Take a fresh look at your lifestyle.

వారియర్సే వ్యాధి బారిన పడుతున్నారు

తెలంగాణలో కొరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన వారం రోజుల పరిస్థితులను బేరీజు వేసుకుంటే వైరస్‌ ఇం‌కా వైరల్‌ అవుతున్నట్లుగానే కనిపిస్తున్నది.  గత మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న భద్రతా చర్యలు వ్యాధిని అదుపు చేయగలిగామన్న  భ్రమను మాత్రమే కల్పిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. నాలుగు విడుతలుగా లాక్‌డౌన్‌ను పెంచుకుంటూ పోయిన ప్రభుత్వాలు  ఏం చూసి, లాక్‌డౌన్‌ను క్రమేణా సడలించుకుం టూపోతున్నాయోగాని, ఈ సడలింపులు వైరస్‌ ‌వ్యాప్తికి దోహదపడుతున్నట్లుగా స్పష్టమవుతున్నది. లాక్‌డౌన్‌ ‌పకడ్బందీగా అమలు పర్చినప్పుడు కేవలం రాష్ట్ర రాజధానిలోనే కనిపించిన పాజిటివ్‌ ‌కేసులు ఇప్పుడు రాష్ట్రంలో ఏమూల చూసినా ప్రతీ రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. గత వారంరోజలుగా నమోదు అవుతున్న పాజిటివ్‌ ‌కేసులను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వందకు తక్కువ కాకుండా  ఉంటున్నాయి.  తాజాగా గురువారం, శనివారం, ఆదివారాల్లో నమోదుఅయిన కేసులు ప్రజలను   భయపెడుతున్నాయి. గురువారం 127 కేసులు నమోదుకాగా, శనివారం ఒక్క రోజున్నే రికార్డు స్థాయిలో 206 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి,  అలాగే ఆదివారం రోజుకూడా ఇంచుమించు వంద పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయినట్లు తెలుస్తున్నది.  అయితే అందరినీ ఇప్పుడు భయపెడుతున్నదేమిటంటే శనివారం ఒక్కరోజున్నే ఈ వ్యాధికి గురైన14 మంది మృతి చెందడం. శనివారంనాడు గతంలో ఎన్నడూ లేనంతపెద్ద సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం, మృతులసంఖ్యకూడా ఒక్క రోజున్నే అంతపెద్ద సంఖ్యలో ఉండడం అందరిని కలిచివేస్తున్నది. ఇది కేవలం మనరాష్ట్ర పరిస్థితేకాదు. దేశంలో కూడా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య  విపరీతంగా పెరుగుతున్నది.  తాజా లెక్కల ప్రకారం దేశంలో రెండు లక్షల 56 వేల ఆరువందలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఏడువేల నూట ముప్పై అయిదు మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలోకూడా పెరుగుతున్న కేసులనుకూడా లెక్క వేసుకుంటే 3వేల ఆరువందల యాభై మందికి పాజటివ్‌ ‌రాగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 137గా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం చెబుత్ను లెక్కలు తప్పంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వం వాస్తవ లెక్కలు చెప్పడంలేదని, సరిగా లెక్కిస్తే  కేసుల సంఖ్య ఇంకా చాలా పెద్దదిగానే ఉంటుందంటున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా లక్షల సంఖ్యలో కోవిద్‌ ‌పరీక్షలు చేయడంలేదు. ఇంతా చేస్తే తెలంగాణలో 30వేలకు మించి పరీక్షలు జరుగలేదన్నది ఆయన ఆరోపణ. ఇతర పార్టీల వారు కూడా ఇదే విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఒక ఇంటిలో ఒక వ్యక్తికి కొరోనా పాజిటివ్‌ ‌వస్తే, అతని కుటుంబ సభ్యులందరికీ పరీక్షలను నిర్వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. చివరకు హైకోర్టు కూడా ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్ని  వైరస్‌ ‌పరీక్షలను నిర్వహించారో నివేదిక రూపంలో అందజేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.  ఇదిలా ఉంటే  ప్రభుత్వ ఈ నిర్లక్ష్యం రాష్ట్రంలో కోవిద్‌19‌తో ముందు వరుసలో నిలబడి యుద్దంచేస్తున్న ఫ్రంట్‌ ‌వారియర్స్‌పైన ప్రభావం చూపెడుతున్నదంటున్నాడు బండి సంజయ్‌. ఈ ‌మహమ్మారినుండి ప్రజలను రక్షించే విషయంలో యుద్ద సైనికుల్లా పనిచేస్తున్న డాక్టర్లు ఇతర మెడికల్‌ ‌సిబ్బంది కూడా వైరస్‌ ‌బారిన పడుతున్నారు. గత రెండు వారాల్లో   రాష్ట్రంలో 79 మంది డాక్టర్లకు పాజిటివ్‌ ‌వొచ్చినట్లు తెలుస్తున్నది. విచిత్రమేమంటే పేషంట్‌కు సత్వర చికిత్స అందిస్తున్న ఈ డాక్టర్లంతా ప్రముఖ హాస్పిటల్స్  ‌నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌, ఉస్మానియా, గాంధీలకు సంబందించినవారు కావడం. వీరితోపాటు ప్రైవేటుగా వైద్యసేవలు అందిస్తున్నవారికి, నర్సులు, ఇతర ప్యారా మెడికల్‌ ‌స్టాఫ్‌, ‌లాబ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఇలా ఈ వైరస్‌ ‌విస్తృతమవుతూనే ఉంది. ఒక వైపు తమ వంతు కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నా వీరంతా ఆందోళనలోనే కొనసాగుతున్నారు. తమ కుటుంబ సభ్యులతో పూర్వంలా కలివిడిగా ఉండలేకపోతున్నారు. వీరిద్వారా తమకు వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందోనన్న  భయం కూడా కుటుంబ సభ్యులతోపాటు, ఇతర పేషంట్స్‌కు కూడా లేకపోలేదు. అందుకే డాక్టర్లకు, నర్సులకు టెస్ట్ ‌చేయకుండా విధుల్లోకి పంపించవద్దన్న డిమాండ్‌ ‌వొస్తున్నది.

