వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

September 10, 2019

రెండునెలలపాటు సెలవులు పెట్టొద్దు
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం
సూర్యాపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఈటల రాజేందర్‌
‌పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, జగదీష్‌రెడ్డి
వైరల్‌ ‌జ్వరాలతో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ఈటెల రాజేందర్‌ ‌సూర్యాపేట, ఖమ్మంలలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత సూర్యాపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి తనిఖీ చేశారు. ఈటెల వెంట మంత్రులు జగదీష్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, జిల్లా కలెక్టర్‌ అమెయ్‌ ‌కుమార్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు చిన్నారులకు రోటా టీకాలు వేశారు. వైద్యకళాశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చేపట్టిన సక్షలో ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రులు ఆరాతీశారు. సమావేశం అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైరల్‌ ‌జ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, జ్వరాలు దరిచేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించాలని అన్నారు. ఆస్పత్రికి వైద్యచికిత్స కోసం వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని వైద్యులు, సిబ్బందికి ఈటెల సూచించారు. అదేవిధంగా ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్‌ ‌వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సక్ష చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.