వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

హామీ లతోనే మభ్యపెడుతున్నారు

September 20, 2019

రాష్ట్ర అభివృద్ధికి చేసిందే లేదు
అసెంబ్లీలో సర్కార్‌ను నిలదీసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి
దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారిని మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వంపై భట్టి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసం తెరాస చేసిందే లేదన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన పనులనే వారు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు కొంత మేర కృష్ణా పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి వారికి భూమిని కేటాయించామని భట్టి గుర్తు చేశారు. ఈ చట్టం ద్వారా వచ్చిన భూములను సైతం రాష్ట్ర అటవీ శాఖ అధికారులు బలవంతంగా వారి నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారంటే రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా ప్రజలకు కేటాయించిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రిని కోరారు. వారికీ అన్ని హక్కులతో పాటు రైతు బంధు, రుణమాఫీ, పంట బీమా సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని భట్టి కోరారు. నిజాం షుగర్‌ ‌ఫ్యాక్టరీ కార్మికుల గురించి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. అటవీ భూముల హక్కు చట్టం ద్వారా వచ్చిన భూములను లాక్కోవద్దన్నారు. ఆరేళ్లుగా పరిశ్రమల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిందే లేదని, హైదరాబాద్‌కు తాము మెట్రో తీసుకువస్తే.. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం టికెట్‌ ‌ధర పెంచిందని విమర్శించారు. కాజీపేట్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ కోసం కేంద్రంతో యుద్ధం చేశారా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.