వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వికాసం పేరుతో … వినాశనం

September 4, 2019

-యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలి
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యావంతుల డిమాండ్‌
‌-తవ్వకాలపై హైకోర్టు స్పందించాలని వినతి
-ప్రజా ఉద్యమాలకు తెలంగాణ విద్యావంతుల వేదిక పిలుపు

ఫోటో:‘‌జీవ వైవిధ్య విధ్వంసకర యురేనియం’ బుక్‌ ‌లెట్‌ ‌ను ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ ‌జయధీర్‌ ‌తిరుమల రావు, ప్రొఫెసర్‌ ‌వినాయక రెడ్డి తదితరులు.

వికాసం పేరుతో వినాశనం సృష్టిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలను మార్చుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌జయధీర్‌• ‌తిరుమలరావు సూచించారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా నదికి ఎనిమిది కిలోమీటర్ల దగ్గరలో యురేనియం తవ్వకాలు చేపట్టడం మూలంగా కృష్ణా నది జలాల ఆధారిత సాగునీరు, తాగునీరు కలుషితమై ఆ ప్రభావం హైదరాబాద్‌ ‌లాంటి మహానగరాల పైనే గాక ఇతర ప్రాంతాలపై ఆ ప్రభావం ఉంటుందన్నారు. నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో  ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే, బలవంతపు గ్రామ పంచాయతీ తీర్మానం చేయించుకుని ఆదివాసులను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. స్థానికులకు డబ్బు, ఉద్యోగాలు కల్పిస్తామని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. యురేనియం తవ్వకాలు కేవలం పక్షులు, జంతువులు, చెంచులకు సంబంధించినది కాక సమస్త మానవ జాతికి సంబంధించినదిగా  భావించి దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించాలని విన్నవించారు. చెంచులకు అండగా నిలిచే క్రమంలో కలిసివచ్చే అందరితో కలిసి ఈ నెల చివరలో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రొఫెసర్‌ ‌వినాయక రెడ్డి మాట్లాడుతూ సీసాలో భూతం లాంటి యురేనియం సమస్యతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నరన్నారు. దేశ భక్తి కలిగిన ప్రతి ఒక్కరు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించాలని, ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చారు. ఓ పక్క ప్రభుత్వం మొక్కలు నాటుతునే, ఎన్నో ఔషధ విలువలు కలిగిన చెట్లకు నిలయమైన గుట్టలను నాశనం చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజా ఉపయోగం కలిగిన  ఈ అంశంపై హైకోర్టు స్పందించాలని విన్నవించారు. అనంతరం జీవ వైవిధ్య విధ్వంసకర యురేనియం బుక్‌ ‌లెట్‌ ‌ను వారు ఆవిష్కరించారు. యురేనియం తవ్వకాలపై బాధిత కుటుంబాల ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  విద్యావంతుల వేదిక ప్రతినిధులు డాక్టర్‌ ‌చీమ శ్రీనివాస్‌, ‌ప్రొ।। ఇటికాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.