వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సవ్యసాచి.. కెసిఆర్‌

September 12, 2019

ఎలాగూ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి బయటికి వెళ్లి చేసేది ఏమీ లేదన్న సత్యాన్ని తెలుసుకున్న అజ్ఞాత అసంతృప్తులు గుంభనంగా అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వంతోనూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి అన్ని విషయాలు తెలిసిన సవ్యసాచి కేసీఆర్‌…‌రాజకీయ ధన్వంతరిగా ఎవరికి ఎలాంటి ట్రీట్‌ ‌మెంట్‌ ఇవ్వాలో అలా ట్రీట్‌ ‌చేస్తున్నారు. ఇప్పుడు సదరు నేతలు అంటున్నది ఒక్కటే. అసంతృప్తి మాకా…అబ్బే.. అంతా వట్టిదే.. గిట్టనోళ్ళు చేస్తున్నారు ఇదంతా…అని. అంటే వారికి తత్వం బోధ పడినట్లే కదా.అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందం, అది ఇచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. ప్రయత్న లోపం లేకపోయినా..అర్హత ఉన్నా దాన్ని అందుకోలేక పోయినప్పుడు అంతే స్థాయిలో నిర్వేదమూ కలుగడం సహజం. ఆశ మనిషిని భవిష్యత్‌ ‌వైపు నడిపిస్తే నిరాశ భవిష్యత్తు అంధకారం అనే భావాన్ని కల్గిస్తుంది. ఈ రెండూ భావావేశాన్ని కలిగించేవే. వీటిని నియంత్రించుకోగలిగిన వారి మోములో ఎల్లప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఇటీవలి మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కని వారి చర్యలు, వ్యాఖ్యలు ఆశ – నిరాశల తాలూకు ప్రతిస్పందనలు, వాటికి విపక్షాలు అసమ్మతి రంగు పులిమేసి రాజకీయం చేసేశాయి. తాము అసంతృప్తితో ఉన్నామని ఒక్కరూ ఎవరూ చెప్పలేదు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఈ విషయంలో మినహాయింపు. ఆయన మనసులో ఏదీ దాచుకోరు. కానీ పనిని చేయమన్నా…అట్లెట్ల చేస్తం.. అంటూ పది మంది ముందే అనేస్తారు. సీఎం కేసీఆర్‌ ‌తనకు ఇచ్చిన హామీని ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. మా కుటుంబ పెద్ద కేసీఆర్‌ అన్న నాయిని మాటల్లోని నిజాయితీని శంకించాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఎన్నో చూసిన ఆయన మీడియాకు ఏమి చెప్పాలి..ఎంత మేరకు చెప్పాలి..దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఆలోచించలేదు. తన స్వభావానికి తగ్గట్లుగా మనసులోని మాట బయటకు చెప్పేశారు. మర్నాడే కేటీఆర్‌ ‌ఫోన్‌ ‌చేసి అడిగారని, చిట్‌ ‌చాట్‌ ‌చేస్తే ఇంతవుతుందనుకొలేదన్న నాయిని మాటల్లోని ఆవేదన ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మంత్రి పదవిని ఆశించినట్లు చెప్పిన ఆయన సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని నిష్టూరమాడారు.
ఇక ఈటల రాజేందర్‌ది ఇంకో రకం…మీడియాలో ఆయన్ను కేబినెట్‌ ‌నుంచి తప్పిస్తారనీ వస్తున్న కథనాలు ఆయనను అసహనానికి గురి చేసి ఉంటాయి. అందుకే జమ్మికుంట సభలోనే ఒకేసారిగా బరస్ట్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యల తీవ్రతను బట్టి ఆయన లోలోన ఎంత రగిలిపోతున్నారనేది స్పష్టం అయ్యింది. తనపై ఇంటా బయటా జరుగుతున్న ప్రచారంపై ఆయన సరిగా నిద్ర కూడా పోయుండరు ఆ వారం పది రోజులు. మంత్రిగా సమర్థత, అనుభవంతో పని చేస్తున్నప్పటికీ ఇలా ఎందుకవుతుందన్న విషయం అర్థం కాక ఈటల నిర్వేదంతో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇక్కడా కేటీఆర్‌ ‌ఫోన్‌ ‌చేది మాట్లాడడంతో వెంటనే తమ నాయకుడు కేసీఆర్‌ అని ఆయన ప్రెస్‌ ‌నోట్‌ ‌రిలీజ్‌ ‌చేశారు.
ఈటెల వ్యవహారం సద్దుమణిగింది అనుకునేలోపు టీచర్స్ ‌డే నాడు కరీంనగర్‌లో రసమయి బాలకిషన్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఈటెల అసమ్మతికి కొనసాగింపు అని ప్రచారం జరిగింది. తానూ, ఈటల రాజేందర్‌ అన్న కడుపులో ఏమీ దాచుకోమని, ఉన్నదున్నట్లు మాట్లాడుతామని రసమయి అనడం, జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఈటల సలహాపూర్వక సూచన తాలూకు వీడియో వైరల్‌ అయ్యింది. తర్వాత నాయిని మాట్లాడారు. అదే రోజు మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ ‌రాజయ్య మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాను పార్టీ వీడుతానంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. నిజామాబాద్‌ ‌రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌సైతం తనపై వచ్చిన వార్తలను ఖండించారు. నిరాధారమైన వార్త అన్నారు. జోగు రామన్న మాత్రం తాను ఉద్దేశ్య పూర్వకంగానే అందుబాటులో లేకుండా పోయానని, మంత్రి పదవి వస్తుందని రెండు సార్లు ఆశ పడ్డానని, రాకపోయే సరికి బిపి పెరిగిందని, డాక్టర్‌ ‌సలహాతో ఫోన్‌ ‌స్విచ్‌ ఆఫ్‌ ‌చేసినట్లు ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మీడియాతో అన్నారు. రసం లేని ఆర్టీసి చైర్మన్‌ ‌పదవి నాకెందుకు అన్న నాయిని నరసింహారెడ్డి సైతం రసం లేని ఆర్టీసికి సీఎం కేసీఆర్‌ ‌రసం పొస్తారని, కేసీఆర్‌ ‌తమ నాయకుడని అన్నారు.
ఈ వ్యవహారం అంతా ఆశ-నిరాశలకు సంబంధించినది. ఆశ పడినా దక్కనప్పుడు అదృష్టం ఉండాలిగా అని సర్దిచెప్పుకునే వాళ్లకు ఏ ఇబ్బందీ ఉండదు. అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులను నిందించడం వల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. ముఖ్యంగా రాజకీయాల్లో. ఏదయినా ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలి. అందుకోసం ప్రయత్నం కూడా చేయాలి.
అసంతృప్తితో ఉన్న వాళ్ళకు బిజెపి గాలం వేసే అవకాశం ఉన్న దృష్ట్యా సీఎం కేసీఆర్‌ ఊహించనంత వేగంగా మంత్రివర్గ విస్తరణ చేసేశారు. మిగిలిన వాళ్లకు నామినేటెడ్‌ ‌పోస్టులు ఇస్తామని ముందే ప్రకటించి ఉండటం వల్ల పదవుల కోసం ఆశపడుతున్న వాళ్ళు పక్క చూపులు చూడాలన్న ఆలోచన చేయడాన్ని మానేసెలా చేశారు సీఎం. ఎలాగూ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి బయటికి వెళ్లి చేసేది ఏమీ లేదన్న సత్యాన్ని తెలుసుకున్న అజ్ఞాత అసంతృప్తులు గుంభనంగా అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వంతోనూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి అన్ని విషయాలు తెలిసిన సవ్యసాచి కేసీఆర్‌…‌రాజకీయ ధన్వంతరిగా ఎవరికి ఎలాంటి ట్రీట్‌ ‌మెంట్‌ ఇవ్వాలో అలా ట్రీట్‌ ‌చేస్తున్నారు. ఇప్పుడు సదరు నేతలు అంటున్నది ఒక్కటే. అసంతృప్తి మాకా…అబ్బే.. అంతా వట్టిదే.. గిట్టనోళ్ళు చేస్తున్నారు ఇదంతా…అని. అంటే వారికి తత్వం బోధ పడినట్లే కదా.
వంగ మహేందర్‌ ‌రెడ్డి
సీనియర్‌ ‌జర్నలిస్ట్
‌ఫోన్‌ : 9963155523