకాశం రాకూడదన్న లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోనే ఆమెను డి ఫేమ్‌ ‌చేయాలన్నది మోదీ లక్ష్యంగా కనిపిస్తోంది. అక్కడి ప్రజల్లో నైరాశ్యాన్ని కలిగించే విధంగా తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని మోదీ ప్రకటించారు. మే 23న ఫలితాలు వెలువడిన వెంటనే వారంతా బిజెపిలోకి మారిపోతారన్నది ఆయన ప్రసంగంలోని సారాంశం. అప్పుడు మమత మనుగడ సాగించడమే కష్టమై పోతుందనడం వెనుక, మమత ప్రభుత్వం అంతమవుతుందన్న సంకేతాలను మోదీ తన మాటల్లో చెప్పకనే చెప్పినట్లు అయింది. అంతటితోనే మోదీ తన దాడిని ఆపలేదు. దీదీ.. ప్రజలను మోసం చేసిందని, ఆమె ప్రభుత్వంలో అవినీతి పెచ్చుపెరిగిందని, ప్రభుత్వ పెద్దల సిద్దాంతాలను వ్యతిరేకించిన వారి అంతం చూస్తున్నారంటూ, తాజాగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు హింసాయుతంగా మారిన విధానాన్ని ఎత్తి చూపాడు, ఆమె కనుసన్నల్లో ఏర్పాటు అవుతున్న మహాకూటమిని మహా నకిలీ కూటమంటూ చేసిన విమర్శలు మమతను టార్గెట్‌ ‌చేస్తున్న విషయం సుస్పష్టం. కాగా, మోదీ మాటలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కించపర్చేవిగా ఉన్నాయని ఏపి సింఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తాడు. ఎన్నికల సంఘం ఆయన మాటలను సుమోటాగా తీసుకుని కేసు నమోదుచేయాలని డిమాండ్‌ ‌చేశాడు. ప్రధాని పదవిని, హోదాను మోదీ దిగజారుస్తున్నాడని, ఆ పదవిలో ఉన్న వ్యక్తులెవరూ ఇంతవరకూ ఇంతఘోరంగా మాట్లాడ లేదంటూ తీవ్రంగా విమర్శించారు., 125 కోట్ల భారతీయ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాని మోదీ నలభై మంది ఫిరాయింపు ఎంఎల్‌ఏ ‌లపై ఆధారపడినట్లు స్పష్టమవుతుందని యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ఆరోపించారు. తానే స్వయంగా ఫిరాయించే విషయాన్ని చెప్పడమంటే ఆయనవద్ద ఉన్న నల్లధన వ్యక్తిత్వాన్ని ఆయన బహిర్ఘతం చేసుకుంటున్నాడన్నది స్పష్టమవుతుందంటున్నారు అఖిలేష్‌. ఇలాంటి వ్యక్తిని రాజకీయాలనుండే నిషేధించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాడు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్యదేశంలో ప్రధాని హోదాలో ఉన్నవ్యక్తి ఎవరైనా కులాలు, మతాలు, ఫిరాయింపులగురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నదే దేశంలో ప్రధాన చర్చ అవుతున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!