కోవిడ్‌ 19‌కు సంబందించిన వార్తలు సేకరించడంలోనైతేనేమీ, ఇతరత్రా వార్తల విషయంలోనైతేనేమీ మీడియాలోకి కూడా వైరస్‌ ‌ప్రబలింది . తాజాగా ఎలక్ట్రానిక్‌ ‌మీడియాకు సంబందించిన ముప్పై మూడేళ్ళ జర్నలిస్టు ఈ వ్యాధి కారణంగానే మృతి చెండడం జర్నలిస్టుల్లోకూడా ఆందోళన మొదలైంది. గడచిన వారం రోజుల్లో సుమారు పదమూడు మంది జర్నలిస్టులకు పాజిటివ్‌ ఉన్నట్లు సమాచారం. ఇలా వైరస్‌ ‌వైరల్‌ అవడానికి లాక్‌డౌన్‌ ‌సడలింపులే కారణమంటున్నారు. రాష్ట్రంలో కొరోనా సోకిన మొదట్లో అంటే జనవరి 30న మొదటిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. అప్పటినుండి 40రోజులకు అయిదు వందల కేసులు నమోదు అయితే, ప్రస్తుత పరిస్థితిలో మూడు రోజుల్లోనే అయిదు వందల కేసులు నమోదు అవుతున్నాయంటే ఎంత వేగంగా  వైరస్‌ ‌విజృంబిస్తున్నదన్నది తెలుస్తున్నది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సోమవారంనుండి హోటళ్ళు, మాల్స్, ‌రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవడానికి అనుమతిచ్చింది. జనం అధిక సంఖ్యలో గుమికూడే ఈ ప్రదేశాలకు అనుమతివ్వడంతో రాష్ట్రంలో ప్రతిరోజు మరెన్ని వందల కేసులు నమోదవుతాయోనని ప్రజలు భయపడుతున్నారు.

Leave a Reply