Take a fresh look at your lifestyle.

రోదసి…రహస్యాల పుట్టిల్లు….

గగనానికి మెట్లు వేసిన గగారిన్‌
‌నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం

యూరీగగారిన్‌ అం‌తరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర  దినోత్సవం జరుపబడుతుంది.వ్యోమగామి చరిత్రలో 1961 చిరస్మర ణీయమైనది..
1961లో యూరి గగారిన్‌ ‌వోస్టాక్‌ 1 అం‌తరిక్ష విమానంలో ప్రయాణించి 108 నిమిషాలపాటు  భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు.
అంతరిక్షయానం 50వ వార్షికోత్సవానికి కొన్నిరోజుల ముందు 2011, ఏప్రిల్‌ 11‌న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 65వ సెషన్‌లో ఈ దినోత్సవం ప్రకటించబడింది.
అంతరిక్షం గూర్చి యూరీ గగారిన్‌ ‌వ్యాఖ్యలు
అంతరిక్షనౌకలో భూమి చుట్టూ తిరిగేప్పుడు, మన గ్రహం ఎంత అందమైనదో చూశాను. ప్రజలారా మనం ఈ అందాన్ని కాపాడుకుని, పెంపొందిద్దాం, నాశనం చేయొద్దు.అని యూరీ గగారిన్‌ ‌తెలిపారు.
   ఏం అందం.
దూరంగా ఉన్న ప్రియమైన భూమి మీద మబ్బులను, వాటి మెరుపుల నీడలను చూశాను.నీరు నల్లటి, చిన్న మిణుకుమనే చుక్కలా కనిపించింది. క్షితిజాన్ని చూసినప్పుడు లేతరంగు భూమి ఉపరితలానికీ, ఆకాశపు పూర్తి నిఖార్సైన నల్లరంగుకీ మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించింది. భూమి విభిన్నమైన రంగులను చూసి ఆస్వాదించాను. దాన్ని లేత నీలం ప్రభామండలం చుట్టివుంటుంది, అది క్రమంగా నల్లబడుతూ, వైఢూర్య వర్ణంలోకి, గాఢమైన నీలం రంగులోకి, బొగ్గులా నల్లటి నలుపులోకి మారుతూంటుంది.అని యూరీ గగారిన్‌ ‌వాఖ్యను లూసీ బి. యంగ్‌ ‌రాసిన ఎర్తస్ ఆరా (1977) పుస్తకంలో చూడవచ్చు.

గగనంలోనే గగారిన్‌ ‌మరణం
మార్చి 27 1968, చకలోవ్‌స్కీ ఎయిర్‌ ‌బేస్‌ ‌నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా గగారిన్‌, ఇతని శిక్షకుడు వ్లాదిమీర్‌ ‌సెరిఓజిన్‌ ‌మిగ్‌ -15 ‌యుటిఐ విమానం కిర్జాచ్‌ ‌పట్టణం వద్ద కూలిపోయి మరణించారు.
అంతరిక్షం..అంతుచిక్కని, అంతు అనేదే లేని అద్భుతాలమయం.
దశాబ్దాలుగా ప్రయోగాలు కొనసాగుతున్నప్పటికీ.. ఎన్నో ప్రశ్నలను మిగిల్చుతూనే ఉంటుంది. విశ్వాంతరాలపై ప్రయోగాలు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త సంగతులు బయటపడుతూనే ఉంటాయి తప్ప.. వాటికి అంతం అనేది ఉండట్లేదు. వెలుగులోకి వచ్చిన ప్రతి సమాచారం కూడా అత్యంత ఆసక్తిని కలిగించేదే.. ఉత్కంఠతను రేకెత్తించేదే.

అంతరిక్ష పరిశోధనలు-ప్రథమాలు
ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌-1‌ను 1957లో అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ (‌యూఎస్‌ఎస్‌ఆర్‌) ‌ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్‌-2‌ను, అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. 1958లో అమెరికా తన తొలి ఉపగ్రహం ఎక్స్‌ప్లోరర్‌-1‌ను ప్రయోగించింది.
రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్‌ 1961, ఏ‌ప్రిల్‌ 12‌న వొస్తోక్‌-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించాడు. మే, 1961లో అలెన్‌ ‌షెపర్‌డకు మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా గుర్తింపు దక్కింది. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ రష్యాకు చెందిన వాలెంతినా తెరిష్కోవా. ఆమె 1963, జూన్‌ 16‌న అంతరిక్షంలోకి ప్రవేశించింది. రష్యాకు చెందిన అలెక్సీ లెనోవ్‌ అం‌తరిక్షంలో నడిచిన మొదటి మానవుడు. ఆయన 1965, మార్చి18న ఈ ఘనత సాధించాడు. 1969, జూలై 20న అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్ ‌స్ట్రాంగ్‌ ‌చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనతోపాటు ఎడ్విన్‌ ఆ‌ల్డ్రిన్‌, ‌మైకేల్‌ ‌కొలిన్స్ ‌కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు.

 అంతరిక్షంలో భారతీయులు
1984లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాకేష్‌ ‌శర్మ. నవంబర్‌, 1997‌లో కొలంబియా నౌకలో ప్రయాణించిన కల్పనా చావ్లా మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు. ఆమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా నౌక కూలిపోవడంతో మరణించారు. భారతీయ అమెరికన్‌ ‌మహిళ సునీతా విలియమ్స్ అం‌తరిక్షంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు నడిచిన (స్పేస్‌వాక్‌) ‌మహిళ కూడా ఈమే. సునీత 50 గంటల 40 నిమిషాలపాటు అంతరిక్షంలో నడవటంతోపాటు మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్‌ ‌చేసింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)
(ఇండియన్‌ ‌స్పేస్‌ ‌రీసెర్చ్ ఆర్గనైజేషన్‌-ఇ‌స్రో)ను 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో భారత ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం నియంత్రణలో పనిచేస్తోంది.అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటైన ఇస్రో 1975, ఏప్రిల్‌ 19‌న భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్‌ ‌యూనియన్‌ ‌నుంచి ప్రయోగించింది.
భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్‌ ‌విక్రమ్‌ ‌సారాభాయ్‌. ఆయన అహ్మదాబాద్‌లో ఫిజికల్‌ ‌రీసెర్చ్ ‌లేబొరేటరీని ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ ‌సారాభాయ్‌ ‌స్పేస్‌ ‌సెంటర్‌ను ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఆయన ఇస్రో మొదటి చైర్మన్‌. ‌సతీశ్‌ ‌ధావన్‌ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్‌గా పనిచేశారు.ఆయన 1972 నుంచి 1984 వరకు 12 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2002లో సతీశ్‌ ‌ధావన్‌ ‌మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు.

 ఇస్రో ఆధ్వర్యంలో అనేక ఘనతలు సాధించాం.
రోదసి…రహస్యాల పుట్టిల్లు….
అందులో ఏముందో తెలుసుకోవడం..ఓ సాహసం…ఓ శాస్త్రం..
దాని రహస్యాలు ఛేదించాలంటే ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఫలితాలు రాబడుతూనే ఉండాలి…ఆ పని ఇప్పటికే చాలామంది ప్రారంభించారు… ఎడ్లబళ్లపై ప్రయోగ సామాగ్రి తరలించిన దశ నుంచి అడుగులు వేసిన మనం..ఆంక్షలు, అడ్డంకులు, అంతరాయాలను దాటుకుని రోదసివైపు సగర్వంగా, సాధికారికంగా దూసుకుపోతున్నాం. మున్ముందు మరిన్ని అంతరిక్ష విజయాలు ,విశ్వ వ్యాప్తంగా సాధించాలని కోరుకుందాం.
 – పిన్నింటి బాలాజీ రావు, హనుమకొండ.
భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు.
9866776286

Leave a Reply