వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌కాంగ్రెస్‌ ‌పార్టీలో వయోభేద సంఘర్షణ..!

September 11, 2019

వరుస అపజయాలతో కాంగ్రెస్‌ ‌తనపూర్వ ప్రతిష్టను కోల్పోయింది. పోయిన ప్రతిష్టను తిరిగి ఇప్పట్లో నిలబెట్టుకుంటుందన్న పరిస్థితులు కూడా కనిపించడంలేదు.  2014, 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన మెజార్టీకి కాంగ్రెస్‌ ‌దరిదాపుల్లోకూడా లేకుండా పోయింది. 2019 నాటి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్‌ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితిలేదన్నది స్పష్టమవుతోంది. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి జాతీయ సారధ్యంకూడా పెద్ద సమస్యగానే మారింది. కాంగ్రెస్‌పార్టీ పూర్వ ఔన్నత్యాన్ని సాధించుకోవాలంటే ఆ పార్టీలోకి యువరక్తం రావాలని చాలాకాలంగా ఆపార్టీ నేత)ంటున్నా అవి కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. మొదటినుండి వంశపారంపర్యంగా గాంథీ, నెహ్రూ కుటుంబాలే సారధ్యం వహిస్తున్న క్రమంలో, ఆదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాహుల్‌గాంధీకి పట్టంకట్టి ఆ కుటుంబంపట్ల తమ విధేయతను చాటుకోవాలని ఆ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించారు. అయితే రాహుల్‌ ‌మాత్రం మొదటినుండి ఆపదవిపట్ల విముఖత కనబరుస్తూనే ఉన్నాడు. అందుకు ప్రధాన కారణం పార్టీలో అనేకమంది వయోవృద్ధులుండడం. వారిస్థానాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో, తానాపదవిలో కొనసాగడంకష్టమన్నది ఆయన పార్టీ సమావేశాల్లోనే చెబుతూవచ్చాడు. అయినా ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకు ఒక్కో మెట్టును బలవంతంగా ఎక్కించుకొచ్చారు. భారతీయ జనతాపార్టీ పెద్దనోట్ల రద్దు, యుద్ద విమానాల కొనుగోలు తదితర అంశాలతో ఆయన 2019 ఎన్నికల్లో  దేశవ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్‌ ‌గెలుపుకోసం శ్రమించినప్పటికీ లాభంలేకుండాపోయింది. భారతీయ జనతాపార్టీ సాధించిన మెజార్టీతో కాంగ్రెస్‌ ‌వెలవెలపోయింది. దాంతో ఇక పార్టీకి మరోనాయకుడిని చూసుకోవాల్సిందేనని రాహుల్‌ ‌భీష్మించుకుని కూర్చున్నాడు. కాంగ్రెస్‌పార్టీ రాహుల్‌ ‌నేతృత్వంలో కొనసాగుతుందని ఆశించిన ఆపార్టీ యువనాయకులంతా దీంతో అయోమయంలో పడిపోయారు. ఆయన్ను అంటిపెట్టుకునిఉన్న యువతంతా ఒక్కసారే నీరసించిపోయింది. తాత్కాలికంగా సోనియాగాంధీని ఆస్థానంలో కూర్చోబెట్టడంతో తమ ఎదుగుదలపై వారిలో ఆంతర్మథనంమొదలైంది. వృద్ధనాయకులు కేవలం పార్టీపటిష్టతకోసమే పనిచేయాలని  గతంలో రాహుల్‌ ‌చేసిన సూచనలను సోనియా సున్నితంగా తిరస్కరించిన విషయం తెలియందికాదు. అలాంటి పరిస్థితిలో తమ భవిష్యత్తుపై యువనాయకత్వం ఆలోచించుకోవాల్సినపరిస్థితి ఏర్పడింది. రాహుల్‌నుచూసే తాము పార్టీలో కొనసాగుతున్నామని, ఆయన అధ్యక్షపదవి చేపట్టని పరిస్థితిలో పార్టీలో తమ భవిష్యత్‌ఏమిటన్నది ఆలోచించుకోవాల్సివస్తుందని దేశవ్యాప్తంగా పలువురు యువనాయకులు ప్రకటించిన విషయంకూడా తెలియందికాదు. తెలంగాణలో విజయశాంతిలాంటి వారుకూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. ఒకవైపు కాంగ్రెస్‌ అధికారంలోఉన్న రాష్ట్రాలను అధికార బిజెపి కబళించేందుకు ఎత్తుగడలు వేస్తుంటే ఆపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా వృద్ధనాయకులకు, యువకులమధ్య సరిపడకుండా పోతున్నది. రాహుల్‌ ‌నాయకత్వంలో పనిచేసేందుకు ఉత్సాహపడి ఆ పార్టీలో ఆరునెలలకిందనే చేరిన యువనాయకి, సినీనటి ఊర్మిళా మాటోండ్కర్‌ ‌మంగళవారం ఆ పార్టీనుండి బయటికి వచ్చింది. పార్టీలోని అంతర్గత రాజకీయాలను తానుతట్టుకోలేకనే బయటికి వస్తున్నట్లు ఆమెచెప్పుకొచ్చింది. తాజా ఎన్నికల్లో ఉత్తర ముంబై లోకసభ స్థానంనుండి పోటీచేసిన తాను ఓడిపోవడానికి అక్కడి సీనియర్‌ ‌నాయకులే కారణమని పార్టీరాష్ట్ర అధ్యక్షుడికి రాసినలేఖలో ఆమె వివరించింది. అలాగే రాహుల్‌ను అంటిపెట్టుకుని ఉండే జ్యోతిరాధిత్య సింథియా గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటినుండి  మద్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తోపాటు, మరో సీనియర్‌ ‌నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌తో సరిపడడంలేదు. మధ్యప్రదేశ్‌లో యువనాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే విషయంలో కష్టపడుతున్న సింధియా తనకు పై ఇద్దరు అడ్డంపడుతున్నారంటూ సోనియాగాంధీకి లేఖ రాసినా ఏమాత్రం స్పందనలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురిఅవుతున్నాడు. ఆ రాష్ట్రంలో కనీసం పార్టీ అధ్యక్ష పదవిలభిస్తుందనుకున్న ఆయన ఆశలు నీరుగారిపోయాయి. మరోవైపు ఊర్మిళా మటోండ్కర్‌ ‌ఫిర్యాదుతో ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడి బాధ్యతలనుంచి తొలగించబడిన మిలింద్‌ ‌దేవరాతోకలిసి సింథియా కాషాయగూటికి చేరే అవకాశాలున్నాయంటున్నారు. బిజెపి ప్రభుత్వం కశ్మీర్‌కు సంబందించి 370 ఆర్టికల్‌ను రద్దుచేయడం సరైందేనని వీరిద్దరు పేర్కొనడం అదేసంకేతాన్నిస్తోందంటున్నారు. అలాగే మోడీ ప్రతిపాధించిన జనాభా నియంత్రణను జితిన్‌ ‌ప్రసాద్‌ ఆహ్వానించడం, ఇక రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకున్న సచిన్‌పైలెట్‌ ‌ప్రస్తుతానికైతే మౌనంపాటిస్తున్నా, సంచలనాత్మక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోకూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణరాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ సారధ్యం విషయంలో పార్టీ ఇంతవరకు ఎటూ తేల్చుకోలేకపోతున్నది. యువకులకు నాయకత్వం అప్పగిస్తే, సీనియర్‌లు అలిగి పార్టీనే విడిచిపెట్టిపోయే ప్రమాదముంది, ఒకవేళ సీనియర్‌కే అధ్యక్షపదవిని అంటగడితే యువనాయకులు ఎవరిదారి వారు చూసుకునేట్లుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్‌లో నాయకులమధ్య వయోభేద సంఘర్షణ ప్రమాదకారిగా మారింది.