Take a fresh look at your lifestyle.

హుజూర్‌నగర్‌లో రాజకీయ వేడి

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈ ఎన్నికలు ఒక విధంగా రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పుట్టిస్తున్నది. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు దాదాపు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టగా తీసుకుంటున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస, కాంగ్రెస్‌ ‌మధ్యే ఉండబోతున్నది. మొత్తం 28 మంది పోటీలో ఉన్న ఈ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకునేందుకు స్వతంత్ర అభ్యర్దులతో సహా మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలుచేయగా, అభ్యర్థుల పత్రాలు సరిగాలేవని 45 మంది దరఖాస్తులను తిరస్కరించారు. మరో ముగ్గురు ఉపసంహరించుకోవడంతో ఇరవై ఎనిమిదిమంది మిగిలారు. ఇందులో పదమూడు మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా, మిగతావారు స్వతంత్రులు. టిడిపి, బిజెపి వొంటరిగానే బరిలోకి దిగాయి. అనూహ్యంగా సిపిఎం అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ ‌కూడా తిరస్కరించబడడంతో రెండు వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్దులెవరూ ఈ పోటీలో లేరు.
ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గం పరిధిలో తమ వంతు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌కు వోట్లు పడకుండా ఉండేందుకు వారు స్థానిక నాయకులతో ఇల్లిల్లు తిరుగుతున్నారు. రాజకీయ ఎత్తుగడలో దిట్టగా పేరున్న టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎవరూ ఊహించని విధంగా తన పాచికలను సంధించారు. నిన్నటి వరకు అధికార పార్టీపైన తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కిన సిపిఐని తన మద్దతుదారుగా చేసుకోవడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. పూర్వం నుండి నల్లగొండ జిల్లా వామపక్ష పార్టీలకు అనుకూలమైన జిల్లా. ఈ నియోజకవర్గంలో సిపిఐ లాంటి పార్టీలు ఇక్కడ గెలువలేకున్నా కొంతవరకు ప్రభావితం చేయగలిగిన వోటు బ్యాంకు ఆ పార్టీకి ఉంది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు మరో పార్టీ మద్దతు కోరని టిఆర్‌ఎస్‌ ‌స్వయంగా సిపిఐ తలుపుతట్టింది. సిపిఐ తన కార్యవర్గ సమావేశంలో చర్చించి మద్దతిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన ఈ పార్టీ గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌మిత్రద్రోహం చేయడమే టిఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి కారణంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో అంటకాగడంతో ఇప్పుడు తమ ఉనికికే ప్రమాదం కలుగనుందన్న ఆలోచన సిపిఐకి లేకపోలేదు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లోనైనా కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా కనీసం పట్టణ ప్రాంతాల్లో తమ ఉనికిని కాపాడుకోవచ్చని సిపిఐ భావించి ఉంటుంది. తెరాసకు కూడా రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించుకునేందుకు సిపిఐ మద్దతు అవసరం. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో ఏకమై ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ స్థానాన్ని గెలుచుకోవడం కోసం అధికార తెరాస నింగీ నేల ఒకటిచేస్తోంది. ఆ పార్టీ ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలపైన ఇప్పటికే ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులందాయి. సాక్షాత్తు టిఆర్‌ఎస్‌ అభ్యర్థిపైనే నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైయింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుపైన కేంద్ర ఎన్నికల సంఘం వేటువేసింది. ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పించి ఆయన స్థానంలో ఆర్‌. ‌భాస్కరన్‌కు బాధ్యతలను అప్పగించింది. కాగా, వైసిపి నేతలతోని ఇక్కడ ప్రచారం చేయించాలని టిఆర్‌ఎస్‌ ‌చూస్తున్నట్లు వదంతులు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజముందో గాని ఇటీవల కాలంలో వైఎస్‌ ‌జగన్‌తో కెసిఆర్‌ ‌మంచి సంబంధాలను నెరుపుతుండడం కూడా ఈ వదంతులకు కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఇక్కడ వైఎస్‌ఆర్‌ అభిమానులు చాలామంది ఉండడంవల్ల ఆ వోటర్లను ఆకట్టుకునే మరో ప్రయత్నం టిఆర్‌ఎస్‌ ‌చేస్తుండవచ్చనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో నియోజకవర్గం నుండి పోటీచేసిన అభ్యర్థి మూడవ స్థానంలో నిలవడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి ముప్పైవేల మెజార్టీతో గెలువనున్నట్లు కాంగ్రెస్‌ ‌తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించాడు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌పార్టీది కావడం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం కావడం, ఇప్పుడు పోటీలో ఆయన భార్య అభ్యర్థిగా నిలబడడంతో కాంగ్రెస్‌కు ఈ స్థానం గెలుచుకోవడం ఓ ప్రతిష్టగా మారింది. గెలువలేకనే సిపిఐ మద్దతును టిఆర్‌ఎస్‌ అడిగిందని ఆరోపించిన ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి తమకు మద్దతివ్వాల్సిందిగా తెలంగాణ జన సమితి పార్టీని కోరాడు. అలాగే సిపిఎం అభ్యర్థి దరఖాస్తు తిరస్కారానికి గురి కావడంతో ఆ పార్టీని కూడా తమకు మద్ధతివ్వాల్సిందిగా ఉత్తమ్‌ ‌కోరుతున్నారు. గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేక పోయిన తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికల్లో భాగస్వామి అయింది. అయితే ఉమ్మడి శత్రువుగా తెరాసను ఓడించేందుకు తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమించుకుని తమకు మద్దతు ప్రకటించాల్సిందిగా ఉత్తమ్‌ ‌టిడిపి అధినాయకత్వానికి కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేటుగా కనిపిస్తున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy