వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రోడ్డెక్కిన బస్సులు!

November 30, 2019

  • కేసీఆర్‌ ‌పిలుపుతో విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు
  • తెల్లవారు జామునుంచే డిపోల వద్ద సందడి

సీఎం కేసీఆర్‌ ‌పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్‌ ‌పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చి రోడ్డెక్కాయి. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌ ‌లోని ముషీరాబాద్‌ ‌డిపో నుంచి సుమారు 600 ఉద్యోగులు  విధుల్లో చేరేందుకు డిపోకు చేరుకున్నారు, హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా ఉన్న25 డిపోల్లోని 3వేలు బస్సులు రోడ్డుపైకి వచ్చాయి.  రాష్ట్రన్యాప్తంగా ఉన్న 97 డిపోల్లోని 49 వేల మంది సిబ్బంది విధుల్లోకి చేరారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో పది డిపోల పరిధిలో 3,862 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు  హాజరుకానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరుకు దాదాపు 15 మంది కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిప్ట్ ‌డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్‌ ‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ ఆర్టీసీ డీపోలవద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్మికులు ఆనందంగా విధుల్లో చేరుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వరంగల్‌ ‌రీజియన్‌ ‌పరిధిలోని 9 డిపోల్లో మొత్తం 4,200 మంది కార్మికులు ఉత్సాహంగా విధుల్లో చేరారు.  సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ విధుల్లోకి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లో చేరమని చెప్పిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సంస్థ కోసం తక్షణం రూ. 100 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో సంతృప్తి లేనప్పటికీ.. ఉద్యోగాల్లో చేరడం, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని చెంగిచెర్ల డిపో వద్ద టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయడానికి టీఆర్‌ఎస్‌ ‌నేతలు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు.. టీఆర్‌ఎస్‌ ‌నేతలను అడ్డుకున్నారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్న పలుకరించని నేతలు ఇప్పుడు వస్తారా? అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది ఏమిలేక డిపో ముందు సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసి వెళ్లిపోయారు