Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థలకు రూ.20 వేల కోట్లు ఇవ్వండి నా భార్య నామినేషన్‌ ‌విత్‌‌డ్రా చేపిస్తా…

  • మంత్రి హరీష్‌రావుకు ఛాలెంజ్‌ ‌విసిరిన టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి
  • కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి రాజబతుకు బతుకుతారో..
  • టిఆర్‌ఎస్‌ను గెలిపించి బానిస బతుకుతారో తేల్చుకోవాలన్న జగ్గారెడ్డి

తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్‌ ‌విసిరాడు. జగ్గారెడ్డి శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికిగానూ స్థానిక సంస్థలకు 2 వేల కోట్ల రూపాయల చొప్పున 20వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే తక్షణమే తన భార్య నామినేషన్‌(‌మెదక్‌ ‌జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున జగ్గారెడ్డి సతీమణి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలైన నిర్మల నామినేషన్‌ ‌వేశారు)ను ఉపసంహరించుకుంటాననీ మంత్రి హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్‌ ‌విసిరాడు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పటికీ అభివృద్ధికి నిధులు మాత్రం శూన్యమన్నారు. ఎన్నికలొస్తేనే జిల్లా ప్రజలకు మంత్రి హరీష్‌రావు అందుబాటులో ఉంటారన్నారు.

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీకి 230వోట్లు ఉన్నాయనీ, గెలిచే వోట్లు లేకున్నా తన భార్యను పోటీలో పెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిని ప్టెడంతోనే ఎంపిటిసి, జడ్పిటిసి సభ్యులతో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నాడన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎంపిటిసిలు, జడ్పిటిసిలతో మంత్రి హరీష్‌రావు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో స్థానిక సంస్థలకు 20వేల కోట్ల రూపాయల నిధులిస్తే వెంటనే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్‌ ‌డ్రా చేపిస్తాననీ మంత్రి హరీష్‌రావుకు ఛాలెంజ్‌ ‌చేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

నిర్మాలాజగ్గారెడ్డిని గెలిపిస్తే..వొచ్చే మా ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాకు 20 వేల కోట్ల రూపాయలు తీసుకువస్తాననీ అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలనీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే..స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని పెట్టడం వల్లనే మంత్రి హరీష్‌రావు తమ పార్టీ వోటర్లకు ఫోన్లు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వొచ్చాయి కానీ..పవర్‌ ‌లేదన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నిర్మలను గెలిపించి రాజబతుకు బతుకుతారో…టిఆర్‌ఎస్‌ ‌పార్టీని గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే (ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు)తేల్చుకోవాలన్నారు.

Leave a Reply