వరంగల్ కరీమాబాద్ లోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సిఓగా పని చేస్తున్న విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అరుణచంద్రను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నిరసన కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కరోనాకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేధింపులకు గురిచేయడం వల్ల వృత్తిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వైద్యుడు అకారణంగా దూషించడం వల్లే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారని, వైద్యుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అర్బన్ జిల్లా అడిషనల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి మదన్ మోహన్ కు వినతి పత్రం సమర్పించారు.