Take a fresh look at your lifestyle.

శాంతి దూత ఆత్మ ఘోషిస్తున్నది

విశ్వశాంతిని ఆకాంక్షించిన మన జాతిపిత మహత్మా గాంధీ ఆత్మ ఇప్పుడు ఆశాంతికి గురై ఉంటుంది. దేశ పరిస్థితి, ప్రజల సమస్యలను శాంతియు తంగా పరిష్కరిస్తూ ప్రపంచానికే ఆదర్శప్రాయుడైన గాంధీకి అసలైన వారసులెవరన్న తగాదా ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నది. ఇంతకాలంగా తామే నిజమైన వారసులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ‌నుండి భారతీయ జనతాపార్టీ ఆ హక్కును లాగేసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. వారసు లైనంత మాత్రాన సరిపోదని ఆయన ఆదర్శాలను తు.చ. తప్పకుండా పాటించినప్పుడే అసలైన వారసులవుతారని ఇరు పార్టీల వారు వారసత్వ హక్కు విషయంలో బాగానే విమర్శించుకుంటున్నారు. గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఆయన ఆదర్శాలను వల్లెవేస్తున్నాయి. కనీసం ఇంతకాలానికైనా ఆయన ఆదర్శాలు ఈ రెండు పార్టీలకు గుర్తుకు వచ్చినందుకు సంతోషించాల్సిందే. అయితే ఈ ఒంకతో గాంధీని సొంతం చేసుకునేందుకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. మొదటి నుండి నెహ్రూ, గాంధీ వారసులపై విరుచుకుపడుతూ వొచ్చిన భారతీయ జనతాపార్టీకి ఇప్పుడు గాంధీ సిద్ధాంతాలు భగవద్గీతలా వినిపిస్తున్నాయి. అందుకే 150 జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ గాంధీ సంకల్పయాత్రను చేపట్టింది. ఇదేదో ఒక్క రోజుకు పరిమితం కాకుండా గాంధీ వర్థంతివరకు ఈ యాత్రను సాగించాలన్న సంకల్పం తీసుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో దేశ రాజధానిలోని షాలీమార్‌ ‌బాగ్‌లో ఈ యాత్ర మొదలైంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ అ‌గ్రనేతలను ఆ తర్వాత తరాలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న అపఖ్యాతిని కాంగ్రెస్‌ ‌చాలా కాలంగా మోస్తున్నది. కేవలం గాంధీ, నెహ్రూ వారసులకే ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణ ఉంది. పివి లాంటి అపరచాణుక్యుడి పట్ల కాంగ్రెస్‌ ‌వ్యవహరించిన తీరు బహిరంగ రహస్యమే. వల్లభాయి పటేల్‌, ‌సుభాష్‌ ‌చంద్ర బోసులాంటి వారి జయంతి, వర్ధంతిలపై కాంగ్రెస్‌ ఎప్పుడూ పెద్దగా శ్రద్ద చూపిం• •లేదనే అపకీర్తి ఉంది. కాంగ్రెస్‌ ‌నిర్లక్ష్యం చేసిన వారిని బిజెపి భుజాలకెత్తుకోవడం ద్వారా తమకున్న దేశభక్తిని, దేశంకోసం పోరాడినవారి పట్ల తమకున్న శ్రద్ధ ఎలాంటిదన్న విషయాన్ని దేశ ప్రజలకు తెలియజెప్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే బిజెపి అధికారంలోకి వొచ్చినప్పటి నుండి నెహ్రూ ఇమేజీని పక్కకుపెట్టి వల్లభాయిపటేల్‌ను ముందుకు తీసువస్తున్నది. దేశంలోనే మరెక్కడా లేనంత భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పటేల్‌పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. మహత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌ ‌గాడ్సే నిజమైన దేశభక్తుడని బిజెపి నాయకురాలు సాథ్వీ ప్రజ్ఞాసింగ్‌ ‌ఠాకూర్‌ ‌ప్రశంసిం చిందంటేనే గాంధీ పట్ల బిజెపి వర్గాలకు ఎలాంటి అభిప్రాయముందో అర్థమవుతోందం టున్నది కాంగ్రెస్‌. ఆ ‌వాఖ్యలను ఆమె ఆ తర్వాత వెనక్కు తీసుకుందని ఆపార్టీ నాయకులు చెప్పడం వేరే విషయం. అంత గాఢమైన అభిప్రాయం కలిగిన బిజెపి ఇప్పుడు గాంధీ పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నది. పైగా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. పేరు చివరన గాంధీ అని తగిలించుకోగానే గాంధీ వారసులు కాలేరని, ఆయన కన్న కలలను సాకారం చేసే సత్తా బిజెపికి, ప్రధాని మోదీకే ఉందని ఆ వర్గాలు గాంధీతో కాంగ్రెస్‌కున్న బంధాన్ని దూరంచేసి చూపుతున్నాయి. గాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్‌, ‌గ్రామ వికాసం లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్న తామే నిజమైన గాంధీ వారసులమంటోంది బిజెపి. గతంలో ఆ పార్టీ నాయకులెవరూ గాంధీ గురించి మాట్లాడని విధంగా ప్రధాని మోదీ మాట్లాడిన తీరుపై యావత్‌ ‌దేశం విస్తూపోయింది. ఆయన గాంధేయవాదాన్ని ఆకాశానికెత్తడంతో పాటు, గాంధీ సిద్ధాంతాలు, ప్రభోదాలు విశ్వమానవాళికి ఎంత అవసరమన్న విషయాలను వివరించారు. ప్రధానంగా గాంధీ గురించి ఐన్‌స్టీన్‌ అన్న మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ భూమిమీద గాంధీలాంటి వ్యక్తి జీవించి ఉండేవాడంటే భావితరాలు నమ్మవన్న ఐన్‌స్టీన్‌ ‌మాటలను గుర్తుచేస్తూ ముందుతరాలు గాంధీ సిద్ధాంతాలు గుర్తుంచుకునేలా చేసేందుకు ఆలోచనాపరులు, పారిశ్రామిక వేత్తలు, ఐటి దిగ్గజాలు ముందుకు రావాలంటూ పిలుపిచ్చిన మోదీ దానికి ‘ఐన్‌స్టీన్‌ ‌చాలెంజీ’గా నామకరణ చేశారు. 150 సంవత్సరాల ప్రత్యేక జన్మదినాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ ‌టైమ్స్‌లో ‘నేడు భారత్‌తో పాటు ప్రపంచానికి గాంధీ ఎందుకు అవసరమన్న’ శీర్షికన రాసిన గౌరవ సంపాదకీయంలో విశ్వమానవాళిలో నెలకొన్న విభిన్న వాదనలను సర్దుబాటు చేసి ఒక వారధి నిర్మాణానికి సహకరించిన మహనీయుడిగా పేర్కొనడం ద్వారా గాంధీని తామెంత గౌరవిస్తున్నామన్న విషయాన్ని మోదీ తన వ్యాసం ద్వారా ప్రపంచానికి తెలియ పర్చారు. అయితే బిజెపి గాంధీపట్ల కపట ప్రేమను వొలకబోస్తున్నదని కాంగ్రెస్‌ ‌విమర్శిస్తోంది. దేశంలో గడచిన కొన్నేళ్ళుగా జరుగుతున్న సంఘటనలతో గాంధీ ఆత్మ ఎంతో క్షోభిస్తున్నదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అర్‌ఎస్‌ఎస్‌, ‌బిజెపిపైన విమర్శ నాస్త్రాలను సంధించారు. అవాస్తవాలతో రాజకీయాలు చేసేవారు మహత్ముడిని అర్థం చేసుకోలేరని, గాంధీ అహింసా వాదాన్ని వారెప్పటికీ అనుసరించలేరంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్‌-‌గాంధీ ఒకే రూపమంటూ, కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ను భారత్‌తో పోలుస్తూ రెండూ ఒకే భావసారూప్యం కలిగినవని చెప్పడం విస్మయాన్ని కలిగిస్తున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన సందేశ యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించిన రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలు సత్యమేవ జయతే అంటూ గాంధీ నడిచిన మార్గంలో బిజెపి నడిచి చూపించాలంటూ సవాల్‌ ‌విసిరారు. మొత్తానికి శాంతికామకుడైన మహత్ముడి ఆత్మకు ఈ రెండు పార్టీల వివాదం ఆశాంతిని రగిలిస్తున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy