వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విక్రమ్‌ ‌ల్యాండర్‌తో.. సంబంధాలు పునరుద్ధరించలేకపోయాం

September 21, 2019

చంద్రయాన్‌ -2 ‌ప్రయోగం
98శాతం విజయవంతం
తదుపరి లక్ష్యం ‘గగన్‌యాన్‌’
ఇ‌స్రో చైర్మన్‌ ‌కె. శివన్‌ ‌వెల్లడి
చంద్రయాన్‌ -2 ‌ప్రయోగం 98శాతం విజయవంతమైందని, విక్రమ్‌ ‌ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించలేక పోయామని ఇస్రో చైర్మన్‌ ‌కె. శివన్‌ ‌వెల్లడించారు. శనివారం భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టులో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ‌ప్రయోగం 98శాతం విజయవంతమైందని తెలిపారు. చంద్రయాన్‌-2‌లోని ఆర్బిటర్‌ ‌చాలా బాగా పనిచేస్తోందని తెలిపారు. ఆర్బిటర్‌లో 8 సైన్స్ ‌పరికరాలు ఉండగా.. అవన్నీ తమ లక్ష్యాలను సక్రమంగా నెరవేరుస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌గురించి ప్రస్తావిస్తూ.. దానితో ఇంకా సంబంధాలు పునరుద్ధరించలేకపోయామని తెలిపారు. విక్రమ్‌తో కమ్యూకేషన్‌ ‌తెగిపోడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు శోధిస్తున్నారని అన్నారు. వారి నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. చంద్రయాన్‌ -2 ‌విజయవంతం అవుతుందని గట్టినమ్మకంతో ఉన్నామని, కానీ చివరి నిమిషంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవటంతో నిరాశకు లోనయ్యామన్నారు. ఇస్రో తన తదుపరి లక్ష్యంగా ‘’గగన్‌యాన్‌ ‌మిషన్‌’‌ని నిర్దేశించుకుందని శివన్‌ ఈ ‌సందర్భంగా వెల్లడించారు.
ఇస్రో చరిత్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ’గగన్‌యాన్‌’. ‌దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాయుధ బలగాల్లో ప్లయింగ్‌ అనుభవం ఉన్న టెస్ట్ ‌పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక పక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి వారికి తొలుత భారత్‌లో తర్వాత రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ‌ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ ‌ఘనత దక్కించుకోనుంది. ఇదిలా ఉంటే విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌కథ ముగిసినట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై పగటి సమయం నేటితో ముగిసి రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలుకానుంది. దీంతో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌కథ ఇక సమాప్తమైనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రయాన్‌-2 ‌ప్రయోగం విఫలమైన నేపథ్యంలో అందరి దృష్టిలో ఇప్పుడు ఇస్రో చేపట్టే గగన్‌యాన్‌ ‌మిషన్‌పై పడింది.