హక్కుల ఉద్యమకారులపై దాడులు జరగడం కొత్త కాదు. బెంగళూరుకు చెందిన దిశా రవి అనే యువతిపై పోలీసులు మోపిన కేసు ఈ కోవకు చెందినదే. పోలీసులు తల్చుకుంటే ఎటువంటి నేరాలనైనా మోపగలరని గతంలో ఓ నానుడి ఉండేది.ఇది ఇప్పుడు అమలులో ఉంది. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని సమర్ధించిన వారంతా దేశద్రోహులనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరుగుతున్న కుట్రను సమర్ధిస్తున్న వారేనని కేంద్రం అనుమానిస్తోంది. నిజానికి కుట్రలు చేసేవారికి హక్కుల ఉద్యమకారుల సహాయ ,సహకారాలు అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్ధుల సాయాన్ని వారు తీసుకుంటారు. హక్కుల ఉద్యమకారులు కేవలం ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతుంటారు.అలా తెలియజేయడం వల్ల వారి మనసులో మాట బయటపడుతుంది. కుట్రలు చేసేవారు మనసులో ఏముందో ఎదుటివారికి తెలియకుండా తెరవెనుక తతంగాలు నడిపిస్తుంటారు.
దిశా రవి హక్కుల ఉద్యమానికి ఆకర్షితురాలైనారు. బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య కేసు గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు, కథనాలు పత్రికల్లో వొచ్చిన తర్వాత చాలా మంది యువతరం ప్రతినిధులు హక్కుల ఉద్యమానికి ఆకర్షితులవుతున్నారు. యువతి యువకులు అలాంటి ఉద్యమాలకు ఆకర్షితులు కాకుండానే సామాజిక మాధ్యమాల ద్వారా బూతు కథలు, బూతు చిత్రాల వెల్లువకు కొన్ని వర్గాలు పని కట్టుకుని ఊతం అందిస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని సమర్ధించిన వారిపై రాజద్రోహ నేరాన్ని మోపిన ప్రభుత్వం ఇప్పుడు ఖలిస్తాన్ అనుకూల సంస్థ పొయిటిక్ ఫౌండేషన్ రూపొందించిందని అనుమానిస్తోంది. ఈ టూల్ కిట్ ను షేర్ చేసిన వారంతా దేశద్రోహులేనని అనుమానిస్తోంది.ఆ క్రమంలోనే దిశా రవిపై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు చేశారు. ఆమె నేపధ్యం పరిశీలిస్తే, వ్యవసాయ కుటుంబం నుంచి వొచ్చిన ఆమెకు రైతుల కష్టాలు, కన్నీళ్ళ గురించి బాగా తెలుసు.అందుకే రైతు ఉద్యమాన్ని సమర్ధించారు.
రైతు ఉద్యమాన్ని సమర్ధించిన గ్రెటా థన్ బర్గ్ అనే అంతర్జాతీయ ఉద్యమకారిణిపై కూడా కేసు నమోదు చేశారు. నిజానికి రైతుల ఉద్యమాన్ని ఇతరదేశాల వారు సమర్ధించినంత మాత్రాన అది దేశద్రోహం ఎలా అవుతుంది.అమెరికాలో చాలా మంది సెనేటర్లు ఈ ఉద్యమాన్ని సమర్ధించారు. వారంతా భారత్ పై కుట్ర చేస్తున్నారని ఎవరైనా అనగలరా. రైతు ఉద్యమాన్ని సానుకూల దృష్టితో పరిశీలించి పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమైన ప్రభుత్వం రకరకాల సాకులు వెతికి వీలైనంత మందిపై కేసులు నమోదు చేయాలని చూస్తోంది. ఈ ధోరణి ఇప్పుడు కొత్తగా వొచ్చింది కాదు. హక్కుల ఉద్యమకారుడు వరవరరావు ప్రభృతులను కోరేగావ్ కుట్ర కేసులో ఇరికించారు. దశాబ్దాల క్రితం చాలా మంది జర్నలిస్టులనూ, కవులు, కళాకారులను పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించారు. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు పాలకులు తల్చుకుంటే కేసులకు కొదవా అన్నట్టుగా ఆధునిక ప్రజాస్వామ్యం నడుస్తోంది.
అంతేకాదు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేవారిపై భౌతికపరమైన దాడులు జరుగుతున్నాయి. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంధని కోర్టుకు హాజరై వస్తున్న న్యాయవాది దంపతులను పట్టపగలు నరికివేసిన సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. గట్టు వామనరావు, ఆయన సతీమణి నాగమణి ఇద్దరూ న్యాయవాదులే. ఎన్నో లాకప్ డెత్ కేసులను వాదించారు. వారికి హక్కుల పరిరక్షణ కారులుగా మంచి పేరుంది.అలాంటి దంపతులను రాజకీయంగా దన్ను లేనిదే ఎవరూ హత్య చేయలేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , కాంగ్రెస్ ఎమ్మెల్యే డి శ్రీధర బాబు నేరుగానే తెరాస ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. వీరి హత్యపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నిందితులు ఎంతటి వారైనా వారిపై విచారణ జరిపించి శిక్ష పడేట్టు చూడాలని హెచ్చరించింది.హక్కుల ఉద్యమకారులపై దేశంలోనే కాకుండా తెలంగాణలో దాడులు జరగడం అవమానకరం.వారికి రక్షణ కల్పించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాక్ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది.అవి • కాలరాయ బడుతుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. వామనరావు వంటి వారు పోరాడుతూనే ఉంటారు. వారి పై జరిగిన దాడిని సూమోటోగా స్వీకరించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందుకు హక్కుల ఉద్యమకారులకు ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. నాంపల్లి కోర్టు నుంచి రాజ్ భవన్ వరకూ పెద్ద ప్రదర్శన జరిపారు. హైదరాబాద్ లో న్యాయవాదులు ఈ మాదిరి ప్రదర్శన జరపడం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి. హక్కుల ఉద్యమకారులకు రక్షణ కల్పించాలన్న నినాదాలు మారుమోగాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వామనరావు దంపతుల హత్య స్థలవివాదానికి సంబంధించిందని చెబుతున్నారు. అది పైకి చెప్పే సాకుగానే భావించాలి. పోలీసుల తప్పులను ఎత్తి చూపడం వల్లనే వారు చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వొచ్చాయి.వీటిపై ప్రభుత్వం నిగ్గు తేల్పించాలి.