వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సింగరేణి ఒక్కో కార్మికుడికి … రూ.లక్ష బోనస్‌

September 19, 2019

అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌
‌పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై త్వరలోనే నిర్ణయం
కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్‌ను ముద్దాడేలా చేశాం
గోదావరి ప్రాణహిత కలిసిన చోటే మనకు నీళ్లున్నాయి
సింగూరు, నిజాంసాగర్‌, శ్రీ‌రాంసాగర్‌లు నింపుకుంటే ఇబ్బందే ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్‌ ‌వెల్లడి
సింగరేణి కార్మికులకు లాభాల్లో 28శాతం బోనస్‌ అం‌దజేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ.. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ ‌చెల్లిస్తామన్నారు. దీంతో ఒక్కో కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయిందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడిందన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్‌ ‌టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగామని, గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుందని కేసీఆర్‌ అన్నారు. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్‌ ‌టన్నులకు చేరుకున్నదని తెలిపారు. దసరా పండుగ పురస్కరించుకొని సింగరేణికి అందిస్తున్న కానుక ఇదని, సింగరేణి కార్మికులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ అంకిత భావంతో పనిచేయాలని, మరిన్ని లాభాలు, విజయాలు సాధించి పెట్టాలని సీఎం కేసీఆర్‌ ‌కోరారు. పోలీసుల వీక్లీ ఆఫ్‌లపై త్వరలోనే నిర్ణయం..
మరోవైపు అసెంబ్లీలో పలువురు సభ్యుల అడిగిన ప్రశ్నలపై కేసీఆర్‌ ‌మాట్లాడారు.. హోంగార్డులకు మనం ఇస్తున్న వేతనం దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు. దేశంలో ఏ నగరానికి లేని భవిష్యత్తు హైదరాబాద్‌ ‌నగరానికి ఉందన్నారు. హైదరాబాద్‌కు ఆరు వైపుల హెలిప్యాడ్స్ ‌కూడిన సెంటర్స్ అవసరం ఉందని, తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని సీఎం కితాబిచ్చారు. మనం సుఖంగా నిద్రపోతున్నామంటే అందుకు పోలీసులే కారణమన్నారు. అదేవిధంగా పోలీసులకు వారాంతపు సెలవులు అంతసులువు కాదనీ, అయినప్పటికీ ఈ విషయమై డీజపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నామని తెలిపారు. డిసెంబర్‌, ‌జనవరికల్లా కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌పూర్తి కావొస్తోందని వెల్లడించారు. ఇతర రాష్టాల్ల్రో లేని విధంగా హోం గార్డులకు మంచి వేతనం అందిస్తున్నామన్నారు.
కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్‌ను ముద్దాడేలా చేశాం..
అనంతరం తాగునీటి ప్రాజెక్టులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడారు.. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వనే రిజర్వాయర్‌గా మార్చాలని ఆలోచించామని, ఆలోచనను అమలులోకి తీసుకువచ్చి విజయవంతగా పూర్తి చేసి శ్రీరామ్‌సాగర్‌ ‌ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లు ముద్దాడేలా చేశామని కేసీఆర్‌ ‌తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇస్తూ… గోదావరి, ప్రాణహిత కలిసిన చోటనే మనకు నీళ్లు ఉన్నాయని, సింగూరు, నిజాంసాగర్‌, శ్రీ‌రాంసాగర్‌ ‌నింపుకుంటే మనకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ మ్యాన్‌మేడ్‌ ‌రివర్‌లాంటిదని, శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్టు పాత ఆయకట్టు 7లక్షల ఎకరాలుకు సాగునీరు స్థిరీకరణ జరిగిపోయిందని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీ దగ్గర టూరిజం ప్రాజెక్టు రావాల్సి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు నవంబర్‌ ‌నెలలో కూడా 40 టీఎంసీల నీళ్లొస్తున్నాయని అన్నారు. దేవుని దయవలన వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. సీపీఐ నేత వెంకట్‌రెడ్డి స్వగ్రామానికి కూడా నీళ్లొచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ నేత వెంకట్‌రెడ్డి మెచ్చుకున్నారని అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం ప్రకటించారు. అప్పలు తెచ్చి సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 44 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని వెల్లడించారు.