Take a fresh look at your lifestyle.

రెండు వర్గాలుగా తెలంగాణ కాంగ్రెస్‌

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కమిటి ఏర్పాటుతో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది.. ఈ కమిటీలో పాతవారికి, సీనియర్‌లకు ఇవ్వాల్సినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న తీవ్ర ఆసంతృప్తి ఆ పార్టీని ఇప్పుడు రెండు వర్గాలుగా చేసింది. ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తూ, కష్టకాలంలోకూడా పార్టీ వెంట ఉన్న తమను కాదని, కొత్త కమిటీలో నిన్నమొన్న పార్టీలోకి వొచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడమేంటని పలువురు సీనియర్లు ఆరోపిస్తున్నారు.

అసలే కునారిల్లుతున్న పార్టీకి దీనివల్ల తీవ్ర నష్టం కలిగే ప్రమాదమున్నది. . ఎవరో కావాలని పనిగట్టుకునే కాంగ్రెస్‌ను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంగానే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదంటూ సీనియర్లంతా ఆరోపిస్తున్నారు. త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతం చేసుకోవాల్సిందిపోయి, దాని వినాశనానికి పథకరచన చేసినట్లుగా ఉందని వారి ఆందోళన.. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌ను రక్షించుకుంటామంటూ ‘సేవ్‌ ‌కాంగ్రెస్‌’ ‌పేరున సిఎల్సీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో శనివారం సమావేశమైనారు.  ఈ సమావేశానికి  సీనియర్‌ ‌నేతలు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి,  మధుయాస్కీ గౌడ్‌, ‌దామోదర రాజనర్సింహ, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరైనారు. వీరంతా ముఖ్యంగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ పరిశీలకుడు మాణిక్కం ఠాకూర్‌పైన  గుర్రుగా ఉన్నారు.

వీరిద్దరి విషయాన్ని అధిష్టానంతోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి నేతలంతా కలిసి త్వరలోనే దిల్లీ  వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. త్వరలో పార్టీ వీడి పొయ్యే అవకాశాలున్నాయనుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా ఈ ఆసంతృప్తివాదులు ఫోన్‌ద్వారా సంప్రదించినట్లు తెలుస్తున్నది.

సీనియర్‌ల నిర్ణయం తన నిర్ణయమని వారికి ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. వాస్తవంగా కాంగ్రెస్‌ ‌పార్టీకి తెలంగాణలో మంచి క్యాడర్‌ ఉం‌ది. ఆంధ్రలో క్యాడర్‌ ఉన్నప్పటికీ నాయకత్వలోపం ఉండగా ఇక్కడ నాయకులకు కొదవలేదు. అయితే ఈ నాయకులమధ్య ఐక్యత లోపించడమే ఆ పార్టీ క్షీణించిపోవడానికి కారణమైంది. రాహుల్‌గాంధీ అన్నట్లు కాంగ్రెస్‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే యువశక్తి అవసరం. అలా చురుగ్గా పనిచేస్తాడనే టిడిపి నుండి వొచ్చినప్పటికీ రేవంత్‌రెడ్డికి సారథ్యం అప్పగించారు. అప్పటినుండి కాంగ్రెస్‌లో సీనియర్లకు, ఇతర పార్టీలనుండి వొచ్చిన వారికి మధ్య పొసగకుండా పోయింది. ఒక్కొక్కరుగా సీనియర్లు  పార్టీనుండి దూరమవుతూ వొచ్చారు. ఉన్నవారిలో కూడా నిత్యం ఏదో కారణంగా బాహాటంగానే రేవంత్‌రెడ్డిని విమర్శించడానికి అలవాటు పడ్డారు. అయితే రేవంత్‌రెడ్డికి  అధిష్టానం ఆశిస్సులు ఉండడంతో సీనియర్లు ఏమీచేయలేకపోతున్నారు. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పరిస్థితిని తెలుసుకుని కొత్త కమిటి ద్వారా ఆ పార్టీని ఇక్కడ శక్తివంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జంబో కమిటీని ప్రకటింపజేశాడు. అదే ఇప్పుడు బెడిసి కొట్టింది.
తెలంగాణలో అధికారం చేపట్టేందుకు దూకుడుమీదున్న  భారతీయ జనతాపార్టీని ఎదుర్కునేవిధంగా కమిటీని పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సి ఉండగా స్థానిక నేతలెవరిని సంప్రదించకుండా కమిటీ ఏర్పాటు చేయడాన్ని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.  పేరుకే జంబో జట్‌ ‌కమిటీ కాని, ఇందులో సగం మంది టిడిపి, ఇతర పార్టీల నుండి వొచ్చిన వారికే పదవులు లభించాయన్నది వారి ఆరోపణ. కమిటీల్లోని 108 మందిలో 58మంది తెలుగుదేశం వారే ఉన్నారంటూ ఆ పార్టీ ఎంపి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపిస్తున్నారు.   అసలు సిఎల్‌పి నాయకుడినైన తనకు తెలియకుండానే  కమిటీని ఎలా ప్రకటిస్తారన్నది  భట్టి విక్రమార్క ఆరోపణ. కమిటీని ప్రకటించడంతోనే  సీనియర్‌ ‌నాయకులంతా తనను  కలుసుకుని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారని, వారికి తాను సమాధానం చెప్పలేక పోతున్నానని ఆయన ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. అసలు కమిటీకోసం ఈ పేర్లను అందించినవారెవరో తమకు తెలియాలంటారాయన. తన రాజకీయ జీవితంలో ఇంత అన్యాయంగా కమిటీని రూపొందించడం ఇప్పటివరకు చూడలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వాపోతున్నారు. కాంగ్రెస్‌లో కోవర్టిజం రాజ్యమేలుతున్నదంటూ  ఆయన ఘాటుగానే విమర్శిస్తున్నారు.  పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమనే కోవర్టులుగా  ముద్రవేస్తున్నారని, సొంత పార్టీవారే ఆలా అని తమపైన సోషల్‌ ‌మీడియాలో పోస్టులు పెట్టించి , తమను బలహీనపర్చాలని చూస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమిటీలో తనకన్నా జూనియర్‌లకు ప్రాధాన్యమిచ్చారని మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో పార్టీ పరంగా తనకున్న పదవులన్నిటికీ ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే  మరో మాజీ ఎంఎల్‌ఏ ‌విష్ణువర్ధన్‌రెడ్డికూడా ఆదే బాట పట్టాడు. ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి సీనియర్‌ ‌లీడర్లు పిసీసీ అధ్యక్షుడిపైన తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలియందికాదు. రేవంత్‌రెడ్డిని మొదటినుండీ వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైతే ఇప్పటికే కాషాయ కండువ కప్పుకోగా, మరోకరు అందుకు సిద్ధపడుతున్నట్లు  పరిస్థితులు చెబుతున్నాయి. ఏదిఏమైనా అధికారపార్టీపై వొస్తున్న వ్యతిరేకతను వోటుగా మల్చుకోవడానికి ఇతర పార్టీలు ముందుకు దూసుకు వొస్తుంటే కాంగ్రెస్‌ ‌మాత్రం వెనుకటి గుణమేల మాను అన్నట్లు కుమ్ములాటలతోనే కాలం గడుతున్నది.

Leave a Reply