వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వయనాడ్‌లో రాహుల్‌గాంధీ నామినేషన్‌

April 4, 2019

‌పాల్గొన్న సోదరి ప్రియాంక, కాంగ్రెస్‌ ‌శ్రేణులు

కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ కేరళలోని వయనాడ్‌ ‌లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఉదయం హెలికాఫ్టర్‌లో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు వాయనాడ్‌ ‌చేరుకున్న ఆయన.. కాల్పెట్ట కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో పత్రాలు సమర్పించారు. అనంతరం భారీ రోడ్‌ ‌షో నిర్వహించారు. రాహుల్‌, ‌ప్రియాంకలకు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. రోడ్‌ ‌షోకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారీగా హాజరైన కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ కాల్పెట్ల కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో రాహుల్‌ ‌తన సోదరి ప్రియాంకతో కలిసి నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేశారు. అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ… ఐదేళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనక్కు వెళ్లిందన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో పేద వర్గాల ప్రజలకు అండగా నిలిస్తే.. మోదీ మాత్రం తనకు అనుకూలంగా ఉన్న బడా వ్యాపార వేత్తలకు ప్రభుత్వ సొమ్మును ధారాదత్తం చేశారని విమర్శించారు. ఇలాంటి భాజపా ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకుంటే మన ఇబ్బందులు రెట్టింపు అవుతాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మన సమస్యల పరిష్కరించుకుంటూ పాలన సాగిద్దామని రాహుల్‌ అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ ‌కంచుకోట అయిన యూపీలోని అమేధీతో పాటు వయనాడ్‌ ‌నుంచి రాహుల్‌ ఈ ‌సారి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నేత ఎంఐ షానావాస్‌ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈసారి అమేథీతో పాటు దక్షిణాది నుంచి పోటీ చేయాలన్న పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు రాహుల్‌.. ‌వయనాడ్‌ను ఎంచుకున్నారు. ఇక్కడ ఆయన.. సీపీఐ నేత పీపీ సునీర్‌, ఎన్డీయే అభ్యర్థి తుషార్‌ ‌వెల్లపల్లితో తలపడనున్నారు.