Take a fresh look at your lifestyle.

లీకుల బహానా..! ఈటలకు ఉద్వాసన..?

(ఎ.సత్యనారాయణ రెడ్డి/ హైదరాబాద్‌, ఆగస్టు 24 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):
(ఎ.సత్యనారాయణ రెడ్డి/ హైదరాబాద్‌, ఆగస్టు 24 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

‘ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిన చందంగా…రెవె‘న్యూ’(స్‌)‌చట్ట ప్రక్షాళన లీకులు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పోస్టుకు ఎసరు పెట్టినట్లేననీ చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజకీయ వర్గాలలో, సచివాలయంలోని అధికారులలో. రాష్ట్రమంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను ఏ క్షణమైనా తప్పించొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి అంతటి కారణం…రాష్ట్ర ప్రభుత్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెవెన్యూ చట్ట ప్రక్షాళనకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ అధికారులకు లీక్‌ ‌చేయడమేననీ విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్లితే…అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతోనే రెండ్రోజుల పాటు మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు గానూ … రెవెన్యూ ప్రక్షాళనకు సంబంధించి తన మదిలో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను సిఎం కేసీఆర్‌ ‌సహచర మంత్రులకు, జిల్లాల కలెక్టర్లకు సవివరంగా వివరించారు. కొత్త చట్ట రూపకల్పనకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రగతిభవన్‌తో పాటు, కోమటిబండ మిషన్‌భగీరథ పంప్‌హౌజ్‌ ‌వద్ద వరుసగా రెండ్రోజుల పాటు ఏర్పాటు చేసిన మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో మరింత మెరుగైన పాలనను అందించడం నిమిత్తం భవిష్యత్‌ ‌కార్యాచరణను ఖరారు చేశారు. ఈ రెండ్రోజుల సమావేశాలలో రెవెన్యూ ప్రక్షాళన, కొత్త చట్టం, విధి విధానాలకు సంబంధించి ఖరారు చేసిన వివరాలను చట్టం రూపంలో బయటకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు పొక్కనివ్వరాదనీ మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సిఎం కేసీఆర్‌ ‌తనదైనశైలిలో హుకూం జారీ చేసినట్లు తెలుస్తున్నది. అయితే, సిఎం కేసీఆర్‌ ‌మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో తీసుకున్న ప్రభుత్వ విధానాలను ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనున్నదన్న విషయాలన్నింటినీ…బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ శాఖలోని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డికి శామీర్‌పేటలోని తన ఫాంహౌజ్‌లో పూసగుచ్చినట్లు వివరించారనీ…ఈటల రాజేందర్‌ ‌లీకులతోనే రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చేందుకు ఆందోళన బాటకు సిద్ధమైనట్లు ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు స్పష్టమైన ఆధారాలతో సమాచారం అందిందనీ విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను లీకులు చేయడంతో ప్రభుత్వం తలపెట్టిన ఆశయానికి తూట్లు పడేలా రాజేందర్‌ ‌వ్యవహారం ఉందన్న అభిప్రాయానికి ప్రభుత్వాధినేత కేసీఆర్‌ ‌వచ్చారనీ తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక వ్యూహాలను, ప్రణాళికలను ఈ•ల రాజేందర్‌ ‌లీకులు చేయడం పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్‌ ‌మదిలోని కొత్త రెవెన్యూ చట్టం ఊపిరి పోసుకోకముందే..ప్రభుత్వ
ఆలోచనలు బహిర్గతం కావడంతో రెవెన్యూ
అసోసియేషన్‌ ‌ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాకుండా ఉండటానికి ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు కార్యాచరణకు సిద్ధమవడాన్ని సర్కార్‌ ఒకింత సీరియస్‌ ‌కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చట్టం ఊపిరి పోసుకోకముందే రెవెన్యూ అసోసియేషన్‌ అడ్డుకునే ప్రయత్నాలకు మంత్రివర్గంలోని సీనియర్‌ ‌మంత్రిగా ఉన్న ఈటల రాజేందరే సహకరించారనీ తెలిసిన సిఎం కేసీఆర్‌…ఇక ఊపేక్షించొద్దన్న నిర్ణయానికి వచ్చారనీ సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉద్వాసన తప్పదా?
కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయాలు బహిర్గతం కావడం…దీని వెనుక సీనియర్‌ ‌మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నారన్న ఆధారలు లభ్యం కావడంతో రాజేందర్‌కు ఉద్వాసన తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌ ‌మంత్రి వర్గంలో సీనియర్‌ ‌మంత్రి. అంతేకాదు, కేసీఆర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీని స్థాపించినప్పటి నుంచి కేసీఆర్‌ ‌వెన్నంటి ఉన్నారు. పార్టీ ఆవిర్భావంతో ఉండటమే కాకుండా, బిసి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కేసీఆర్‌ ‌కూడా రాజేందర్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. పార్టీ శాసనసభా పక్షం నేతగా, మంత్రిగా అవకాశం ఇచ్చారు. సిఎం కేసీఆర్‌ ‌తన మొదటి కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ మంత్రి పదవీని కట్టబెట్టారు. అయితే, రాష్ట్రంలో రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్‌ ‌కేబినెట్‌లో ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఉం‌డకపోవచ్చనీ ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ కేసీఆర్‌ ‌తన మంత్రి వర్గంలో రాజేందర్‌ను తీసుకున్నారు. ఈ దఫా మాత్రం ఆరోగ్య శాఖను కేటాయించారు. రెండోసారి రాజేందర్‌కు కేసీఆర్‌ అయిష్టంగానే మంత్రి పదవీని ఇచ్చారన్న ప్రచారమూ ఉంది. విధిలేని పరిస్థితులలో రాజేందర్‌కు మంత్రి పదవీ ఇచ్చిన కేసీఆర్‌…‌రాజేందర్‌పై, ఆ శాఖపై ఓ కన్నేసి ఉంచారనీ తెలుస్తున్నది. అదను కొరకు కేసీఆర్‌ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు రెవెన్యూ లీకుల రూపంలో రాజేందర్‌ను మంత్రి పదవీ నుంచి తప్పించే అవకాశాన్ని రాజేందరే కేసీఆర్‌కు ఇచ్చినట్లయిందనీ గులాబీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక వ్యూహాలకు తూట్లు పొడిచే విధంగా, ప్రణాళికల్ని నిర్వీర్యం చేయాలని నక్క జిత్తుల కుట్రలకు పాల్పడటం బాధ్యాతారాహిత్యమేననీ అంటున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌?
‌టిఆర్‌ఎస్‌లో అత్యంత సీనియర్‌ ‌నాయకుడైన ఈటల రాజేందర్‌-‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు గత కొంత కాలంగా పొసగడం లేదనీ తెలుస్తున్నది. గత డిసెంబర్‌ ‌నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాజేందర్‌ను ఎమ్మెల్యే నుంచి తప్పించి లోక్‌సభ బరిలో దింపుతారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందస్తుగా వెళ్లడం..సామాజిక ఈక్వేషన్లతో తప్పని సరి పరిస్థితులలో హుజురాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ను ఇచ్చారు. మంత్రివర్గంలోనూ కూడా మొదట రాజేందర్‌కు అవకాశం ఇవ్వకపోవచ్చన్నారు. కానీ, తర్వాత కేసీఆర్‌ ‌తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయినప్పటికీ…అప్పటి నుంచే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవీ నుంచి తప్పించడం కొరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, రాజేందరే తనంతటగా తాను పదవీ నుంచి తప్పుకునేలా రెవెన్యూ లీకుల రూపంలో కేసీఆర్‌ ‌మంచి అవకాశం కలిసొచ్చినట్లు తెలుస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి రహస్యంగా ఉంచాలన్న చాలా విషయాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిర్గతం చేయడాన్ని సిఎం కేసీఆర్‌ ‌చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను ఎంతో సీక్రెట్‌గా ఉంచాలనుకున్న రెవెన్యూ ప్రక్షాళన విషయాలను బయటకు చెప్పి రెవెన్యూ సంఘాలను చెప్పి ప్రభుత్వంపై ఎగదోయడానికి రాజేందర్‌ ‌ప్రయత్నించారనీ..ఇటువంటి వారి పట్ల కఠినంగా ఉండాలన్న ఆలోచనకు సిఎం కేసీఆర్‌ ‌వచ్చారనీ సమాచారం. చాలా నెలలుగా రాజేందర్‌ను వదులుకోవాలని చూస్తున్న కేసీఆర్‌కు…ఈ రెవెన్యూ రూపంలో వచ్చిన లీకులను ఆధారంగా చేసుకుని ఏ క్షణమైనా మంత్రి పదవీ నుంచి తప్పించినా తప్పించొచ్చనీ అటు పార్టీలో, ఇటు సచివాలయంలో ఆసక్తికరమైన చర్చసాగుతున్నది. మొత్తంగా ఎటుచూసినా రాజేందర్‌కు ఉద్వాసన ఖాయమనీ తెలుస్తోంది. రాజేందర్‌ ‌విషయంలో కేసీఆర్‌ ‌చాలా ఓపికగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రెవెన్యూ అసోసియేషన్‌ ‌కింకర్తవ్యం?
అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో సిఎం కేసీఆర్‌ ఉన్నారు. ఈ విషయంలో ఏందాకైనా వెళ్లడానికి సిఎం కేసీఆర్‌ ‌సిద్ధంగా ఉన్నారు. దీంతోనే కొత్త రెవెన్యూ చట్టానికి తుది రూపులు దిద్దే పనిలో ఉన్నారు. ప్రజలకు మెరుగైన మరింత మంచి పాలలను అందించడానికి త్వరలోనే రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నది. ఈ చట్టం పట్ల ప్రజలు కూడా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యూహాలను, ప్రణాళికలు బహిర్గతం కావడంతో రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహాలను మంత్రి ఈటల రాజేందర్‌ ‌బహిర్గతం చేశారన్న వార్తలు ఒక పథకం ప్రకారమే బయటకు వచ్చిన క్రమంలో ఇప్పుడు రెవెన్యూ శాఖ అసోసియేషన్‌ ఏం ‌చేయబోతుందన్న ప్రశ్న ఉత్నన్నమవుతుంది. ప్రభుత్వంపై ఎగదోడయానికి రెవెన్యూ శాఖాధికారులను పిలిచి మరీ రాజేందర్‌ ఉప్పందించారనీ ప్రభుత్వాధినేత స్పష్టమైన అంచనాకు రావడంతో…ఇక మీదట రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులపైన కూడా ప్రభుత్వం ఓ కన్నేసే అవకాశం ఉంది. ఈ మారిర తాజా పరిస్థితులలో రెవెన్యూ శాఖ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. ఏది ఏమైనా రెవెన్యూ లీకులు ఈటల రాజేందర్‌ ‌రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy