Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌తో ఎపి సిఎం జగన్‌ ‌భేటీ

గోదావరి మళ్లింపు..
విభజన సమస్యలు
సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రులు
పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయం
గోదావరి జలాల తరలింపుపై ఇరురాష్ట్రాల సిఎంలు మరోమారు సుదీర్ఘంగా చర్చించారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో గాదావరి జలాల వినియోగంతో పాటు విభజన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట్ర విభజన అంశాలపై వీరు మరోమారు సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన సమాలోచనల్లో ప్రధానంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించడంపై చర్చ జరిగినట్టు సమాచారం. గత జూన్‌ 28‌న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు కొన్ని ప్రతిపాదనలు తయారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వాటన్నింటిపైనా చర్చించినట్టు తెలుస్తోంది.గోదావరి జలాలు ఎక్కడి నుంచి తరలిస్తే మంచిది? నీటిని ఏ ప్రాంతానికి ఎలా తీసుకొస్తే వ్యయం తక్కువగా ఉంటుంది? నీరు సునాయాసంగా ఎలా చేరుతుందనే అంశంపై ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ మధ్య విభజన
చట్టంలో కొన్ని సమస్యలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. ఏ అంశానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానితో పాటు పరిష్కారం కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపైనా చర్చించినట్టు సమాచారం. దిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల పంపకం సహా విద్యుత్‌ ‌బకాయిలు, 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన తదితర అంశాలపైనా సీఎంల భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఈనెల 8న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన అంశాలపై సక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్టాల్ర ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎంలు చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్టు సమాచారం. సీఎంలతో పాటు ఈ సమావేశంలో తెలంగాణ నుంచి వినోద్‌, ‌సంతోష్‌, ఏపీ నుంచి మిథున్‌ ‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
తెలుగురాష్ట్రాల సిఎంలు మరోమారుభేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తొలుత గవర్నర్‌ ‌నరసింహన్‌తో సమావేశమై.. అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌తో భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఇద్దరు సీఎంలు సమావేశం నేపథ్యంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌ ‌రెడ్డి తొలుత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ ‌నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన తర్వాత నరసింహన్‌తో భేటీ అయిన జగన్‌.. ఆయనతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా గవర్నర్‌తో సమావేశమయ్యారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy