Take a fresh look at your lifestyle.

వణికిస్తున్న డెంగ్యూ….

సీజనల్‌ ‌వ్యాధులు మామూలే అని అనుకున్నా, ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి క్షణాల్లో వ్యాపిస్తున్న తీరు, జనం జ్వరాల బారిన పడి రోజుల తరబడి మంచాలకే అతుక్కు పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ వ్యాధి తీవ్రత ఎంత ఉందంటే ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలే నాలుగు వేలకు పైన ఉంటాయి. అనధికారికంగా ఇంకా ఎంత మందికి ఈ వ్యాధి సోకిందో ఊహకందని విషయం. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ ‌వ్యాధులు సర్వసాధారణం. ఏజెన్సీలో ప్రజ్వలించే జ్వరాలే పట్టణాలు, నగరాలకు వ్యాపిస్తున్నాయి. దోమ కాటు వల్ల వచ్చే ఈ జ్వరాలను వైరస్‌ ‌జ్వరాలని కూడా అంటారు. వైరల్‌ ‌జ్వరాల బారిన పడిన వారికి ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స చేస్తూ ఉంటారు. మామూలు వార్డులకు దూరంగా ఈ ప్రత్యేక వార్డులు ఉంటాయి. ఈ వ్యాధి సోకినట్టు అనుమానంపై 19 వేల మంది పరీక్షలు చేయించుకోగా, 1,156 మందికి డెంగ్యూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రులు గల ప్రాంతాల్లో ఇలాంటి పరీక్షలు చేయించుకునే సౌలభ్యం ఉంటుంది. మారు మూల గిరిజన ప్రాంతాలలో వారికి జ్వరం వస్తే అది ఏ జ్వరమో తెలియక వారు కొట్టుమిట్టాడుతుంటారు. గిరిజనులకు వ్యాధులు, లేదా రోగాలు సోకినా, ఇతర అనారోగ్య కారణాల వల్ల మంచాన పడినా, ప్రమాదాల్లో గాయాలు తగిలినా, అన్నింటికీ పసరు వైద్యాన్నే పాటిస్తుంటారు. వారి నమ్మకాలే వారిని కాపాడుతుంటాయి. పట్టణాలు, నగరాల్లో ఏ వ్యాధి లేదా జ్వరం వచ్చినా రక్తం, కఫం, యూరిన్‌ ‌పరీక్షలు చేయించుకోమంటారు. అన్నింటికీ కలిపి తడిసి మోపెడు అయినట్టు వేలాది రూపాయిలు ఖర్చవుతుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అయితే మారు మాట్లాడకుండా బిల్లు ఎంత అయితే అంత కట్టాల్సిందే. ఆరోగ్య తెలంగాణయే నా లక్ష్యం అంటూ వైద్య,ఆరోగ్య శాఖల మంత్రి ఈటల రాజేందర్‌ ఊరూరా తిరిగి అన్ని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నారు. డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నమాట నిజమేనని ఆయన అంగీకరిస్తున్నా, మరణాలు మాత్రం సంభవించలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, అనధికార వార్తల ప్రకారం డెంగ్యూ వల్ల మరణించిన వారి సంఖ్య 15 నుంచి 20 వరకూ ఉండవచ్చునంటున్నారు. అయితే, ఇలాంటి సందర్బాల్లో పుకార్లు ఎక్కువగా ఉండటం కూడా మామూలే. ఒక్క వ్యాధుల విషయంలోనే కాదు, పదిమంది జనం పోగు పడిన చోట ఏదో ఒక ఉపద్రవం జరిగిందన్న ఊహాజనిత వార్తలను వ్యాపింపజేయడంలో మన వారు సిద్ధహస్తులు. అందుకే, గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా పుకార్లు వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు అధికారులు ముందే తీవ్రమైన హెచ్చరిక చేశారు.డెంగ్యూ వ్యాధి ఆరు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లల్లో ఎక్కువ వ్యాపిస్తోంది. డెంగ్యూ వ్యాధి మూడు దశల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో వొళ్ళు తెలియని జ్వరం వస్తుంది. రెండో దశలో వాంతులు ఎక్కువ అవుతాయి. మూడో దశలో జ్వరం ఉన్నా, పారసెటమాల్‌ ‌వంటి మాత్రల వాడకం వల్ల తగ్గిపోతుంది. ఇలాంటి జ్వరాలను నిర్లక్ష్యం చేస్తే అవే పెద్దవి అయి ప్రాణం మీదకి తెస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే కాచి వడబోసిన నీరు తాగాలని మన పెద్దలు తరతరాలుగా మనకు అందిస్తున్న సలహా. వర్షాల వల్ల నీటి పారుదల వ్యవస్థలన్నీ కలుషితం అయ్యాయి. మునిసిపాలిటీల్లో పంచాయతీ వాటర్‌ ‌ట్యాంకుల్లో సురక్షితమైన నీటిని నిల్వచేసి ప్రజలకు సరఫరా చేసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాధులు సంభవిస్తుంటాయి. అలాగే, మురుగు నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో తరచూ బ్లీచింగ్‌ ‌పౌడర్‌ ‌జల్లిస్తూ ఉండాలి, యాంటి జర్మ్ ‌లోషన్స్ ‌జల్లిస్తుండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాఫీ హొటళ్ళు, క్యాంటీన్లలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల జ్వరాలు వ్యాపిస్తుంటాయి. చిన్న పిల్లలు చిన్న దుకాణాల్లో చౌకగా వస్తాయని ఈగలు ముసిరే తీపి పదార్థాలను కొనుక్కుని తింటుంటారు. వాటి వల్ల కూడా జ్వరాల వస్తుంటాయి. రోడ్డు పక్కన మురుగు కాల్వలపై దోమల మందును పిచ్చికారీ చేయాలి. పందులు, ఇతర జంతువుల వల్ల కూడా మెదడు వాపు వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అందువల్ల పెద్దలు పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారని ఇతర విషయాలపై శ్రద్ధ చూపే తల్లితండ్రులకు ఈ జ్వరాలు ఒక గుణ పాఠం వంటివి. ఈ ఏడాది ఇంతవరకూ 37వేల డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా, 4 వేల కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్యులు తెలిపారు. స్వీట్‌, ‌మీట్‌ ‌దుకాణాల్లో పైన ఎటువంటి ఆచ్ఛాదనా లేని పళ్లెంలలో స్వీట్లు, ఇతర తీపి పదార్థాలను కొనుక్కుని తినడం నిషేధం. తల్లితండ్రులు పిల్లల పట్ల తగు శ్రద్ధ తీసుకుంటే డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం లేదు. అయితే, రోగం నయం చేయడం కన్నా, రోగం రాకుండా చూసుకోవాలన్న వైద్య రంగానికి సంబంధించిన పురాతన సామెతను పాటిస్తే ఏ రోగాలూ మన దరిచేరవు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy