Take a fresh look at your lifestyle.

రాజగోపాల్‌ ‌రెడ్డి మళ్ళీ గెలిచేనా ..?

‘‘‌కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటే తక్షణమే స్పీకర్‌ ‌కు ఫిర్యాదు చేయడానికి ఆ పార్టీ నేతలు రెడీ• అవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ‌కూడా రాజగోపాల్‌ ‌రెడ్డి మీద కన్నేయడంతో ఆయనపైన వేటు పడటం లాంఛనమే కావొచ్చు. మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లాలని కేసీఆర్‌ ‌భావిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి మీద స్పీకర్‌ అనర్హత వేటు క్షణాల్లో పడుతుంది.’’

కోమటిరెడ్డి లొల్లి..!

ఉన్నం శ్రీనివాసరావు, సీనియర్‌ ‌జర్నలిస్టు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌కు గుడ్‌ ‌బై చెప్పడం ఖాయమైంది. త్వరలోనే బీజేపీలో చేరతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.మరో పది,పదిహేను రోజుల్లో కాషాయ కండువా కప్పుకుంటానని ఆయన తేల్చి చెప్పారు.ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ నాయకులతో సమావేశమౌతున్నారు.తనతో పాటు మరికొందరిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్లడానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే బీజేపీలో చేరడానికి ఎందుకు ఆయన సమయం తీసుకుంటున్నారని ఇప్పుడు అందరిలోనూ తలెత్తున్న ప్రశ్న. దేని కోసం ఆయన వేచి చూస్తున్నారన్న దాని మీద చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి కి ఇప్పటికే కాంగ్రెస్‌ ‌షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటి ఆయనను ఆదేశించింది.అయితే ఈ నోటీసుకు సమాధానం ఇస్తానని కూడా రాజగోపాల్‌ ‌రెడ్డి చెపుతున్నారు. పార్టీ మారుతానని స్పష్టంగా చెపుతున్న ఆయనకు కాంగ్రెస్‌ ‌షోకాజ్‌ ‌నోటీసు పైన స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కాని సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకొని కోమటిరెడ్డి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ తనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దాని ఆధారంగా అనర్హత వేటు నుంచి బయట పడాలని రాజగోపాల్‌ ‌రెడ్డి భావిస్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్‌ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తే దాన్ని సాకుగా చూపించి ఎమ్మెల్యే పదవి కాపాడుకోవచ్చునన్నది రాజగోపాల్‌ ‌రెడ్డి ఆలోచన. అయితే కోమటిరెడ్డి దుందుడుకుగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి కాంగ్రెస్‌ ‌నుంచి పెద్దగా స్పందన లేదు. ఆయనపైన చర్యలు తీసుకునే విషయంలో ఆచితూచి ఆ పార్టీ నేతలు వ్యవహారిస్తున్నారు. ఆయన బీజేపీలో అధికారికంగా చేరే వరకు పార్టీ హైకమాండ్‌ ‌చర్యలు తీసుకోకపోవచ్చు. కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటే తక్షణమే స్పీకర్‌ ‌కు ఫిర్యాదు చేయడానికి ఆ పార్టీ నేతలు రెఢీ అవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ‌కూడా రాజగోపాల్‌ ‌రెడ్డి మీద కన్నేయడంతో ఆయనపైన వేటు పడటం లాంఛనమే కావొచ్చు. మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లాలని కేసీఆర్‌ ‌భావిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి మీద స్పీకర్‌ అనర్హత వేటు క్షణాల్లో పడుతుంది.

ఒక వేళ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే విజేత ఎవరు అన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ఈ సారి బీజేపీ గుర్తు మీద గెలుస్తారా లేక అధికార టీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో ఈ సీటు పడుతుందా అనేది ఉత్కంఠ కల్గిస్తోంది. ఒక వేళ బై ఎలక్షన్‌ ‌వస్తే మునుగోడు ఎన్నిక అత్యంత ఖరీదైనది కావొచ్చు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉం‌ది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నుంచి పాల్వాయి స్రవంతి రంగంలోకి దిగడం ఖాయం. ఇక టీఆర్‌ఎస్‌ ‌నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ ‌రెడ్డి రేస్‌ ‌లో ఉంటారు. కాని ఆయన పైన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ‌బలమైన అభ్యర్థిని బరిలోకి దింపొచ్చు. మాజీ ఎం.పి గుత్తా సుఖేంద్‌ ‌రెడ్డి తో పాటు మరికొందరని పేర్లను టీఆర్‌ఎస్‌ ‌పరిశీలించే ఛాన్స్ ఉం‌ది. గుత్తా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే ఏ పార్టీకి అంత సులభంగా విజయం దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే మునుగోడులో కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీలకు మంచి పట్టుంది. సిపిఐ గతంలో ఈ సీటులో విజయం సాధించింది. ఆ పార్టీకి కూడా మంచి సంఖ్యలోనే ఓట్లున్నాయి.

సిపిఎం,బీజేపీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేడర్‌ ఉం‌ది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తరుపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డికి 97,239 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ ‌నుంచి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ ‌రెడ్డి కి 74,687 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన గంగిడి మనోహర్‌ ‌రెడ్డికి 12,727 ఓట్లు వచ్చాయి. కోమటిరెడ్డి 22,552 మెజార్టీతో మునుగోడును దక్కించుకున్నారు. నిజానికి ఈ సీటు మాజీ ఎం.పి పాల్వాయి గోవర్థన్‌ ‌రెడ్డి కుటుంబానిది. ఆయన మరణంతో ఇక్కడ ఆ కుటుంబానికి కొంత పట్టు తగ్గింది. పాల్వాయి కుమార్తె స్రవంతి 2014 లో ఇక్కడి నుంచి పోటీ చేశారు. పొత్తులో భాగంగా మునుగోడును సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్‌ ఆమె కు టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 27,441 ఓట్లను దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి అడ్డుపడటంతో ఆమెకు టిక్కట్‌ ‌దక్కలేదు. మునుగోడుపైన కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ‌గత పదేళ్ల నుంచి పాల్వాయి కి వ్యతిరేకంగా మునుగోడులో గ్రూపులు తయారు చేశారు. గోవర్థన్‌ ‌రెడ్డి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన మరణంతో మునుగోడు సీటును రాజగోపాల్‌ ‌రెడ్డి దక్కించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాల్వాయి స్రవంతి మళ్ళీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినప్పటికి పార్టీ కేడర్‌ అం‌డతో ఆమె గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

మరో వైపు ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి కి ఆందోళన కల్గిస్తోంది. మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తానా లేదా అన్న సందేహాలు ఆయనను వెంటాడుతున్నాయి. మునుగోడులో బీజేపీ బలం చాలా పరిమితం. పార్టీ గుర్తు కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ‌కేడర్‌ ‌పూర్తిగా కోమటిరెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లే సూచనలు లేవు. కోమటిరెడ్డి పార్టీ మారడం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ఆయన తీరుపైన వారంతా రగిలిపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ‌కు ఎదురొడ్డి పార్టీని గెలిపించుకుంటే ఆరునెలలు కాకముందే ఫిరాయించడం కాంగ్రెస్‌ ‌కేడర్‌ ‌కు రుచించడం లేదు. ఇదే సమయంలో కమ్యూనిస్టు భావజాలం కల్గిన మునుగోడు సామాన్య జనానికి కూడా కోమటిరెడ్డి తీరు ఆగ్రహన్ని కల్గిస్తోంది.ఫిరాయింపులకు వ్యతిరేకంగా జనం ఇటీవల జరిగిన లోక్‌ ‌సభ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎం.‌పి లను గెలిపించి వారి ఆలోచలను తేల్చారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి విజయం ఏ మాత్రం సులువు కాదు. ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ఓటమి పాలైతే బీజేపీలో ఆయన ప్రతిష్ట పూర్తిగా దిగజారనున్నది. రెంటికి చెడ్డ రేవడిలా మారడం ఖాయం.దీంతో రాజగోపాల్‌ ‌రెడ్డి ఉప ఎన్నికకు వెళ్లడంపైన సీరియస్‌ ‌గా ఆలోచిస్తున్నారు. మరి ధైర్యం చేసి తన బలాన్ని నిరూపించుకుంటారో లేక సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకొని ఉప ఎన్నికను తప్పించుకుంటారో మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy