Take a fresh look at your lifestyle.

‘‌డేట్‌ ‌లైన్‌ ఔట్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’.

ఫోటో : జాతీయ, అంతర్రాష్ట్రీయ ఏపీ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన దేవులపల్లి అమర్‌ను సన్మానిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఐ అం‌డ్‌ ‌పిఆర్‌ ‌కమిషనర్‌ ఐకె రెడ్డి, పక్కన మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

ఆయనో కలం యోధుడు… అధికారం ఆయనకు ఎప్పుడూ దగ్గరలోనే ఉండేది ….అంది పుచ్చుకున్న ప్రతి అవకాశాన్ని ఆయన కలం కార్మికులకే అంకితం చేశారు….ఇప్పటి దాకా ఆయన జర్నలిస్ట్ ‌సమాజానికి జాతీయ నాయకుడు అయినప్పటికీ ఆయనను సంభోదించేది మాత్రం డేట్‌ ‌లైన్‌ ‌హైదరాబాద్‌ ‌గానే. అటువంటి నిరాడంబరుడిని ఇకపై డేట్‌ ‌లైన్‌ ఔట్‌ ఆఫ్‌ ‌స్టేట్స్ అని పిలువాలంటే ఒకింత ఇబ్బంది గానే ఉంటుంది. కానీ తప్పదు కదా. ఇప్పుడున్న జర్నలిస్ట్ ‌సమాజానికి ఆయనో పితామహుడుగానే అభివర్ణించాలి. ఈనాడు, ఉదయం, ఆంధ్రప్రభ దినపత్రికలలో ఉన్నత స్థానాలలో పనిచేసినప్పటికీ ఎప్పుడూ జర్నలిస్ట్ ‌సమాజం కోసం పని చేసిన ఆయనకు వచ్చిన అవకాశం అహ్హనించదగ్గదే. దివంగత వైఎస్‌ఆర్‌తో సంబంధం ఉన్నప్పటికీ ఆనాటి కాకినాడ ఎంఎల్‌ఏ ఆం‌ధ్రప్రభ ఎండి ముత్తా గోపాల కృష్ణ (తనయుడు గౌతమ్‌)‌తో ఆంధ్రప్రభ కార్మికులకు ఏర్పడ్డ అఘాథాన్ని సమయస్ఫూర్తితో పూడ్చిన కలం యోధుడు ఆయన. ఆంధ్రప్రభలో ఆయన కింద పనిచేసినప్పుడు నాకు ఎదురైన సంఘటనలో ఆయన అందించిన చేయూత నన్ను ఈనాడు ఈ స్థాయి లో నిలబెట్టింది. 1991 ప్రాంతంలో అనుకుంటా కరీంనగర్‌కు చెందిన జగపతి రావు, నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, రఘుమా రెడ్డిలు తెలంగాణా ఫోరమ్‌గా ఏర్పడి దిల్‌షుఖ్‌ ‌నగర్‌ ‌వద్ద ఓ బహిరంగ సభ నిర్వహించారు. దాని కవరేజ్‌ అసైన్‌మెంట్‌ ‌ముందురోజు నాకు పడింది. (అప్పుడు వాట్సాప్‌లు పేజర్లు, కనీసం ల్యాండ్‌ ‌ఫోన్‌లు కూడా లేవు) తీరా మీటింగ్‌ ‌టైంకు నా బదులు మరో సీనియర్‌కు ఆ ప్రోగ్రాం అసైన్‌మెంట్‌ ‌మార్చారు. ఆ విషయం తెలియని నేను సభాస్థలి వద్దకు చేరుకోగానే సీనియర్‌ ‌రిపోర్టర్‌ను చూసి విష్‌ ‌చేశాను. అందుకు ఆయన ప్రతిగా విష్‌ ‌చేస్తూ ఈ ప్రోగ్రాం నన్ను చూసుకోమన్నారని చెప్పారు. సరే సార్‌ అం‌టూ….ఇక ఆఫీస్‌కు పోయేది లేదు కదా అనుకుని అక్కడి నుండి జారుకున్నాను. తీరా తెల్లారి పేపర్‌ ‌చూస్తే అసలు ఆ వార్తే కనిపించలేదు. నాకు ఎదో కీడు శంకించింది. ఏమి చెయ్యాలో తోచలేదు. సరేలే అని సరిపెట్టుకుని లోయర్‌ ‌ట్యాంక్‌బండ్‌ ‌రోడ్‌ ‌లోని ఆంధ్రప్రభ కార్యాలయానికి చేరుకున్నాను. అక్కడ ఏదో సీరియస్‌ ‌వాతావరణం ఉందని గమనించాను. కానీ నాకెందుకులే అని గమ్మున ఉండి పోయాను. ఈ లోగా సార్‌ అమర్‌ ‌సార్‌ ‌రమ్మంటున్నాడు అంటూ సిటీ బ్యూరోలో ఉన్న నాకు కబురు అందింది. ఇక తప్పేలా లేదనుకుని సార్‌ ‌వద్దకు చేరుకుంటే ….ఏమయ్యా….మేము ఉద్యోగాలు చెయ్యడం నీకు ఇష్టం లేదా అంటూ కస్సు మన్నాడు. బాస్‌ ఈజ్‌ అల్‌వేస్‌ ‌కరెక్ట్ అని నమ్మే నేను ఏమి చెప్పాలో తొయ్యలేదు. మళ్ళీ ఆయనే నిలదీసే సరికి ….జరిగిన విషయం ఆయన చెవిలో వేశాను. జరిగిన విషయం తెలుసుకున్న ఆయన నాకు ఎదో పనిష్మెంట్‌ ఇస్తారనుకున్నా. కానీ అందుకు భిన్నంగా విషయం అర్థం అయింది. ఇక నీ పని నువ్వు చూసుకోపో అంటూ అక్కడి నుండి పంపించి వేశాడు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే విధి నిర్వహణలో జరిగిన వైఫల్యాన్ని నా మీద నెట్టేసి వెంటనే నన్ను తొలగించే అధికారం ఆ రోజు ఆయనకు ఉంది. కానీ ఒక్క కలం యోధుడిని కాపాడడం కోసం ఆ తప్పును తన మీద వేసుకున్న పెద్ద మనిషి ఆయన. జరిగిన దృష్టాంతం చిన్నదే కావొచ్చు కానీ కలం కార్మికులకు యాజమాన్యాలకు అంతరాలను తొలగించేందుకు ఉన్నత స్థానంలో ఉండి మంచి సంబంధాలు నెరిపిన ఆయన అంతర్రాష్ట్ర సంబంధాలకు ఆయన అన్ని విధాలా అర్హుడే అన్నది నా అభిప్రాయం. అన్నింటికి మించి జర్నలిస్ట్ ‌నాయకుడు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పులిపాటి కరుణాకర్‌ ‌మృతి చెందినప్పుడు…..జర్నలిజం సమాజంలో వేలాది మందికి ఓనమాలు దిద్దిన కరుణాకర్‌ ‌రెడ్డి మృతి చెందిన సందర్భంలో…. జర్నలిస్టులకు మావోయిస్టులకు సంబంధాలు అంటగట్టి ఉత్తర తెలంగాణా జిల్లాలో పోలీసుల వేదింపులను నిలువరించే ప్రయత్నంలో అధికార పార్టీలో ఉన్న వారికి కంటగింపు అయినా ఆయన మాత్రం నిలబడ్డది కలం యోధుల పక్షానే. అందుకే స్వతహాగా తెలంగాణా వాది అయినప్పటికీ జర్నలిస్ట్ ‌సమాజంలో రెండు తెలుగు రాష్ట్రాలకు నాయకత్వం వహించినందుకో….దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధమో తెలియదు కానీ ఆయనను ఏకంగా ‘డేట్‌ ‌లైన్‌ ఔట్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’ అని సంభోదించాల్సి వచ్చింది.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy