Take a fresh look at your lifestyle.

యురేనియం మైనింగ్‌ ‌జరిగితే తెలంగాణ ఇంక బొందలగడ్డే !

ఇన్ని రోజులు ఎందుకో నిశ్శబ్దంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ అనుయాయులు కూడా గత రెండుమూడు రోజుల నుంచీ యురేనియం వల్ల జరగబోయేది ప్రమాదమేనని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని చెప్పటం కూడా జరుగుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర కాబినెట్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌గారు కూడా ఈ అంశం ఇప్పడే తమ దృష్టిలోకి వచ్చిందని (ఇన్ని రోజుల తర్వాత???) దాని గురించి ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తామని ట్వీట్‌ ‌చేసారు. సినిమా యాక్టర్లు, ఇతర సెలేబ్రిటీలు ట్వీట్లు చేసారంటే వాళ్ల పరిమితి అంతే అని అర్థం చేసుకోవచ్చు కానీ, విధాన నిర్ణయాలు చేసేస్థానంలో వాళ్ళు కూడా ట్వీట్లతో ప్రజలకు సమాధానం ఇస్తారా!!!! దానికి ఏ రకమైన బాధ్యత వుంటుంది?తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో అటు రాజకీయ పార్టీలని, వార్తా పత్రికలనీ, టీవీ ఛానెళ్ళనీ, ఇంకో పక్క సామాజిక మాధ్యమాలని కూడా ప్రభావితం చేసిన అంశం ఏదైనా వుందంటే అది అన్ని సమూహాలూ ఒక్కటై నినదిస్తున్న యురేనియం వ్యతిరేక ఉద్యమమే అని చెప్పవచ్చు. కంటిమీద కునుకు లేకుండా నల్లగొండ, నల్లమల ప్రజలు తమ ప్రాంత రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. యురేనియం తవ్వకాల పేరుతో జరగబోయే పర్యావరణ, జీవ జంతుజాల విధ్వంసాన్ని అడ్డుకోవటం కోసం, నల్లమల అడవుల పరిరక్షణ కోసం తమవంతు పాత్రగా సామాజిక మాధ్యమాలలో ఈ అంశం మీద చైతన్యవంతం చేయటం కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న యువ మిత్రుల శ్రమ పుణ్యమా అని ఈ రోజు సెలెబ్రిటీలుగా వున్న కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఫోటోలు దిగుతున్నారు. ట్వీట్లు చేస్తున్నారు. సంతోషం. విషయ ప్రాధాన్యతను గుర్తించినందుకు! ఈ చైతన్యం యురేనియం తవ్వకాలు అనే మాట కేవలం నల్లమల నుంచే కాదు, నల్లగొండ నుంచీ కూడా పూర్తిగా వెళ్లిపోయేవరకూ వారి మద్దతు గొంతు ఇంకా బలంగా వినిపించాలని కోరుకుందాం. ఇది కేవలం నల్లమల అడవులకు మాత్రమే పొంచివున్న ప్రమాదం కాదు అని మళ్లీమళ్లీ చెప్పాల్సి వస్తోంది. అందరి చూపూ నల్లమల మీద వుండగా ఏ రకమైన నిబంధనలూ పాటించకుండా నల్లగొండ జిల్లాలో కాలం చెల్లిన అనుమతులను తమకు తామే పొడిగించుకుని తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు నిరాధారంగా ఏమీ అనిపించడం లేదు. ఇన్ని రోజులు ఎందుకో నిశ్శబ్దంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ అనుయాయులు కూడా గత రెండుమూడు రోజుల నుంచీ యురేనియం వల్ల జరగబోయేది ప్రమాదమేనని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని చెప్పటం కూడా జరుగుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర కాబినెట్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌గారు కూడా ఈ అంశం ఇప్పడే తమ దృష్టిలోకి వచ్చిందని (ఇన్ని రోజుల తర్వాత???) దాని గురించి ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తామని ట్వీట్‌ ‌చేసారు. సినిమా యాక్టర్లు, ఇతర సెలేబ్రిటీలు ట్వీట్లు చేసారంటే వాళ్ల పరిమితి అంతే అని అర్థం చేసుకోవచ్చు కానీ, విధాన నిర్ణయాలు చేసేస్థానంలో వాళ్ళు కూడా ట్వీట్లతో ప్రజలకు సమాధానం ఇస్తారా!!!! దానికి ఏ రకమైన బాధ్యత వుంటుంది? ఇప్పుడు అసలు జరుగుతున్నదేమిటో చూద్దాం. ఈ రాష్ట్రం లోని ప్రధాన అటవీ ప్రాంతంలో యురేనియం ఖనిజ నిక్షేపాల అన్వేషణకు అనుమతులు కోరుతూ అణుఖనిజ విభాగం నుంచీ వచ్చినపుడే నిర్ద్వంద్వంగా ఇలాంటి ప్రమాదకర అంశాలకు మా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు అని నిర్ణయం తీసుకోవచ్చు. ఏ కారణమైతేనేం, లేదా నిబంధనల ప్రకారమైనా గానీ అప్పుడు తీసుకోలేదు. అప్పుడు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలితో జరిగిన సమావేశంలో, ఖనిజ అన్వేషణ కోసం నల్లమల అడవిలో ఏ రకమైన సమస్యలు ఎదురు కాకుండా చూసుకుంటామనీ, అడవి జంతువులకు హానిని కలిగించమనీ, అడవిలోకి ఎలాంటి భారీ యంత్రాలను తీసుకెళ్లమనీ, చెట్లను గానీ, వాటి కొమ్మలను గానీ నరకమని హామీ ఇచ్చారట! దానితో సంతృప్తి పడిపోయిన అధికారులు, సంబంధిత మంత్రిత్వ శాఖ, ఆ శాఖను పర్యవేక్షించే అమాత్యులూ అందరూ మాకేమీ అభ్యంతరం లేదు అని సంతకాలు పెట్టేసారు. అయితే, ఇలాంటి భారీ ప్రాజెక్టులకు అంచలంచెల అనుమతులు అవసరం కాబట్టి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రతిపాదనలో మాత్రం ఇక్కడ చెప్పిన దానికీ అక్కడ అనుమతి కోరినదానికీ పొంతన లేదు. నల్లమల, నాగార్జున సాగర్‌ ‌ప్రాంతాలలో 83 చదరపు కిలోమీటర్ల అడవిలో 4000 బోర్లతో అన్వేషణకు ప్రతిపాదన పెట్టుకుని దానికి అక్కడి నుంచీ సూత్రప్రాయ అనుమతి తీసుకున్నారు. ప్రతిపాదనలో కొన్ని అంశాలు చర్చించాల్సివున్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా అన్వేషణకు అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ చెప్పటమే కాక, ఆ తర్వాత తీసుకోవాల్సిన అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ఏ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలో కూడా ఆదేశించింది. మరి ఈ వ్యవహారమంతా జరిగేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకోవటం ఎలా? వారి ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రికి, వారి కాబినెట్‌ ‌కి తెలియకుండానే, సమాచారం ఇవ్వకుండానే ఇంత పెద్ద నిర్ణయాలు తీసేసుకోగలుగుతుందా? మరో ముఖ్యమైన అంశం, ఏ ప్రతిపాదన అయినా గానీ స్పష్టమైన అంశాలతో వుండాలి. యురేనియం అన్వేషణకు ఇన్ని వేల బోర్లు వేస్తామని చెప్పిన అణు ఇంధన శాఖ 75 మీటర్ల లోతులోకి మూడు అంగుళాల బోర్లు ఒక వెయ్యి, ఏడు అంగుళాల బోర్లు మూడువేలు తవ్వుతామని రాసారు కానీ, నిర్దిష్టంగా ఎక్కడెక్కడ తవ్వుతామనేది స్పష్టం చేయలేదు. ఎందుకని? మరి, భారీ యంత్రాలను అడవిలోకి తీసుకెళ్ళమని, చెట్లు నరకమని, శబ్ద కాలుష్యంతో అడవి జంతువులకు సమస్య తీసుకురామని చెప్పిన వీళ్ళు ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళతారో కూడా తెలియజేయాల్సిన బాధ్యత లేదా? ఈ నాలుగువేల బోర్లు తవ్వటానికి, ఆ యంత్రాలు నిలబెట్టటానికి