వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌తెలంగాణలో బిజెపి పట్టు బిగుస్తున్నదా,,?

September 13, 2019

తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేస్తామని చెబుతున్న బిజెపి ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నది. ఉత్తరాది మాదిరిగా దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగురవేయాలంటే ముందుగా తెలంగాణతోనే ప్రారంభించాలన్న ఆపార్టీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు బిజెపి ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజామాబాద్‌ ‌మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వం వహిస్తున్న సింగరేణి కార్మిక సంఘంలో చీలిక ఏర్పడబోతున్నట్లు తెటుస్తున్నది. తెరాసకు నిన్నటివరకు అండగా నిలిచిన టిబీజీకేఎస్‌ ఇప్పుడు రెండుగా విడిపోతుందన్న వార్తలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెరాసనాయకుల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఏనాడు నోరుతెరిచి ఎరుగని నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ అధినాయకత్వంపై తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. వీరిలో చాలామంది పార్టీ మారే అవకాశాలున్నట్లు వార్తలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. కెసిఆరే తమదేవుడు, ఆయన పెట్టిందే రాజకీయ బిక్ష అని చెబుతూనే తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొందురు బాహాటంగా తమఅసంతృప్తిని వ్యక్తంచేస్తుంటే, మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా మరో పార్టీనాయకులతో చర్చలు జరుపుతున్నారు. వీరంతా ప్రధానంగా భారతీయ జనతాపార్టీవైపే మొగ్గుచూపుతున్నట్లు వినికిడి. ఇలా గోడదూకడానికి సిద్ధంగా ఉన్నవారు దాదాపు ఎనిమిది నుండి పదిమంది వరకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెరాసలో ఈటలతో ప్రారంభమైన ఈటల పోట్లు క్రమేణ పెరుగుతునే ఉన్నాయి. రసమయి బాలకిషన్‌, ‌నాయిని నర్సింహరెడ్డి, తాటికొండ రాజయ్య, మైసంపల్లి హనుమంతరావు, జీవన్‌రెడ్డి, జోగురామన్నతో పాటు తాజాగా షకీల్‌ ఒక్కొక్కరు ఒక్కోరకమైన అసంతృప్తిని ప్రకటిస్తూనే ఉన్నారు. తెరాస అధిష్టానవర్గం సత్వరం స్పందించి పార్టీకి మరింత నష్టం కలుగకుండా వారిని బుజ్జగించ•ంతో, తాము పార్టీ మారడం లేదని, అసంతృప్తి ఏమీలేదని చెప్పించినప్పటికీ అంతర్ఘతంగా అది రగులుతూనేఉంది. వారికోసం భారతీయ జనతాపార్టీ తలుపులను బార్లాగా తీసి ఉంచిన విషయం తెలిసిందే. ఎవ్వరు వచ్చినా, ఎంతమంది వచ్చినా అందరిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీవర్గాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో తాజా మంత్రివర్గాన్ని విస్తృతపర్చేవరకు చాలామంది టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వేచిచూసే ధోరణిలోనే పార్టీలో కొనసాగుతున్నారని ఈ నిరసనలే తెలుపుతున్నాయి. దాదాపు తొమ్మిది నెలల తరువాత విస్తరిస్తున్న మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఇంత కాలంగా ఆశగా ఎదురుచూసినవారు కొందరైతే, గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ఏదో విధంగా తమను అధికార పదవుల్లో కూర్చోబెడుతారనుకున్నవారికి నిరాశ ఎదురైంది. ఇదే తరహాలో కార్మికనాయకులు కూడా కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా సింగరేణి విషయానికొస్తే టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా తీసుకువచ్చే విషయంలో విశేష కృషిచేసిన ఆ సంఘం వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెంజర్ల మల్లయ్య ఈ సంఘాన్ని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే తెరాసకు ఎంతో అండగా నిలిచిన టీబీజీకేఎస్‌ ‌రెండుగా చీలే ప్రమాదం ఉంది. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా రాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతాపార్టీ మల్లయ్యను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభించినట్లు తెలుస్తున్నది. దాదాపు ఆరవై వేలమంది కార్మికులుండి, ఆరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక యూనియన్‌గా టిబీజీకేఎస్‌ ‌పట్టుకోల్పోతే దాని ప్రభావం తెరాసపై తీవ్రంగా పడే ప్రమాదముంది. ఇప్పటికే మల్లయ్య బిజెపి అనుబంధ భారతీయ మజ్దూర్‌ ‌యూనియన్‌లో చేరుతారన్న వార్త విస్తృత ప్రచారంలో ఉంది. ఆ మేరకు ఆయన ఆరు జిల్లాల్లోని గని కార్మికులతో సమావేశాలు కూడా జరిపినట్లు తెలుస్తున్నది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గని కార్మికుల విషయంలో తెరాస పెద్దగా పట్టించుకోవడంలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. దానికి తగినట్లు సింగరేణి సంస్థను రాష్ట్ర ఆధీనంనుండి తప్పించాలని చాలా కాలంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. మోదీ మొదటిసారిగా ప్రధాని అయిన తర్వాత కూడా కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. అయితే రాష్ట్రానికి తలమానికమైన ఈ సంస్థను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి తన అయిష్టతను వ్యక్తంచేస్తూనే ఉంది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో కేంద్రం వాటా 49 శాతమైతే, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతముంది. ఆరవై వేల మంది కార్మికులున్న ఈ సంస్థ మొదటి నుండి టిఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి కార్మికులు ఏనాడు ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విషయాల్లో తగిన ప్రాధాన్యతనిచ్చింది. కార్మికులకు ఆర్థిక వెసులుబాటును కలిగించింది. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలప్పటి నుండి తమ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నది కార్మిక నాయకుల ఆరోపణ. ఆందులో భాగంగానే మల్లయ్య బిజెపితో మంతనాలు సాగిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. 2014లో తెలంగాణలో వోటు బ్యాంకును పెంచుకునేందుకు బిజెపి పథకం ప్రకారమే సింగరేణి కార్మిక సంఘాన్ని చీల్చే కుట్రచేస్తున్నదని టిఆర్‌ఎస్‌ ‌వర్గాలు ఆరోపిస్తున్నాయి.