వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సమాజం.. బాధ్యత గుర్తించాలి

December 1, 2019

జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురుతీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే. స్త్రీ ఒంటరిగా కనిపిస్తే చాలు కసితీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలన్నే చూడనట్లు ఆబగా చూసే కళ్లు.. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడిచేసి దాహం తీర్చుకుంటున్నాయి. ఇటు హైదరాబాద్‌..అటు వరంగల్‌ ‌తెలంగాణలో రెండు ముఖ్యమైన నగరాల్లో ఒకేరోజున దారుణాలు జరిగాయి. చారిత్రక నగరాలకు మచ్చతెచ్చే దురంతాలు చోటుచేసుకున్నాయి. షీ టీమ్‌లు, పెట్రోలింగ్‌లు ఎన్ని ఉన్నా ఆడపిల్లలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రియమైన నోరు మూగబోయింది
ప్రతి రోజూ మూగజీవాలతో ముచ్చటించే నోరు మూగబోయింది. మూగజీవాల గాయాలు మాన్చే పనిలో ఉండే ప్రియమైన నోరు శాశ్వతంగా మూగబోయింది. జీవితం అంటే ఏంటో తెలుసుకునే లోపు ఆ నోటిని, మనిషి రూపంలో ఉన్న మృగాలు అతి క్రూరంగా హింసించి మూసాయి. జంతువుల రూపంలో ఉన్న మృగాలకు కూడా చికిత్స చేయగలిగిన తాను, మనిషి రూపంలో ఉన్న జంతువుల వల్ల ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. తమ కామ వాంఛ మహిళలపై వికృత స్థాయిలో విజృంభిస్తూ వికృత రూపంగా మారుతున్న మానవ మృగాలను ఏం చేయాలి? రోజురోజుకు ఒక్కొక్క విచిత్రమైన కథనాలు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం?
కఠిన శిక్షలు అమలు చేయాలి
ప్రస్తుత తరుణంలో మనిషి కాలంతో పాటు పోటీ పడుతూ సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకు వెళ్తున్నా, ఒక వైపు ప్రపంచాన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసినా కొన్ని మానవ మృగాల వల్ల దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. సమాజంలోని మనిషి మానవతా విలువలను కాపాడడంలో దిగజారి పోతున్నాడు. ఇలాంటి లైంగిక వాంఛలతో పేట్రేగి పోతూ ప్రపంచాన మానవత్వం మట్టిలో కలుస్తుందేమో అనే భయం వేస్తుంది. దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మానవ మృగాలు మహిళలను చిదిమేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా వ్యవహారించాల్సిందే. వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన శిక్షలు అమలు పరచాలి.
నైతిక విలువలు నేర్పాలి
చట్టపరమైన శిక్షలు విధించటమే కాకుండా పాఠశాల విద్య నుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించేలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పు తీసుకు రాగలిగితే కొంతమేరకైనా ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. మహిళల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలనూ భారత పార్లమెంట్‌ ఆమోదించింది. ఎప్పటికప్పుడూ సవరణలు జరుగుతున్నాయి. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నేడు ఎంతోమంది మహిళలు విద్యావంతులు అవుతున్నా, వారి కాళ్ల మీద వారు నిలబడు తున్నా, ఎక్కడో ఒకచోట వివక్ష ఎదుర్కొంటూనే ఉంటుంది. మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, వారి రక్షణ కోసం కేటాయించిన చట్టాలను గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ప్రతి స్త్రీ మూర్తికి అవసరం. అప్పుడే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడగలం. అపాయంలో మహిళలు టోల్‌ ‌ఫ్రీ నెంబర్లు 112,100,1090, 181, 1091 సత్వర సాయం అవసరమైన సందర్భంలో రక్షణకు ఉద్దేశించిన ఈ టోల్‌ ‌ఫ్రీ ఫోన్‌ ‌నంబర్ల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వివిధ రకాల బాధ్యతల నిర్వాహణ కోసం బయటకు వచ్చిన అమ్మాయిలు/మహిళలు విధిగా తమ మోబైల్‌ ‌ఫోన్లో టోల్‌ ‌ఫ్రీ నంబర్లు ‘‘సేవ్‌’’ ‌చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాలి.
ఆడ్డుకట్ట వేయాలంటే సమాజ బాధ్యత ఆవశ్యకం
అశ్లీలత, ఇంటర్‌నెట్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి శృంగారం లాంటివి ఈ సంఘటనలకు ప్రధాన కారణాలు. అనేక కేసులలో మాదకద్రవ్య వినియోగం, మత్తుపానీయాల సేవనంతో నేరాలు జరిగినట్లుగా వెల్లడవుతున్నందున వాటిని కూడా నియంత్రించాలి. అత్యాచారాలు తగ్గుముఖం పట్టాలంటే మహిళలను సాధికారత దిశగా అడుగులు వేయించాలి. మహిళల్లో సామాజిక చైతన్యం కల్గించడం, భాగస్వాములను చేయడం, చట్టాలపై సరైన అవగాహన కల్పించడం, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం పకడ్బందీగా నిఘా వేయడం వంటి చనర్యల ద్వారా నియంత్రించాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మహిళా సంఘాలు, మేధావులు సమష్టి కృషితోనే మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు.పర స్త్రీలలో మన తల్లిని, చెల్లిని, అక్కను చూసే సమాజం కొరకు కృషి చేద్దాం. మృగాలకు మనుషులుగా మారే విలువలతో కూడిన విద్య ను అందించాలి. అమ్మాయిలకు ఆత్మరక్షణ నేర్పు వచ్చేలా ప్రతి ఒక్కరం పాటుపడదాం. ప్రతి మహిళా గౌరవంగా, సామరస్య వాతావరణంలో ఎదగాలి.
– డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి,
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ 9703935321