Take a fresh look at your lifestyle.

రాజనీతిజ్ఞుడు..పివి

‘ఎన్నికల్లో ఈ అణు కార్యక్రమం గురించి ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని పీవీ భావించలేదు. ఆయన రాజనీతిజ్ఞుడు కనుక అలాంటి పని చేయలేదు. ప్రస్తుత ప్రధాని మోడీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని భారత్‌ ‌విజయవంతంగా ప్రయోగించడాన్ని గురించి ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో రేడియో, దూరదర్శన్‌ ‌ద్వారా ప్రజలకు వివరించడం.. ఎన్నికల ప్రచారంలో ఘనంగా చెప్పుకోవడంపై ఎన్నికల నియమావళికి విరుద్ధమన్న వివాదం చెలరేగింది. పీవీ వంటి ముందు చూపు ఉన్న వారు ఉన్నారన్న సంగతి మోడీ, ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ ‌షాకూ తెలియదు. మోడీ, షాలు పీవీని మాత్రమే కాదు, వాజ్‌ ‌పేయిని కూడా ఆదర్శంగా తీసుకోవడం లేదు..’ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉంది. రాజకీయ వేత్త రేపటి గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు రేపటి తరం గురించి ఆలోచిస్తాడు.
మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళు నడపడం, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా పీవీ మన దేశానికి చేసిన మహోపకారం అణు పరీక్షలకు సర్వం సిద్ధం చేయడం. భారత్‌ను అణు సంపన్న దేశంగా ఆయన తీర్చి దిద్దారు. అణు పరీక్షకు అవసరమైన తతంగాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించారు. భారత దేశం ఎప్పుడూ శాంతి కాముక దేశమే. ఇందులో సందేహం లేదు. అయితే, మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ ‌సైతం అణ్వస్త్ర నిర్మాణ పరిజ్ఞానాన్ని సముపార్జించుకున్న తరుణంలో మన దేశం చేతులు ముడుచుకుని కూర్చోడంలో అర్థం లేదని భావించారు. అందుకే అణు పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. కానీ, కొద్ది రోజులలో ఎన్నికలు సమీపించనున్న తరుణంలో ఈ పరీక్షలు జరిపించడం సమంజసం కాదని నిర్ధారించుకున్నారు. అంతే, ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. స్వయం నియంత్రణ ద్వారానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజనీతిజ్ఞుని లక్షణం అది. తాను అధికారం నుంచి వైదొలుగుతూ తన తర్వాత అధికారాన్ని చేపట్టిన బీజేపీ అగ్రనాయకుడు అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయికి ఈ విషయాలన్నీ స్పష్టం చేసి అణు పరీక్ష జరిపించమని సలహా ఇచ్చారు.
ప్రధానమంత్రి మోడీగారూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ ‌షా గారూ వింటున్నారా..
భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దే నిర్ణయాధికార కమిటీలో పీవీ సభ్యుడు. ఆయన విదేశాంగ మంత్రిగా వ్యవహరించినప్పుడే ఈ కార్యక్రమానికి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. రక్షణాధికారులు, అణు శాస్త్రవేత్తలతో తరచూ చర్చలు జరిపేవారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా భారత్‌ అణు పరీక్ష జరిగినప్పటికీ భారత్‌ ‌సమగ్ర అణు శక్తి దేశంగా రూపుదిద్దుకున్నది పీవీ హయాంలోనే. ఆయన ప్రచారానికి ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. భారత దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకోవాలన్నదే ఆయన ఆకాంక్ష. అందుకు అవసరమైన ప్రాతిపదికను ఆయన ఏర్పాటు చేశారు.
వినయ్‌ ‌సేనాపతి రాసిన ‘ఆఫ్‌ ‌లైన్‌’ అనే ప్రసిద్ధ గ్రంథ•ంలో ‘అణ్వస్త్రం వైపు అడుగు’ అనే అధ్యాయంలో ఇందిరాగాంధీ హయాంలో అణు పరీక్ష జరిగినప్పటికీ అప్పటకి బాంబులను క్షిపణులకు అమర్చే, తరలించే రాకెట్లు లేవనీ, ఈ మొత్తం వ్యవహారంలో సమగ్రమైన అభివృద్ధి పీవీ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. అప్పటికి పాకిస్తాన్‌ ‌చైనా సాయంతో పది అణు బాంబులను తయారు చేసేందుకు సిద్ధంగా ఉందన్న సమాచారాన్ని రక్షణ రంగం నిపుణులు అరుణాచలం వెల్లడించారు.
ఆ సమయంలో భారత దేశానికి సారథ్యం వహిస్తున్న నాయకుడు సాహసించి నిర్ణయం తీసుకోకపోతే వెనకబడిపోయారన్న అపవాదు వస్తుంది. నిర్ణయం తీసుకుంటే తొందరపడ్డారన్న మాటా వస్తుంది. అటువంటి క్లిష్ట సమయంలో పీవీ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం దేశానికి మేలు చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయాలని ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న సమయంలో మన దేశం కూడా అణ్వస్త్రాన్ని నిర్మించి తీరాలని బీజేపీ మాతృక అయిన భారతీయ జనసంఘ్‌ ‌నుంచి ఒత్తిడి వచ్చింది. అణ్వస్త్ర పరీక్షలు చేస్తే భారత్‌ను ఏకాకిని చేయాలని అగ్రరాజ్యమైన అమెరికా ఆలోచనలు చేస్తున్న సమయం అది. విశ్లేషణ పేరిట పీవీ జాప్యం చేస్తారనే అనేవారు కానీ తనకు అలా అనిపించలేదనీ, పీవీ ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించేవారని తనతో ఈ విషయమై పలు సార్లు చర్చించారని డిఆర్‌డిఓ శాస్త్రజ్ఞుడు ఒకరు చెప్పారు.
అణ్వస్త్రాలను తీసుకుని వెళ్ళగల క్షిపణులపై పరిశోధనలు సాగించి 1993లో పృధ్వి 01 క్షిపణి ప్రయోగం విజయవంతంగా జరిపించారు. అణ్వస్త్ర సహిత క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం భారత్‌ ‌సముపార్జించుకున్నది. ఇదంతా పీవీ అందించిన ప్రోత్సాహంతోనే ఆ మరుసటి సంవ త్సరంలో ఈ రంగంలో మన దేశం తన సామర్ధ్యాన్ని పెంచుకుందని రోనెన్‌ ‌సేన్‌ అనే దౌత్య వేత్త చెప్పారు.
1980 దశకంలో ఫ్రాన్స్ ‌నుంచి మిరేజ్‌ ‌విమానాలను కొనుగోలు చేయడంలో పీవీ ప్రధాన పాత్ర వహించారు. మొదటి అణు పరీక్ష జరిగిన 20 ఏళ్ళకు మిరేజ్‌కు అణు బాంబును అనుసంధానించారు. ఆ తర్వాత పీవీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. పీవీ సున్నితంగా తిరస్కరిస్తూ, కొన్ని దేశాలు అణ్వస్త్రాలను దాచుకుని ప్రమాదకరంగా వ్యవహరిస్తున్న తరుణంలో భారత్‌ అణు శక్తిని సంతరించుకోకుండా నిరోధించడం సమంజసం కాదని పీవీ వాదించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే పృథ్విని సైన్యం అమ్ముల పొదిలో చేర్చారు. నిజానికి అప్పుడే మన దేశం అణ్వస్త్ర దేశంగా మారింది. అణు బాంబుల విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నాయని ఆయన అన్నారు. అయితే అమెరికా నిఘా కెమెరాలు మన వైపే ఉన్నాయని శాస్త్ర జ్ఞులు రహస్యంగా పరిశోధనలు సాగించాలని సలహా ఇచ్చారు. 1995 డిసెంబర్‌లో న్యూయార్క్ ‌టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం ఆధారంగా అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ ‌పీవీకి ఫోన్‌ ‌చేసి అణు పరీక్షలు చేయడం లేదని మీరు అధికారికంగా ప్రకటించారు, సంతోషమే కానీ, మా కెమెరాలు చూపిస్తున్న చిత్రాల గురించి ఏమంటారని ప్రశ్నించినప్పుడు ‘భారత్‌ ‌సాధారణ నిర్వహణ పనులను మాత్రమే నిర్వహిస్తోంది.. అణు పరీక్షలు జరపడం లేదనీ, పరీక్షలు జరిపే ఆలోచన ఇప్పటికైతే లేదు.. మాది సర్వసత్తాక ప్రతిపత్తి గల దేశం..మాకున్న హక్కును మేము వదులుకోం’ అని పివీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూలు రావడంతో అణు పరీక్షలకు అంతా సిద్దం చేసినా వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రధాని వాజ్‌ ‌పేయికి ఆ కార్యక్రమం జరిపించాలని సలహా ఇచ్చారు.
ఎన్నికల్లో ఈ అణు కార్యక్రమం గురించి ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని పీవీ భావించలేదు. ఆయన రాజనీతిజ్ఞుడు కనుక అలాంటి పని చేయలేదు. ప్రస్తుత ప్రధాని మోడీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని భారత్‌ ‌విజయవంతంగా ప్రయోగించడాన్ని గురించి ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో రేడియో, దూరదర్శన్‌ ‌ద్వారా ప్రజలకు వివరించడం.. ఎన్నికల ప్రచారంలో ఘనంగా చెప్పుకోవడంపై ఎన్నికల నియమావళికి విరుద్ధమన్న వివాదం చెలరేగింది. పీవీ వంటి ముందు చూపు ఉన్న వారు ఉన్నారన్న సంగతి మోడీ, ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ ‌షాకూ తెలియదు. మోడీ, షాలు పీవీని మాత్రమే కాదు, వాజ్‌ ‌పేయిని కూడా ఆదర్శంగా తీసుకోవడం లేదు.

– మాడభూషి శ్రీధరాచార్యులు,
పూర్వ కేంద్ర సమాచార కమిషనర్‌,
– ‘‌ద వైర్‌’ ‌సౌజన్యంతో.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!