Take a fresh look at your lifestyle.

హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో బిజెపి స్థానం…?

తెలంగాణలో దూకుడుగా ముందుకు పోతున్న భారతీయ జనతాపార్టీ అక్టోబర్‌లో జరుగనున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఎన్నవ స్థానంలో నిలుస్తుందన్న చర్చ జరుగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)‌కి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుంటోంది. త్వరలో రానున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థానం గెలువడం తమకు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా తయారవడంతో ఇక తమకు ఎదురులేదన్న భావనలో ఉంది. అదే దూకుడును టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై చూపుతున్నది. టిఆర్‌ఎస్‌ ‌పాలనాపరమైన తప్పులను ఎత్తిచూపడంతో ఆ పార్టీ ముందువరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర నాయకులతోపాటు, కేంద్రంలోని ఆ పార్టీ హేమాహేమీ నాయకులంతా ఇప్పటికే తమ దృష్టిని తెలంగాణపైన కేంద్రీకరించిన విషయం తెలియందికాదు. ఇలాంటి పరిస్థితిలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోపాటు బిజెపికి కూడా సవాల్‌గా నిలిచింది. ఈ ఉపఎన్నిక రాష్ట్రప్రభుత్వ పాలనకు రెఫరెండంలాం టిదంటున్నాయి ప్రతిపక్షాలు. అయితే కేవలం ఒక్క స్థానంలో జరిగే ఉప ఎన్నిక పాలనాదక్షతకు తీర్పెలా అవుతుందని అధికార పార్టీ అంటోంది. కాగా, ఇప్పుడు జరుగుతున్న హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌కు సిట్టింగ్‌ ‌స్థానం కావడంతో ఆరునూరైనా తన స్థానాన్ని తిరిగి గెలుచుకునేందుకు ఆ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో అభిప్రాయ భేదాలు ముందుగానే పొడసూపడంతో దీన్ని గెలుచుకునే విషయంలో ఆ పార్టీ ఏమేరకు విజయవంతం అవుతుందన్నది ఫలితాల వెల్లడివరకు వేచిచూడాల్సిందే. స్థబ్ధతగా ఉన్న కాంగ్రెస్‌లో టిడిపినుండి రేవంత్‌రెడ్డి రావడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. అయితే పార్టీ పదవుల విషయంలోనూ, హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ ఆయనకూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య సఖ్యత కుదరకపోవడం అభ్యర్థి విజయావకాశాలపైన పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాగ్ధాటిని ధీటుగా ఎదుర్కుంటాడన్న పేరున్న రేవంత్‌రెడ్డి ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా లేదా అన్న అనుమానాలున్నాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక మెట్టుదిగి ఉప ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తాడా, లేక రేవంత్‌రెడ్డి తనంతటతానుగా ప్రచారానికి సిద్ధమవుతాడా అన్నది సందిగ్ధంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుస్తామని భుజాలెగురేస్తున్న భారతీయ జనతాపార్టీ ఆచీతూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కునే అభ్యర్థిని నిలబెట్టేందుకు బాగానే కసరతు చేసిందనేందుకు ముందుగా ప్రచారంలో ఉన్న అభ్యర్థిని కాదని మరో అభ్యర్థిని ప్రకటించింది. పై రెండు పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెడితే అందుకు భిన్నంగా బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంచుకుంది. దీంతో బిసి వోట్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కొద్దిలో తప్పిపోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే తీవ్ర ప్రయత్నంలో తెరాస ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ నియోజకవర్గం గులాబీ హస్తగతమవుతుందన్న ధీమాను అధికారపార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రతీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఇక్కడ నిర్వహించిన సర్వేలో కూడా వోటర్లంతా కారు పార్టీనే కోరుకుంటున్నారని తేలినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేత, ఐటి, పంచాయితీరాజ్‌ ‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తమపార్టీ పక్షాన నిర్వహించిన సర్వే రిపోర్టులో భారతీయ జనతాపార్టీకి కేవలం 2.55 శాతం వోట్లు మాత్రమే లభిస్తాయని తేలిందని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినదాని ప్రకారం బిజెపి ఈ ఎన్నికల్లో మూడవస్థానంలో ఉండబోతుందని తెలుస్తున్నది. కాగా కాంగ్రెస్‌ ‌రెండవ స్థానానికే పరిమితమవుతుందని ఆ సర్వే చెబుతున్నది. అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనీసం తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి లేదన్నది దీనివల్ల అర్ధమవుతున్నది. కెటిఆర్‌ ‌చెప్పిన సర్వే అంకెలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ 41 ‌శాతం వోట్లకే పరిమితం కానుందన్నదని, అధికార తెరాస 55 శాతం వోట్లతో మరో శాసనసభ స్థానాన్ని తనఖాతాలో వేసుకోబోతున్నదన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది. అందుకు తగినట్లుగా అధికారపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలకు, సామాజిక వర్గాలవారీగా ఒక్కో నాయకుడికి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకుగాను దాదాపు అరవై మంది నాయకులను పార్టీ సమాయత్తం చేస్తున్నది. వీరిలో మంత్రులు, వివిధ సంస్థల చైర్మన్‌లున్నారు. కాగా, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణంలో ఈ ఉప ఎన్నికలు ఎవరికి అనుకూలిస్తాయో వేచి చూడాల్సిందే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy