Take a fresh look at your lifestyle.

‌గిచ్చి కయ్యం పెట్టుకునే చైనా

భారతదేశానికి అత్యంత ప్రధాన శత్రువు చైనాకు మొదటినుండి గిచ్చి కయ్యాలు పెట్టుకునే అలవాటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించడం, పైగా భారతే తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని అబద్దాలు చెప్పడం ఆదేశానికి పరిపాటే. ఒక్క భారత్‌తోనే గాక చైనా ఇతర దేశాలతోని కూడా ఇలానే వ్యవహరిస్తోంది. ఈ దేశం సరిహద్దుల్లో ఉన్న దాదాపు పద్దెనిమి దేశాలతో చైనా ఏదో రకంగా వివాదాన్ని సృష్టించుకుని వాటితో నిత్యం గొడవ పడుతూనే ఉంది. సరిహద్దు వివాదమో, ఇతర రాజకీయపరమైన అంశాలతోనో ఇన్ని దేశాలను చికాకులో పెట్టి తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంటుంది. చైనా, ఇండియా మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం చాలా వరకు అందరికీ తెలిసిన విషయం. కాని వియత్నాంతోకూడా చైనాకు సరిహద్దు వివాదముంది. వియత్నాంకు చెందిన మాకిల్స్ ‌ఫీల్డ్ ‌బ్యాంక్‌, ‌పారాసీల్‌ ఐస్‌ ‌లాండ్‌ ‌లాంటి చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు దక్షిణ చైనా సముద్రంలోని భాగాలను, స్ప్రాట్లీ ఐస్‌ ‌లాండ్స్‌ను చైనా తనవని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై చైనా ఫిలిప్పీన్స్‌ల మధ్య చాలా కాలంగా ఘర్షణ నెలకొని ఉంది. అగ్రరాజ్యాల్లో ఒకటైనా రష్యాతోకూడా వివాదముంది. లక్షా అరవై వేల స్క్వేర్‌ ‌కిలోమీటర్ల రష్యా భూభాగాన్ని చైనా తనదిగా వాదిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని చైనా ఏనాడు ఖాతరు చేయదు. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై సింగపూర్‌తో కూడా వివాదముంది. ఈస్ట్ ‌చైనాలోని దక్షిణ కోరియాను, ఇటు భూటాన్‌ ‌తమ దేశ పరిధిలోనివేనని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్ర పరిదిలోని తైవాన్‌పై ఎప్పటినుండో చైనా కన్నుంది. అలాగే లావోస్‌, ‌బ్రునై, తజికిస్తాన్‌, ‌కంబోడియా,ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలోని పలు భాగాలు తమ దేశానివేనని అవకాశం వచ్చినప్పుడల్లా చైనా వాదిస్తూనే ఉంటుంది. అలాగే జపాన్‌తోనూ ఆ దేశానికి వివాదముంది. వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఇప్పటికే అక్రమించింది. ఇప్పుడు తాజాగా గల్వాన్‌లోయ ప్రాంతంలో ఊహించని విధంగా అలజడి సృష్టించి భారతదేశానికి చెందిన కల్నన్‌తో పాటు ఇరవై మంది సైనికులను హతమార్చింది. ఇక్కడ కూడా దక్షిణ చైనా సముద్రం పైనా పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించాలన్న లక్ష్యంగానే, ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్దానికి సిద్దమవుతున్నది. చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న దృష్టితో ఉన్న భారత్‌ను కావాలనే రెచ్చగొడుతోంది చైనా. భారత్‌కు భూభాగంలోని లడక్‌నును ఆక్రమించుకోవడంద్వారా భారత్‌పై దాడికి మార్గం సులభం చేసుకోవాలన్న లక్ష్యంగా చొచ్చుకొస్తున్నది . ఈ ఘర్షణలో భారత భూభాగాన్ని చైనా ఏమాత్రం ఆక్రమించకుండా మన సైన్యం గట్టిగానే బుద్ది చెప్పినట్లు కేంద్రం ప్రకటిస్తున్నా, ప్రతిపక్షాలు మాత్రం చైనా మరికొంత భారత్‌ ‌భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు వాదిస్తున్నాయి.

అక్రమించుకున్న భూభాగంలోనుంచి వెళ్ళిపోతామంటూనే అక్కడ యుద్ద తంత్రాన్ని చైనా కొనసాగిస్తూనే ఉందన్న వార్తలు వొస్తున్నాయి. కాగా, చైనా దాడులను తిప్పికొట్టేందుకు సిద్దమవుతూనే దాన్ని ఆర్థికంగా ఇబ్బందికి గురిచేసే చర్యలను భారత్‌ ‌యుద్ద ప్రాతిపధికన చేపట్టింది. గాల్వన్‌ ‌వ్యాలీ నేపథ్యంలో ఇరవై మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడంపట్ల యావత్‌ ‌దేశం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. భారత వ్యాపార సామ్రాజ్యం పైన కూడా పెత్తనం చెలాయిస్తున్న చైనా ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 సంస్థల యాప్‌లపై నిషేధం విధించింది . అత్యధికంగా చెలామణిలోఉన్న టిక్‌టాక్‌ ‌యాప్‌తో సహా అనేక చైనా యాప్‌లకు బదులు ఇండియా లేదా మిత్రదేశాలకు సంబందించిన యాప్‌ల పైనే ఇప్పుడు ప్రజలు దృష్టి పెట్టారు. అలాగే ఇతర వ్యాపార వాణిజ్య లావాదేవీలను కూడా తెచ్చుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడంపట్ల దేశ ప్రజలు కేంద్రాన్ని అభినందిస్తున్నారు. హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు అనుమతులను నిరాకరిస్తూ కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏమైతేనేం చైనా ఘర్షణ మూలంగా దేశప్రజలకిప్పుడు స్వదేశీ ఉత్పత్తులను వాడాలన్న అభిలాష మొదలైంది. టిక్‌టాక్‌ ‌స్థానంలో స్వదేశీకి చెందిన చింగారీ యాప్‌కిప్పుడు విపరీతమైన డిమాండ్‌ ‌పెరిగింది. షేర్‌చాట్‌, ‌రోపోసో లాంటి యాప్స్ ఊహించని విధంగా డౌన్‌లోడ్‌ అవుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం నిషేధం విధించినప్పటినుండి గంటకు అయిదు లక్షలమేర డౌన్‌లోడ్స్ అవుతున్నట్లు షేర్‌చాట్‌ ‌యాప్‌ ‌యాజమాన్యం చెబుతున్నదాన్ని బట్టి దేశీయ ప్రొడక్ట్సు మీద అభిమానం పెరుగాలేగాని వాటిని మనమే పరిరక్షించుకోవచ్చన్నది దీనివల్ల స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో యుద్దానికి రెండు దేశాలు సిద్దమవుతున్న వేళ భారత్‌కు ఇజ్రాయిల్‌ ఈ ‌విషయంలో సహకారమందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే అమెరికా చైనాపైన గుర్రుగా ఉందన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌కూడా రాఫెల్‌ ‌యుద్ద విమానాలను సమకూర్చడంలో భారత్‌కు సహకారమందిస్తున్నది . వాస్తవంగా భారత్‌ ‌యుద్దాన్ని కోరుకోవడంలేదు. దీనివల్ల ఇరుదేశాలకు నష్టం వాటిల్లుతున్నదని భావిస్తున్నా, చైనా దుందుడుకు వైఖరికి ఈసారి తప్పకుండా బుద్ది చెప్పాలంటే యుద్దమే అంతిమలక్ష్యంగా భారత్‌ ‌భావిస్తున్నట్లు సరిహద్దుల్లో సైన్యంతోపాటు, యుద్ద సామగ్రీని సిద్దంచేయడంద్వారా అర్థమవుతున్నది .

Leave a Reply