కావలసిన స్థలం కేవలం కేవలం పది చదరపు మీటర్లు మాత్రమేనట! పైగా, ఆ బోర్లు వేసేటప్పుడు వచ్చే శబ్దం నలభై డేసిబెల్స్ (‌మన వంటిళ్ళలో వాడే ఎలక్ట్రిక్‌ ‌వస్తువులు ఫ్రిడ్జ్, ‌గ్రయిండర్‌ ‌లాంటివి చేసే శబ్దం అంత) మాత్రమేనట! ఇది మనం నమ్మాలి!!!!!!?????? బోర్లు తవ్వాలంటే ఎంత పెద్దయంత్రాలు అవసరమో, ఎంత శబ్దం వస్తుందో, ఎంత దుమ్మూ ధూళి వెలువడుతుందో తెలంగాణ రైతాంగానికి తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. బోర్లు వేసీ వేసీ బోర్లా పడి ప్రాణాలు తీసుకుంటున్న అనుభవం సామాన్యమైనదా? అణు ఇంధన శక్తి శాఖ ఇంత హాస్యాస్పదమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తోంది. చెప్పేవాళ్లకు లేకపోవచ్చు వినే మనకు సోయి వుండాలి కదా! మరి మన ప్రభుత్వ యంత్రాంగం, అటవీ శాఖ, ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎందుకని పరిశీలనాత్మకంగా వుండటం లేదు. లేకపోతే, వీటిని కూడా పట్టించుకునేదేమిటి అనే నిర్లక్ష్యమా! ప్రపంచమంతటా అణువిద్యుత్తు, అణు ఇంధనంతో వస్తున్న రేడియేషన్‌ ‌సమస్యల గురించి మాట్లాడుతూ, ఎలా తమ దేశాల్లో వాటిని తగ్గించుకోవాలని ఆలోచనలు చేస్తున్న సమయమిది. నిన్న గాక మొన్న మనకంటే సాంకేతికతలో ఎంతో ముందున్న జపాన్‌, ‌ఫుకుషిమ ప్రమాదం తర్వాత, ఆ విద్యుత్‌ ‌రియాక్టర్‌ ‌లలో రేడియేషన్‌తో కలుషితమై నీటిని జాగ్రత్త చేయలేక వాటిని సముద్రంలోకి వదలాలనే నిర్ణయం తీసుకుంటే, వెంటనే అనేక దేశాలు తమ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసాయి. ప్రతిదేశానికీ రేడియేషన్‌ ‌వల్ల జరిగే విధ్వసం ఏమిటో తెలుసు. కానీ, మన అణుఇంధన శాఖ ఆ విషయమే అసలు ఉనికిలో లేనట్లుగా ప్రవర్తిస్తుంది. వారి నేతృత్వంలో పనిచేసే యుసీఐఎల్‌ ‌కంపెనీ యురేనియం తవ్వకాలతో కృష్ణానదీ జలాలకు ఏర్పడబోయే ప్రమాదం గురించి ఎక్కడా చెప్పదు. అప్పుడు 2003లో నల్లగొండ లంబాపూర్‌, ‌పెదగట్టుల్లో కూడా ప్రజలకు యురేనియం తవ్వకాలతో కృష్ణానది కలుషితమవదని వాదించింది. భూగర్భ జలాలు సురక్షితంగా ఉంటాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో కూడా చెప్పిన అబద్ధాలు ఈరోజు ప్రజల జీవితాల్ని ఎంత విధ్వంసం చేసాయో కళ్ళ ముందే వుంది. ఇప్పుడు నల్లమల అడవినీ, నల్లగొండ జిల్లాని సర్వ నాశనం చేయటానికి అబద్దాలతో వస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే, ఏ వొత్తిడులు పనిచేస్తున్నాయి? లేకపోతే, 2003లో ప్రతిపక్ష నాయకుడిగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకించిన వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి గారు, తాను ముఖ్యమంత్రి కాగానే, తన సొంత నియోజకవర్గంలోనే యురేనియం తవ్వకాలు అనుమతి ఇవ్వడమే కాక, స్థానిక ప్రజల వ్యతిరేకతను బలప్రయోగంతో, లాఠీ ఛార్జీలతో బెదిరించి అనుమతులు తెప్పించి, నా నియోజకవర్గ ప్రజల మంచీ చెడూ గురించీ వేరే ఎవ్వరూ మాట్లడవద్దనే బెదిరింపు ప్రకటన కూడా ఆయన చేసాడు. ఇప్పుడు తుమ్మలపల్లిలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇదే పరిస్థితి తెలంగాణకు అవసరమా?
కె.సజయ,
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy