Take a fresh look at your lifestyle.

‘‘సదువు లెట్లుండాలె!’’

“ఇప్పుడు కరోనా బీమారచ్చి సదువులల్ల శాస్త్రీయతను సవాలు జేశింది.పెండబూసుకున్నోళ్ళు బొయిండ్లు.ముక్కుల నిమ్మరసం పిండుకున్నోళ్ళు బొయిండ్లు.గంగల మునిగినోళ్ళు అటెంక పీన్గలై తేలాడబట్టిండ్లు.మనుదర్మం సదువులు తెచ్చినోళ్ళందరు కరోనా కోసం సైన్సెనుకన బడ్డరు. శాస్త్రీయత కాళ్ళు మొక్కబట్టిండ్లు.సాములంత వాక్సిన్‌ ‌డోసులేసుకున్నరు. జనానికి యేవి పాలో యేవి నీళ్ళో మాగనే యెరుకైతాంది.”

‘‘పోరడెట్లనో సోమిడి బట్టినట్టయితాండు, నిద్రల ఉలికులికి పడబట్టె!’’అని మా అవ్వనసరికె ఛలో!ఇంగ ఆగుతదా! మా  నాయనవ్వ తెల్లారి మబ్బుల్నే ఖిలాకు గొంటబోయి అంతయ్య కాడ వూదు మంత్రమేయించేది.గోపాల్సామి గుడి కాడ మొల్తాడుకు లక్కకాయ కట్టిచ్చేది. పొద్దున తానంపోసి నిప్పుల మీద ఊదు పొగేశేది.యాభై యేండ్లకింది ముచ్చటిది.అప్పుడంటె యెన్కటి కాలమని ఊకుంట మాయెగని గిసొంటియింకా పానంతోనుంటె ఎమనాలె! ఊరోళ్ళంటె సదువుగిట్ల లేనోల్లనుకుందాం! హవ్వల్‌ ‌దర్జా కాలనీ లల్ల సుత బేస్తారం,ఐతారం చీకటి పడంగనె గల్లీలల్ల మూల మల్పులకాడ పచ్చబువ్వ,,ఎర్రబువ్వ,గుడ్లు, కొబ్బరికాయలు పెయి సుట్టు తిప్పేసుడు ఇచ్ఛంత్రం అనిపిత్తది.

గిసొంటి దిక్కుమెల్ల దిట్టి తిప్పేసుడు సదువుకున్నోళ్ళకు సుతనా!అనిపిత్తది. తిరుపతి మొగాన మస్త్ ‌సదువులున్న పెళ్ళాంమొగలు గాళ్ళ కన్న బిడ్డల్నే కొట్టి సంపిండ్లట!అటెంక దేముడు గాళ్ళను బతికిత్తడని జెప్పబట్టిండ్లట!ఇద్దరు బిడ్డల పానాలుదీశిన వాళ్ళ మూర?త్వానికి గాళ్ళు సద్విన పెద్దపెద్ద సదువులు ఆడ్డం బడలే! పాలుశీకె సందే గిసొంటి దిక్కుమెల్ల నమ్మకాలు రంగరిచ్చిపోసే అవ్వలు,నాయనవ్వలది యెరుకలేని తనం అనుకుందాం సరే! బగ్గ  సదువులు సద్వినోళ్ళకేం బుట్టింది!?
సైన్స్ ‌సదువులతోని ఉపగ్రహాలను మొగులు మీదికి పంప బట్టినం, గాటి తోనే టి.వీ చానెళ్ళు, ఇంటర్నెట్‌. ‌దునియా మొత్తం కండ్ల ముందుంచబట్టె! గసొంటి టి.వీ.లు సుత మబ్బుల లేశిసూత్తె దేవుడుదయ్యమనబట్టినయి మీసాలు మొల్వని పొరగాండ్లను బాబాలుగా సూపెడుతయి.అంబటాలకు జూడబోతె గాశారం,గోశారం జెప్తమనుకుంట కానత్తయి.ఏ రంగురాళ్ళు ఏ గోశారమోళ్ళు ఉంగరంల బెట్టుకోవాల్నో సూపెడుతరు.వాడు సూపెట్టుడే యెక్కువంటె రెప్పగొట్టకుంటజూశే యెడ్డిబావులోళ్ళు సుత మన తాన  మస్తున్నరు.
‘‘చదివిన సదసద్వివేక చతురత కలుగున్‌’’ అని గీ మాట పోతన బాగోతంల రాశిండు.రాచ్చసరాజు నోటిపొంటి పలికిచ్చినమాట!సదువు వివేకమిత్తదని వందలేండ్ల కిందనే ఆ పోతరాజు జెప్పిండా లేదా!లచ్చలేండ్ల కింద దునియాల సదువంటేందో యెర్కలేనప్పుడే మనతాన నాగార్జున, కాశీ,నలంద పేరుమీద తోపు సదువులుండేయట! మొత్తంకేలి మనదేశానికి  సదువులకోసమచ్చెటోళ్ళంట! మరిప్పటి సదువులు ఇవేకం ఇత్తలేవా! మరేమియ్యబట్టినయి!? సదువులు సట్టుబండ లైతానయా!?
తెల్లోడు దెచ్చిన సదు వులు గుమస్తాగిరి సదువులంటిమి. గా సదువులే తిప్పితిప్పి ఇంకా సదువబడితిమి. సదువుల తీరు మారకపాయె!మన బతుకు రాతలు మారకపాయె!పెట్టుబడిదారోళ్ళ పెత్తనం కిందబడి, ప్రయివేట్‌ ‌చేతులల్ల సదువులు సారం కరువై దునియాలఅన్నిట్ల యెన్కబా టాయె! శాస్త్రీయ సదువులెంకులాడి జెప్పాలె!అనేటి ఇకమతున్నోళ్ళను నెగలనియ్యకపోతిరి.

ఏలికెలెట్లుంటె సదువులాతీర్గ మారబట్టె!
మాటేశిన మనధర్మానికి రేకులిచ్చుకునుడు కలిశచ్చింది.మనుధర్మం సదువులు మొదలై జోతీష్కం విశ్వ విద్యాలయాల సదువయ్యే కాడికచ్చింది. ఏ దేవుడు యేడ బుట్టిండో,యే గద్దెమీద జారుడు బండాడుకున్నడో అంజనమేశి కనుక్కున్నరు. జెప్పెటోళ్ళ నోట్లెకేలి జెప్పిచ్చిండ్లు.మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్లేలు మనుధర్మం సదువుల సారాన్ని బయటకి జెప్పుడు మొదలు జేశిండ్లు. ధర్మాన్ని కాపాయం జేశేందుకు అడోళ్ళు పతాకం పోరగాండ్లను కనుకుంట బాలింతగనే వుండాలంట!ఆడి పిలగాండ్లు గల్మ దాటుడే తప్పంట,పుసుక్కున దాటితె ఎవలన్న రిమ్మ తిరిగి మీద బడితె గవాని తప్పుగాదంట!’’ప
లానా జంతువు ఉచ్ఛల మస్త్ ఔషధాలున్నయి పొద్దుమాపు మేం గిలాసలల్ల బట్టుకోని తాగుతానం! పలానా జంతువు పెండ పెయికి పూసుకోని ఎండల నిల్సుంటె కరోనా రాదుల్లా!’’ అని పూసుకోని జూపెడుతాండ్లు.బతికున్న బాసలకు పానం పోసుడు బందువెట్టి,సచ్చిన బాసకు పానం పోశి వొయ్యిలేశేటందుకు రంగు బూయబట్టిండ్లు.గంగమ్మల మునుగుతె కరోనా పీకుతదని జెప్పిండ్లు మునిగినోళ్ళకు నూటికి తొంభయిమందికి కరోనా సోకి గంగనది ల వేలల్ల పీనుగలై తేలబట్టిండ్లు.మను దర్మం ఎసోంటి సదువులకు పానం బోత్తదో యెరుకున్నోళ్ళు నెత్తినోరు గొట్టుకుంటె యేమన్నాయెనా! గాళ్ళందరిని కట్టగట్టి లోపటేశింది. రాజ్జాంగం వొయ్యిని మూలకిసిరేశింది.శాస్త్రీయతలకు సమాధి కట్టి’’ ఒకటే బాస,ఒకటే దర్మం,’’అనే మనుదర్మం సదువులు రంగుబూసు కొని బయటికి రానున్నయి.’’ఓనమాలకాడ్నించే మనుదర్మం పాఠాలు జెప్పే బరువును నిక్కరుసేనెత్తు’’కుంటదని సర్కారే జరంత తిర్లమర్ల జేశి బయటికి జెప్పింది.

ఇప్పుడు కరోనా బీమారచ్చి సదువులల్ల శాస్త్రీయతను సవాలు జేశింది.పెండబూసుకున్నోళ్ళు బొయిండ్లు.ముక్కుల నిమ్మరసం పిండుకున్నోళ్ళు బొయిండ్లు.గంగల మునిగినోళ్ళు అటెంక పీన్గలై తేలాడబట్టిండ్లు.మనుదర్మం సదువులు తెచ్చినోళ్ళందరు కరోనా కోసం సైన్సెనుకన బడ్డరు. శాస్త్రీయత కాళ్ళు మొక్కబట్టిండ్లు.సాములంత వాక్సిన్‌ ‌డోసులేసుకున్నరు. జనానికి యేవి పాలో యేవి నీళ్ళో మాగనే యెరుకైతాంది. మనుదర్మం సదువుల సారం యేపాటిదో కానత్తాంది.ఏ జాతి భవిషతైనా యెట్లుండాలనేది గాళ్ళ సదువుల తీరును బట్టుంటది.దేశం అవుసరాలు దేశీయంగ తీర్చే సదువులు ,వాటిని సదివే యువత పెంచుకోవాలనే సోయి ఇప్పటికైనా పెరుగాలె!

‘‘సూడ్రా! బయ్‌!ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటి దాంక యింటివి గదా! దేవుడు,దయ్యం,మతం,దర్మం నమ్మకాలు సదువులల్లనే వున్నయి.అవి జదివినోళ్ళు యెట్లుంటరో యెరుకలేదా! సదువులల్ల శాస్త్రీయత తెచ్చేందుకు ఎవలు ముందు పడాల్నో చెప్పాలె!? చెప్పకుంటె బోతె నీకు వాక్సీన్‌ ‌దొర్కకుంట జేత్త మళ్ళా!అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటిబేతాళుని శవాన్ని భుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! ‌మన సదువులిట్నే వుంటె గనుక దేశం వేయ్యేండ్లు యెన్కకు పోతది.సంపదలన్ని మందుకుబోయి కార్పోరేటోళ్ళ పాలయితయి.లాటినమెరికా దేశాల తిప్పలు మనకాడికత్తయి.ప్రగతిశీల ఆలోచనలు పెంచుకున్నోళ్ళే సదువులల్ల కాషాయం రంగు కల్వకుంట అడ్డం బడాలె!అసొంటి యువత  ముందుబడాలె!’’అని జెప్పుకుంట నడ్వట్టిండు..నడ్వబట్టిండు…
– ఎలమంద- తెలంగాణ.

Leave a Reply