Take a fresh look at your lifestyle.

‌ప్రత్యామ్నాయం ఏర్పాట్లకు్ల కాదు..పరిష్కారానికి కావాలి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఈ నెల అయిదవ తేదీ అర్ధరాత్రి నుండి ప్రారంభించిన సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం తమ బెట్టు నుండి ఒక్క మెట్టు కూడా దిగేదిలేదని బీష్మించుకు కూర్చున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లలో తలమునలై ఉంది. అంతేగాక ఈ సంస్థ భవిష్యత్‌పై అధికారులతో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నది. ప్రధానంగా ఈ సంస్థను ప్రైవేటు వైపు మళ్ళించే దిశగా ఆలోచిస్తున్నదన్నది ఆ మంతనాల పర్యవసానంగా అర్థమవుతున్నదన్న దంటున్నారు కార్మిక సంఘం నాయకులు, విపక్షాలు. ముప్పై రోజుల కింద తమ సమస్యలను పరిష్కారించాలని నోటీసిచ్చిన కార్మికులతో సంబంధింత మంత్రిగాని, ముఖ్యమంత్రిగాని నేరుగా చర్చించకుండా ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ముందుపెట్టి ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని అమలు చేస్తున్నదన్నది వారి ఆరోపణ. దశాబ్ధాలుగా అప్పుల భారంతో కుంగిపోతున్న ఆర్టీసీని దారిలో పెట్టాల్సి ఉందని గతంలో అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అం‌టే, దాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించే కొత్త ఆలోచనేదైనా చేస్తాడని అనుకున్నారే గాని, ప్రైవేటు పరం చేసే వైపుగా ఆయన ఆలోచన ఉందని ఊహించలేకపోయారు. వాస్తవంగా ఆర్టీసి నష్టాల్లో నడువడానికి ఆర్టీసి కార్మికులకేమాత్రం సంబంధంలేదన్నది కార్మికనాయకులు అంటున్న మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మొదలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంస్థను ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసారన్నది అందరినోట వినిపిస్తున్న మాట. ఆర్టీసీకి కావల్సినన్ని హంగులున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమైనట్లే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కూడా విఫలమైందంటున్నారు. ఈ సంస్థపై పన్నుల రూపంలో విధించిన సొమ్మంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ప్రజలకు అతి చౌకగా లభించే ఏకైక రవాణా సంస్థపైన పన్నులేమిటని ప్రభుత్వం ఏనాడు ఆలోచించి, వాటిని ఎత్తివేయలేదు. ప్రజలతో పాటు సరుకులను కూడా చేరివేసే విధంగా ఈ సంస్థ వాహనాలను కమర్షియల్‌గా వాడుకుని లాభాలార్జించవచ్చన్న ప్రత్యామ్నాయ ఆలోచన కూడా ఏనాడు చేయలేదు. విశాలమైన ఆర్టీసి స్థలాల్లో రెస్టారెంట్‌లు, సినిమాహాల్స్, ‌గెస్ట్ ‌హౌజ్‌లు లాంటివాటిని ఏర్పరచడం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయవనరులపై దృష్టిసారించకుండా ఎంతసేపు నష్టాల అంకెలు చూపించి, దాన్ని ఎప్పుడు ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన)కే ప్రభుత్వాలు పరిమితమైనాయి. సంస్థ బాగోగులు పట్టించుకునే చైర్మన్‌ ‌కూడా గత రెండు సంవత్సరాల కాలంగా లేకపోవడం కూడా ఆర్టీసిలో ఏం జరుగుతున్నదన్న విషయం ప్రభుత్వానికి అర్థం కాకుండా పోయిందన్న ఆరోపణ కూడా ఉంది. కనీసం చర్చల్లో పాల్గొని కార్మికుల అభిప్రాయాలను పంచుకునే పరిస్థితిలో మంత్రి లేకపోవడం లాంటి అనేకానేక లోపాలను వారు ఎత్తిచూపుతున్నారు. వీటన్నిటిపైన అటు కార్మికులు, కార్మిక నాయకులు, సంబంధిత అధికారులు, ప్రతిపక్షాలతో చర్చించినట్లైతే ఈ సమస్యకు సులభమార్గం ఏర్పడేది. కాని, ఒక్కసారి కూడా కార్మి••నాయకులతో మాట్లాడకుండా, వారి బాధలు అర్థం చేసుకోకుండా, వారిని అనునయించే ప్రయత్నం చేయకుండా కేవలం సమ్మె చేపట్టడమే తప్పు అన్న ఒకే ఒక తప్పిదాన్ని చూపించి, నలభైవేల మంది కార్మికులు మాజీలైపోయారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పేర్కొనడాన్ని సర్వజనులూ ఆక్షేపిస్తున్నారు. వీరంతా రాష్ట్రం కోసం టిఆర్‌ఎస్‌ అధినేతగా కెసిఆర్‌ ఇచ్చిన పిలుపునందుకుని ఉద్యమానికి ఊతమిచ్చిన వారు కాదా ! సుమారు పదిహేడు రోజులు ఆనాటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి సమ్మెలో పాల్గొన్న వారు కాదా అని ప్రభుత్వాన్ని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసి ఉద్యోగుల వేతనాల సవరింపు విషయంలో ప్రభుత్వం అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించినవారు సరాసరి ముఖ్యమంత్రే వారిని చర్చలకు పిలిచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో, నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని ఎలా అభివృద్ధిపర్చుకోవాలన్నది తన ఆలోచనలో ఏముందన్నది చెబితే వినని తరహాలో కార్మికులు లేరన్న భావన ప్రజల్లో ఉంది. అలాంటి ఆవకాశాన్ని కాదని, ఏకంగా ఉద్యోగులందరినీ మాజీలనడం ఎంతవరకు సరైందని వారు ప్రశిస్తున్నారు. అయితే కార్మికులు కూడా కొంత సంమయనం పాటించాల్సి ఉండిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్‌ అన్నట్లు నిజంగానే ఈ అకాల సమ్మెతో ఆర్టీసి కార్మికులు ప్రజల నుండి సానుభూతిని కోల్పోయారు. తమ డిమాండ్లు న్యాయపరమైనవే అయినప్పటికీ మనది అనుకునే తెలంగాణలో మన బతుకమ్మ, మన దసరా పండుగలకు ఇబ్బందిపెట్టే నిర్ణయాన్ని ప్రజలు ఏమాత్రం సహించలేకపోతున్నారు. పండుగ సందర్భంలో ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇక్కడ ఇబ్బంది పడింది, ఆర్థికంగా నష్టపోయింది ప్రజలేనన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంది. ఇరువర్గాలు సంయమనం పాటిస్తే ఇంత తీవ్రమైన పరిస్థితులు వచ్చేవి కావంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రత్యామ్నాయం, సాధ్యమైనంత మేర ప్రైవేటు రవాణ వైపే మొగ్గు చూపేదిగా కనిపిస్తున్నది. దీనివల్ల ఒక పక్క కార్మికులు నష్టపోతుండగా, మరోవైపు ఛార్జీల మోతతో ముందు ముందు సామాన్య ప్రయాణీకులపై పెనుభారం పడే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఏకపక్షంగా ఆలోచించకుండా, సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ పాత్ర పోషించేలా చొరవ తీసుకోవడం సమంజసంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy