వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వేములఘాట్‌, ఏటిగడ్డకిష్టాపూర్‌ ‌గ్రామాలలో.. భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

May 8, 2019

అధికారులకు స్వాగతం పలికిన గ్రామస్తులు
సీఎం కేసీఆర్‌ ‌చిత్రపటాలకు పాలాభిషేకం
మల్లన్నసాగర్‌ ‌భూ నిర్వాసితులకు 6వ రోజు చెక్కుల పంపిణీసాగునీటి ప్రాజెక్టుల కింద భూములు పోతున్న గ్రామాల్లో సాధారణంగా సంబురాలు జరగడం చాలా అరుదు. అసలు ఇలాంటి సందర్భమే ఉండదు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగిన సందర్భాలు.. దాఖలాలు కూడా లేవు. కానీ సిద్ధిపేట జిల్లాలోని మల్లన్న సాగర్‌ ‌గ్రామాల్లో మాత్రం ఈ అసాధ్యం సుసాధ్యమైంది. అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్‌ ‌గ్రామాల్లో కీలకమైన వేములఘాట్‌, ఏటిగడ్డకిష్టాపూర్‌
‌గ్రామాలలో ఇంటింటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం పరిహారం చెక్కులను పంపిణీ చేయడానికి వచ్చిన ఉన్నతాధికారుల బృందానికి వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ ‌గ్రామాల రైతులు, నిర్వాసితులు మంగళహారతి పట్టి, కుంకుమ తిలకం దిద్ది ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌క్రిష్ణ భాస్కర్‌, ‌రాజన్నసిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డితో పాటు ఇతర అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్నదాతలంతా చెక్కుల పంపిణీ ఆవరణలో టపాకాయలు కాల్చుతూ…శిబిరంలో సీఎం కేసీఆర్‌ ‌ఫొటోకు పాలాభిషేకం చేశారు.
భూ నిర్వాసితులకు పరిహార చెక్కుల అందజేత
మల్లన్నసాగర్‌ ‌ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం, పునరుపాధి కల్పనకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆరు రోజులుగా జాతర పండుగలా సాగుతున్నది. జిల్లా అధికారిక యంత్రాంగం ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌క్రిష్ణ భాస్కర్‌, ‌రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతున్నది. మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు భూ సేకరణ, పరిహారం, పునరావాస కల్పన, బాధితుల డిమాండ్లు తదితర అంశాలపై కలెక్టర్లు ఇద్దరూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. పరిహార చెక్కులను అందుకున్న రైతుల ముఖాలు సంతోషంతో విరబూశాయి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన పరిహారం.. రైతుల కళ్లలో ఆనందాన్ని నింపింది. నిర్వాసితులకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంచి ప్యాకేజీని అందిస్తున్న ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటామంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న ఆశయం కోసం తాము సంతోషంగా భూములిచ్చామని రైతులు చెబుతున్నారని అధికారులు వెల్లడించారు. వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ ‌గ్రామాలతో పాటుగా ఇప్పటికే పల్లెపహాడ్‌, ‌లక్ష్మాపూర్‌, ‌రాంపూర్‌, ‌బ్రాహ్మణ బంజేరుపల్లి, సింగారం, ఎర్రవల్లిలతో పాటుగా ఇటు కొండ పోచమ్మ రిజర్వాయరులో ముంపునకు గురయ్యే గ్రామాలైన బైలాంపూర్‌, ‌తానేదార్‌ ‌పల్లి, మామిడ్యాల గ్రామాల్లో సైతం అన్నదాతలకు పరిహారం చెక్కులను అందజేశారు.