Take a fresh look at your lifestyle.

లక్షమంది గ్రాడ్యుయేట్లను తయారు చేసిన వాణిదేవి

  • ఎందుకు వోటు వేస్తున్నామని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయనీ, అయితే, వోటు ఎవరికి వేస్తున్నామనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. లక్ష మంది గ్రాడ్యుయేట్లను తయారు చేసిన సురభి వాణీదేవిని హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్‌ ‌టూరిజం ప్లాజాలో మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్‌.‌వాణిదేవికి మద్దతుగా పట్టభద్రుల గెట్‌ ‌టు గెదర్‌ ‌సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ అవసరమనీ, కానీ, అందుకు విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని తొలగించే శాఖను ఏర్పాటు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారసత్వ సంపదగా ఉన్న ఎన్నో సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తున్నదనీ, రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తూ అంబేద్కర్‌ ‌రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్రంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారనీ, ఎస్సీ, ఎస్టీలు విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్‌ ‌పథకం తెచ్చి రూ.20 లక్షలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్దనీ, మాయమాటలతో గాయి గత్తర చేస్తారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది కేవలం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేననీ, మార్కెట్‌ ‌కమిటీలలో సైతం ఈరోజు తెలంగాణ మహిళలు చైర్మన్లు అయ్యారంటే అందుకు కారణం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని గుర్తు చేశారు. పట్టభద్రుల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి నిగర్వి అనీ, లక్ష మంది గ్రాడ్యుయేట్లను తయారు చేసిందని తెలిపారు. పోటీలో ఉన్న 93 మందిలో ఒకే ఒక్క మహిళ ఉందనీ, మహిళలు అంతా వాణీదేవికే వోటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పివి మన ఠీవి అనీ, వాణి మన తెలంగాణ బాణి అనీ, అందరూ వాణీదేవికి వోటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply