Take a fresh look at your lifestyle.

లోపాయకారి పొత్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ప్రత్యర్థి చేసిన తప్పులను ఎత్తిచూపుతూ…తమకు అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారో వివరించటం, మద్దతు కోరి గెలవటం ప్రజాస్వామిక స్ఫూర్తి. అప్పుడే వోటర్లు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోగలగుతారు. అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి లోపాయికారి స్నేహాలు, పోల్‌ మేనేజ్‌మెంట్లు, మద్యం, డబ్బుల ఎర వేసి అధికార పగ్గాలు చేపట్టాలనుకుంటే… ప్రజాస్వామ్యం ముసుగులో జరిగే ఎన్నికల తంతుగా మిగులుతుంది.

ఏపీ రాజకీయాలు తెర వెనుక పొత్తుల ఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. బహిరంగ స్నేహాలు, చీకటి పొత్తులతో వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ నేతత్వంలోని జనసేన బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులు కుదుర్చుకున్నారు. అటు బీజేపీది కూడా ఒంటరి పోరే. కమలదళానికి పెద్దగా క్షేత్ర స్థాయి బలం లేదు కనుక త్రిముఖ పోరుగా భావించాలి. పైకి కనిపిస్తున్న పోల్‌ సీన్‌ ఇది. ఎన్నికల రణ క్షేత్రంలో ఏం జరుగుతుందో సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే తెర వెనుక వ్యూహాలు, స్నేహాల లెక్క ఏమిటో అంచనా వేయాలి.

గత 2014 ఎన్నికల్లో ‘ప్రశ్నిస్తా’ అంటూ సినిమా మేకప్‌ను తీసి రాజకీయ ఆరంగేట్రం చేసిన పవన్‌ కళ్యాణ్‌ కదలికలపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. పవన్‌ ఎఫెక్ట్‌ ఎవరిని ముంచనుంది? ఎవరిని గద్దెను ఎక్కించనుంది? జనసేన పార్టీని పెట్టిన పవన్‌ గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీని, కేంద్రంలో మోడీని సమర్థించారు. వారి గెలుపు కోసం కష్టపడ్డారు. ఆ తర్వాత మూడు నాలుగేళ్ళ వరకు ఆయా పార్టీలతో సఖ్యతతోనే ఉన్నా…దాదాపు ఏడాది కాలం నుంచి రివర్స్‌ గేర్‌ అందుకున్నారు. అటు టీడీపీ బీజేపీతో పొత్తును కటీఫ్‌ చేసుకున్న సమయం కూడా సుమారుగా ఇదే కావటం యాధచ్ఛికం కావచ్చు లేదా వ్యూహాత్మకమూ అవ్వొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీ అభివద్ధి జరగకపోవటానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే కారణమని బాబు నిప్పులు చెరిగిన సమయంలో పవన్‌ కూడా ఇదే రాగం అందుకున్నారు. అంతే కాదు అదే ఊపులో సైకిల్‌నూ చెండాడేశారు. ఏదో సాధిస్తారని మద్దతు ఇస్తే ఏమీ చేయలేదని, లోకేష్‌ కనుసన్నల్లో ఏపీలో అవినీతి కట్టలు తెంచుకుందని విమర్శలు గుప్పించారు. దీనితో టీడీపీతోనూ, బీజేపీతోనూ తెగతెంపులు చేసుకున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకున్నారు చాలా మంది. ఈ తంతు కొన్నేళ్ళు సాగింది. అధికార పక్షంలో ఉండే కంటే…మూడో ప్రత్యర్థిగా బరిలో ఉంటేనే ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చి అంతిమంగా అధికార టీడీపీకి లబ్ది చేకూర్చే వ్యూహానికి గత కొంత కాలం నుంచి పవన్‌ ఆచరణలో పెట్టినట్లు ఆ పార్టీ వేస్తున్న అడుగులను బట్టి అర్థం చేసుకునే అవకాశం లేకపోలేదు. టీడీపీపై దాడి తగ్గించి వైసీపీపై విమర్శలు, ఆరోపణలను మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. సహజంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు ఒకే పౌనపున్యంలో మాట్లాడుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అధికార పార్టీని ఓడించటానికి విపక్షాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మరీ ఏకమవుతాయి. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరి పోరాటం చేస్తే టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌, తెలంగాణా ఇంటి పార్టీ వంటి చిన్నా చితక పక్షాలను కలుపుకుని మహా కూటమి పెట్టి మరీ ఎన్నికల బరిలో పోరాడాయి. ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఉండటానికి విపక్షాలు ఈ వ్వూహంలో వెళతాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలో సహజంగా అధికార పార్టీ పైనే ఉంటాయి. ఇది కూడా ఒక కారణం. కాని ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. జనసేన విపక్షంగా ఉంటూనే టీడీపీపై విమర్శలను తగ్గించింది. సరిగ్గా చెప్పాలంటే తెలుగు తమ్ముళ్ల కంటే వైసీపీనే టార్గెట్‌ చేసుకుని ముందుకు సాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాలు కూడా వీటికి అనుగుణంగానే ఉంటున్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్‌ను జగన్‌ ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్‌కు, కేసీఆర్‌కు దోస్తీ ఏంటి అంటూ టీడీపీ మౌత్‌ పీస్‌లా ఓ సభలో పవన్‌ ప్రసంగం సాగింది. ఇటువంటి విషయాలను చైతన్యం ఉన్న ప్రజానీకం ఇట్టే పసిగడుతుంది.

ఈ నేపథ్యంలో పవన్‌-చంద్రబాబు చీకటి స్నేహంపై కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. పవన్‌ చంద్రబాబును విమర్శించిన రోజుల్లో కూడా ఇదేదో సినిమా స్క్రిప్ట్‌లాంటి వ్యవహారమే అని అనుమాన పడిన వారు లేకపోలేదు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు, అవసరం అయిన సందర్భంలో వ్యవహారం బయటకు వస్తుందని వేచి చూసిన వారూ ఉన్నారు. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్న అంశం హఠాత్తుగా బీఎస్పీతో పవన్‌ పొత్తు. ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ అస్థిత్వం దాదాపు లేదనే చెప్పాలి. ఇంత వరకు అక్కడ ఆ పార్టీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలా లేదు. అటువంటి ఓ రాజకీయ పక్షాన్ని రాత్రికి రాత్రి జనసేన భుజానికెత్తుకోవటానికి కారణం ఏమిటనే విశ్లేషణ సహజంగానే జరుగుతుంది. పైగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు కేటాయించటం ఆశ్చర్యపరిచే అంశం. ఏడాదికి పైగా పవన్‌తో దోస్తీకి అర్రులు చాస్తున్న సీపీఐ, సీపీఎమ్‌కు మాత్రం చెరో ఏడు అసెంబ్లీ, చెరో రెండు లోక్‌సభ స్థానాలు పొత్తులో భాగంగా కేటాయించారు పవన్‌ కళ్యాణ్‌. బీఎస్పీ అధినేత్రి మాయావతితో లక్నోలో సమావేశమై పొత్తు ఖరారు చేసుకోవటం వెనుక ఉన్న అసలైన వ్యూహకర్త చంద్రబాబు అని రాజకీయ వర్గాల సమాచారం. బీఎస్పీకి దళిత పార్టీగా ముద్ర ఉంది. ఇటు వైసీపీ వోట్‌ బ్యాంక్‌ కూడా ఇదే. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా జగన్‌కు మద్దతు దారులు. వైసీపీ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టేందుకే బీఎస్సీ ఇమేజ్‌ను పబ్లిక్‌లోకీ తీసుకువెళ్లే ఎత్తుగడ ఇది. మరో వైపు సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ జనసేన తీర్ధం పుచ్చుకోవటం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇచ్చేదే. సీబీఐ జాయింట్‌ డైరక్టర్‌గా కొనసాగిన కాలంలో చంద్రబాబు, కాంగ్రెస్‌ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతూ వైఎస్‌ జగన్‌ అక్రమ ఆస్థుల కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు సాగించారన్న విమర్శలు వినిపించాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని ఎన్నికల బరిలో దిగుతుండటం చర్చనీయాంశం అవుతోంది. అసలు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న ప్రచారం జరిగింది. అప్పుడు వైసీపీ చేసిన ఆరోపణలను నిజం చేసినట్లు అవుతుందనే కారణంతో వెనకడుగు వేశారు. ఇక అటు టీడీపీ కూడా కాంగ్రెస్‌తో తెర వెనుక స్నేహాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాయి. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, రాహుల్‌ కలిసి వేదిక పంచుకోవటం, కలిసి రోడ్‌ షోలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం చూశాం. కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదుల మీద ఆవిర్భవించిన టీడీపీ మూడున్నర దశాబ్దాల తర్వాత కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హస్తంతో చేతులు కలపటాన్ని తెలంగాణా ప్రజానీకం స్వీకరించలేదు. ఏ మాత్రం కనికరం చూపలేదు. తెలంగాణా వోటర్ల దెబ్బకు టీడీపీ దాదాపు గల్లంతు అయితే కాంగ్రెస్‌కు తల ఎత్తుకోలేనంత పని అయ్యింది. ఈ అనుభవంతో ఏపీలో చంద్రబాబు, రాహుల్‌ కలిసికట్టుగా పోటీ చేయటానికి సాహసించటం లేదు. అందుకే లోపాయకారి ఒప్పందం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో యూపీఏ కూటమికి మద్దతు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ స్నేహం కొనసాగుతుందనే విషయాన్ని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ కండువా వేసుకుని బరిలో నిలబడి గెలిచినా…రేపు కేంద్రంలో అవసరమైతే యూపీఏకు వారి మద్దతు ఉంటుందనేది స్పష్టమే. ఈ సమీకరణాల్లో భాగంగా సీట్ల సర్దుబాట్లు చేసుకోవటం సహజంగా జరిగే ప్రక్రియే.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ప్రత్యర్థి చేసిన తప్పులను ఎత్తిచూపుతూ…తమకు అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారో వివరించటం, మద్దతు కోరి గెలవటం ప్రజాస్వామిక స్ఫూర్తి. అప్పుడే వోటర్లు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోగలగుతారు. అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి లోపాయికారి స్నేహాలు, పోల్‌ మేనేజ్‌మెంట్లు, మద్యం, డబ్బుల ఎర వేసి అధికార పగ్గాలు చేపట్టాలనుకుంటే… ప్రజాస్వామ్యం ముసుగులో జరిగే ఎన్నికల తంతుగా మిగులుతుంది.

రెహాన, సీనియర్‌ జర్నలిస్టు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!