వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌నవరత్నాలే జగన్‌ ‌కు ప్రత్యామ్నాయం

August 8, 2019

కశ్మీర్‌ ‌కు  70 ఏళ్ళుగా సాగుతున్న ప్రత్యేక ప్రతిపత్తిని  రద్దు చేస్తూ పార్లమెంటు ఉభయ సభలూ బిల్లును ఆమోదించడంతో దేశంలో   వివిధ రాష్ట్రాల నుంచి  ఎంతో కాలంగా  వినిపిస్తున్న  ప్రత్యేక హోదా డిమాండ్‌  ‌పరిస్థితి   ఏమిటన్న  సందిగ్ధత  ఏర్పడింది. నిజానికి  కాశ్మీర్‌ ‌కు  ప్రత్యేక ప్రతిపత్తికీ,  ఆంధ్రప్రదేశ్‌ ‌కి ప్రత్యేక హోదాకూ ఏమాత్రం సంబంధం లేదు. అయినా   కేంద్రం  ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేస్తే చేయగలిగింది లేదు.   ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి   పరిస్థితి ఇరకాటంలో పడినట్టుగా కనిపిస్తోంది.  సాధారణ ఎన్నికల్లో ప్రత్యేక హోదా  డిమాండ్‌ ‌ను సాధిస్తామన్న హామీతోనే ఆయన అధికారంలోకి వొచ్చారు.ఇప్పుడు కూడా అదే డిమాండ్‌ ‌ను సమయం వచ్చినప్పుడల్లా  ప్రస్తావిస్తున్నారు. ఈ వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ , రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌, ఇతర మంత్రులు, ప్రముఖులను ఆయన  వరుసగా కలుసుకుని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ‌ను  గురించి  మరో సారి గుర్తు చేశారు.   కేంద్ర నాయకుల నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించిన దాఖలాలు లేవు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి ఏమీ మాట్లాడకపోయినా, ఆ మధ్య పార్లమెంటులో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని ఖరాకండీగా స్పష్టం చేశారు. వైసీపీ ని ఇరకాటంలో పెట్టేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఆయన కుమారుడు   నారా లోకేష్‌  ‌ట్విట్టర్ల ద్వారా   జగన్‌ ‌పై విమర్శలు కురిపిస్తున్నారు . ప్రత్యేక హోదా డిమాండ్‌ ‌కొత్తది కాకపోయినా,   వెనుకటి యూపీఏ ప్రభుత్వం ఆ హామీ ఇచ్చినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ వంత పాడినా, ఇప్పుడు మాట మార్చింది.    ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే ఎంతో మేలని పూర్వపు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుని  ఒప్పించింది. అప్పట్లో చంద్రబాబు   ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలని పట్టు పట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. అప్పట్లో  తెలుగుదేశం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌ ‌డిఏ కూటమిలో భాగస్వామ్య  పక్షంగా ఉండేది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత రాజకీయంగా అనుకూలతలూ, ప్రతికూలతలను బేరీజు వేసుకుని  ప్రత్యేక హోదా  వైపు ప్లేటు ఫిరాయించారు. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి  చంద్రబాబు నాయుడు అవకాశ వాదాన్ని ప్రజలకు వివరించి తమ పార్టీకి   లాభం జరిగేట్టు చేసుకోగలిగారు కానీ, ఇప్పుడు ఆయన పరిస్థితి ఆలాగే ఉంది.  కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వొచ్చిన తర్వాత బీజేపీ మరింత   కటువుగా వ్యవహరిస్తోంది. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన దృష్ట్యా ఎవరినీ లెక్క చేసే స్థితిలో లేదు. ఎంతో కాలంగా పెండింగ్‌ ‌లో ఉన్న   ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు,  370వ  అధికరణం రద్దు వంటి బిల్లులను  రాజ్యసభలో ఇప్పటికీ మెజారిటీ లేకపోయినా ఆమోదింపజేసుకోవడంతో  కమలనాథుల్లో   గాంభీర్యత  వచ్చింది.   మిత్ర పక్షాలైనా,ఇంతవరకూ తమకు సహకారం అందించిన పార్టీలైనా,   వివాదాస్పద బిల్లులను రాజ్యసభలో సమర్ధించిన  వైసీపీ వంటి పార్టీలైనా ఎవరినీ ఖాతరు చేయని ధోరణి కమలనాథుల్లో కనిపిస్తుంది. ఈ తరుణంలో  జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి   పైకి కక్కలేని, మింగలేని పరిస్థితిలో ఉన్నారు.   ప్రస్తుత పరిస్థితులలో కేంద్రంతో పోరాటం సాగించి  గెల్చే సత్తా ఏ పార్టీకీ లేదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ ‌చేతులెత్తేసింది   దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన  కాంగ్రెస్‌ ‌పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది.ఈ పరిస్థితిలో   జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కేంద్రాన్ని  పిడికిలి బిగించి అడిగే పరిస్థితి  లేనే లేదు.   కేంద్రంతో సర్దుకుని పోతేనే  రాష్ట్రానికి నిధులు వస్తాయన్న నినాదంతో  ఆయన ప్రజలవద్దకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.ఇప్పటికే ఆయన ఆ బాట పట్టారు.    అయితే, ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నప్పటికీ,  అప్పుడే అది సాధ్యం కాదు. జగన్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు,     నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలుకు  తీసుకుంటున్న శ్రద్ధ ఆయనకు  ప్రజల్లో  అనుకూలతను  పెంచే అవకాశం ఉంది.     ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి నవరత్నాల పైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.   ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని  ఇటీవలి వరకూ తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు బీజేపీ లో చేరిన   రాజ్యసభ సభ్యులు  కోరస్‌ అం‌దుకున్నారు.    జగన్‌  ‌పాలనా పరమైన పట్టు  సంపాదించే వరకూ    ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించవచ్చు.  నవరత్నాలే ఆయన  ముందున్న ప్రత్యామ్నాయం.వాటిని చిత్తశుద్ధితో ,నిజాయితీతో  అమలు చేయడం ద్వారా  ప్రజలను మరిపింపచేయడానికి  ప్రయత్నించవచ్చు