Take a fresh look at your lifestyle.

‘‘విశ్వాసముండాలె’’!

ఎవలి మర్యాద వాల్లు కాపాడుకోవాలె! ఎవలి పని వాల్లు బరాబరి షేయాలె! కుక్క పని కుక్క జేయాలె! తోక పని తోక జెయ్యాలె! కుక్క తోకనూపుతదా! తోక కుక్కనూపుతదా! అంటె ఎట్ల? వేలాది మంది జీవిడిషిన నెత్తుటితోని తడిషిన ఈ మట్టి మీద ఇమానంగ ఈ రాజ్జెం పట్ల ఇశ్వాసంతోని వుంటడని కుర్సి మీద కూసోబెడ్తిరి. గీ సంగతే యాదిమర్షి లెక్కలు వుల్టాపల్టా జేత్తె ఎట్ల? ఇంతపెద్ద కొలువిచ్చి గౌరవం చేషిన జనానికి మంచిగ సేవలు జెయ్యాలె! ఎవలికి ఎవలు కొలువిచ్చినట్టో లెక్కలివరంగ తేలాలె! గీ ఇగురం మర్షి తొవ్వతప్పుతె బండ్లు ఓడలై, ఓడలు బండ్లయితయని చరిత్ర చెపుతనేవుండె. గిట్ల ఇశ్వాసం గల జీవితోని పోల్సుకోని లెక్కలు తప్పితిరి.సంఘమంటె వుట్టుట్టి ముచ్చటనా! మునుపు సంఘం పేరింటె ఊర్లు దోసుకునే దొరలకు ఒంటేలుకు పడేది. సంఘంగ కలిషి మెలిషుండి చీమలు పాము సంగతర్సుకున్న ఇవరం మనకు తెల్షిందేనాయె. తెలంగాణ పల్లెలల్ల ‘‘దొరా! నీ బాంచెన్‌’’ అని అన్నోల్లే ‘‘ఛల్‌! ‌మనకద్దీ బాంచెన్‌ ‌బతుకులని’’ మర్లబడితె గిట్ల దొరలు, దేశ్‌ముఖ్‌లు పాణం చేతుల బట్టుకోని పట్నాలకు ఉరికిండ్లు. వేలకొద్ది పల్లెల మీద జనం జెండా ఎగిరింది గద! ‘‘గుత్ప సంఘం’’ పెట్టి విసునూరి దేశ్‌ ‌ముఖ్‌ ‌దొరను గజ్జున వణికించి, ఊరినుంచి ఉరికియ్యమని ఐలవ్వకెవరన్న పిలిషి చెప్పిన్లా! ఒవలు సంఘం బెట్టుమని చెప్పరుల్లా! ‘‘అవుతల దోసుకునుడుంటెనే ఇవుతల సంఘం పురుడు పోసుకుంటది’’ గీ తెలంగాణ మట్టిల మొలిషిన గడ్డిపోస సూత కత్తి పట్టుక కొట్లాడుతదంటడు దాశరథి పంతులు. గట్లాసొంటి గడ్డ మీద నియంత నైజామోడే తోకముడిషిండు ఛల్‌! ‌మా రాజ్జెం మేం ఏలుకుంటమని చేయిచేయి కలిపి మన బక్క జనమంత ఏండ్లకేండ్లు నెత్తురు సాలువోసి కొట్లాడితిమి. ఊర్లకూర్లు అగ్గిరగిలి ఢిల్లీ గల్లీలకు సెగ తగిలి దేశమంత గాయ్‌ ‌గాయ్‌ ‌బుట్టి తెలంగాణ తల్లి పురిట్ల కెవ్వు మన్నదంటె వట్టి ముచ్చటా! సదువుకునే పోరగాండ్లు, వకీల్లు, రాశెటోల్లు, పాడెటోల్లు, పంతుల్లు, కొలువుకు సలాంగొట్టి జెండెత్తుకున్న చిన్నా పెద్దా నౌకరోల్లు, హమాలోల్లు, తీరొక్కపని చేషే బుడ్డ మజ్దూరోల్లు, ఆడోల్లు, మొగోల్లు, ముసలోల్లు, చిన్నాపెద్దా, మద్దెరకం యాపారాలు జేషెటోల్లు, ఆఖరికి పోలీసోల్లు ..ఒకటా రొండా వేలూ, లచ్చలల్ల సంఘాలు జెండాలెత్తి సావో బతుకో కలిషి కొట్లాడె కదా! వేలమంది జీవిడిషిన త్యాగాల సంఘటిత శక్తి దేశం మొత్తాన్ని కిందిమీదు జేయాలేదా! ఎర్రకోట పునాదులు లుకలుకయ్యే దాంక కోట్ల గొంతుకలు పట్టిడ్వకుండ దీచ్చతోని లాటీలకు, తుటాలకు ఎదురుబాయె! ఎన్కమొగాన ఎవలున్నరో జూసుకోకుండ ముందు జూపే కతలు పడ్డ రోజులల్ల పీనుగంతటోనికి ఏనుగంత బలం ఏడినుంచి వచ్చిందో యాది మర్సుడైతెట్ల! అప్పడు నెత్తిన బెట్టుకోని దారిజూపిన సంఘాలు ఇప్పుడు ఇసమైనయి! అడుగుడులకు మడుగులొత్తే సంఘాలుండాలె గని, గీ అడుగడుగున నిలేషి అడిగే సంఘాలెందుకుండాలె? రాజీర్కంతోని సంఘాలు అడ్డం నిలువున జీల్చి కొత్త సంఘాలేన్నింటికో పాణం పోషిందెవరో తెల్వని కతనా! సంఘాలను అలాయిబలాయి జేసుకోని పెద్ద లీడర్ల మీద గులాల్‌ ‌సల్లిన యవారం తెల్వందా!
చేయి చేయి కలిపి సూపెట్టిన బలంతోనే కదా మనరాజ్జెం మన ఏలుబడి చేస్కుంటిమి. గట్లాసొంటి ఐకమత్తాన్ని గిట్ల ఎకసెక్కమాడుడేంది? ఏకంగ సంఘం బెట్టుకునే హక్కునే సవాలుజేషి గెలికిత్తె ఎట్ల? ఓడెక్కేదాంక ఓడ మల్లయ్య ఓడెక్కినంక బోడ మల్లయ్యంటె ఎట్లుంటది? ఎవలి మర్యాద వాల్లు కాపాడుకోవాలె! ఎవలి పని వాల్లు బరాబరి షేయాలె! కుక్క పని కుక్క జేయాలె! తోక పని తోక జెయ్యాలె! కుక్క తోకనూపుతదా! తోక కుక్కనూపుతదా! అంటె ఎట్ల? వేలాది మంది జీవిడిషిన నెత్తుటితోని తడిషిన ఈ మట్టి మీద ఇమానంగ ఈ రాజ్జెం పట్ల ఇశ్వాసంతోని వుంటడని కుర్సి మీద కూసోబెడ్తిరి. గీ సంగతే యాదిమర్షి లెక్కలు వుల్టాపల్టా జేత్తె ఎట్ల? ఇంతపెద్ద కొలువిచ్చి గౌరవం చేషిన జనానికి మంచిగ సేవలు జెయ్యాలె! ఎవలికి ఎవలు కొలువిచ్చినట్టో లెక్కలివరంగ తేలాలె! గీ ఇగురం మర్షి తొవ్వతప్పుతె బండ్లు ఓడలై, ఓడలు బండ్లయితయని చరిత్ర చెపుతనేవుండె. గిట్ల ఇశ్వాసం గల జీవితోని పోల్సుకోని లెక్కలు తప్పితిరి. గీ ముచ్చట గిట్ల ఎరుకైతె ఆ ఇశ్వాసం గల జీవులు బతుకుతయా? ఇజ్జత్‌కు సత్తయి గావచ్చు.
ఉన్నట్టుండి మొన్న ఐతారం సాయంత్రం నుంచి రాజ్జెంల అనుకోని ఇచ్చంత్రం మోపయింది. ఊర్లె కుక్కలన్ని పిడాత సావబట్టినయి. బాయిలల్ల పడి కొన్ని సచ్చినయి. రైలు పట్టాల మీద పడి కొన్ని సచ్చినయి. రోడ్లమీద వచ్చిపోయే లారీలకింద, బస్‌ల కిందపడి మస్తుగనం సచ్చినయి. ఇండ్లల్ల పెంచుకునే బొచ్చు కుక్కలు సూత గొలుసులు తెంపుకోని రోడ్లమీదికురికి సావబట్టె. జరంత లెవల్‌ ‌పెద్ద గుండాలని పలానా లీడర్‌ ‌సాబోళ్ళ కుక్క వాళ్ళ గల్లీ కొసకున్న సెల్‌ ‌టవరెక్కి దునికి జీవిడిషింది. మషిరాబాద్‌ ‌దాదా శ్రీ శైలమన్నోళ్ళ కుక్క చౌరస్తా డివైడర్‌ ‌మీదున్న సగం ఇరిగి వున్న ఇనుప సలాకుల మీదికెగిరి దునికింది. గీ కతేందో వున్నదనుకోని జిల్లామొత్తంల పోలీస్‌ ‌టీంలు రంగంల దిగె. ఇప్పటి వరకు చేసిన ఇచారణల తెల్శిన సంగతేందంటె రాజ్జెంల కుక్కలన్ని వాటికవే కావాలనే సత్తానయని, మున్సిపాలిటోల్లకు గీ కుక్కల సావులకు గింత సూతసంబంధం ఏం లేదని తేల్శిండ్లు. రైలు పట్టాల కాడ కూసోని లైవ్‌ ‌కెమెరా పెట్టిన టివీ1 విలేకరి కొంరెల్లి సీరియస్‌గ ఎదురు జూత్తాండు దూరం కేలి గూడ్స్ ‌బండేదో వత్తాంది! ఆ బండి కింద పడేందుకు అప్పుడే ఆడికచ్చిన నల్లమచ్చల కుక్కోటి కానచ్చింది. అగ్గొ అందుకోండ్రా అనంగనె కొంరెల్లి మనుషులు ఉరికిపోయి అమాంతం దాని ఎనుక కాళ్ళందు కున్నరు.హమ్మ దొరికినవె! అనుకునేలోపే ‘‘నన్నెందుకాపుతాండ్రా! ఇశ్వాసం లేని మనిషి జాతోళ్ళారా! దునియాల ఇశ్వాసం వున్న ఒకే ఒక్క ప్రాణి మాకుక్క జాతి. పొద్దున టీవీ జూల్లేదా! మా తోని పోల్సుకోని మీ జాతాయన మా జాతి ఇజ్జత్‌ ‌తీషిండు. అది జూషినంక సూత బతుకుండుడు దండుగనే మా జాతి గిట్ల ఆత్మహత్య జేసుకోవాలని సీరియస్‌గనే డిసైడైనం’’ అని అనుకుంట చెయి దాటిచ్చుకోని గూడ్సుబండి కెదురు పట్టాల మీద ఉర్కబట్టింది.
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్ !
ఇప్పటిదాంక ఇంటివి కదా! కుక్క తోక నూపాల్నా?! తోక కుక్కనూపాల్నా? అనే అనుమానాలు ఎందుకు గిట్ల రేవయితానాయి ? పట్టం కట్టిన ప్రజల పట్ల విశ్వాసం తోనుండకుంటె ఏమైతది గావచ్చు? గీ పశ్నలకు జవాబులు జెప్పకుంటె నాగోల్‌ ‌కాడి మెట్రో పిల్లర్‌ ‌బెచ్చులు మీద పడి సత్తవ్‌. అన్నబేతాళ్‌ ‌బెదిరిచ్చుడిను ‘‘కుక్క తోకను ఊపితె వార్త కాదు. తోక కుక్కను ఊపుతె వార్తయితది.’’ వార్త కాకుంట జూసుకునెటోడే ఇంకో రొండుసార్లన్న ఏలుతడు. అది సూత ప్రజల విశ్వాసం కోల్పోనంతవరకు మాత్రమే’’! అని మనుసులనుకుంట ఆలోచించుకుంట.. భేతాళుని శవాన్ని భుజాన ఏసుకోని నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు.

– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy