Take a fresh look at your lifestyle.

మోదీ వర్సెస్‌ ‌చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం శృతి మించుతోంది. రాజకీయ విమర్శలు కాకుండా వీరిద్దరు వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్న తీరు దిగజారుడు రాజకీయాలను తలపిస్తున్నది. ఒకరు దేశ ప్రధాని కాగా, మరొకరు ముఖ్యమంత్రి. అయినా తమ స్థాయిని మరిచి మాటలయుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. నువ్వు ఒకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా వారు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో ఉద్దండులే. ఎవరు ఎక్కువ సీనియర్‌ అన్న విషయాన్ని పక్కకు పెడితే రాజకీయాలో ఇద్దరూ సీనియర్లే. గడచిన నాలుగున్న రేళ్ల్ళుగా ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగినవారే. విడదీయరాని బంధంలాగా ఒకరినొకరు ఆకాశానికెత్తుకున్న వాళ్ళే. ఇప్పుడు వారిద్దరికి బెడిసికొట్టింది. ఇప్పుడు ఒకరి నీడను ఒకరు సహించలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. నరేంద్రమోదీని పిఎం గద్దె నుంచి దింపాలన్న లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నాడు. అందుకు మోదీని వ్యతిరేకిస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయపార్టీలను కూటమి కట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో నిర్వహించే ప్రతీ సభలో ఆయన్ను తూర్పారపడుతున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా దేశ రాజధానిలో ధర్మపోరాటంపేర దీక్ష చేపట్టాడు. దీంతో దేశవ్యాప్తంగా మోదీ తీరును ఎండగట్టాలన్నదే చంద్రబాబు )క్ష్యం. అందుకు కాంగ్రెస్‌తో సహా బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల నాయకులందరినీ ఈ దీక్షా శిబిరానికి ఆహ్వానించి, తనను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపట్ల ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాన్ని దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. మరో పక్క నరేంద్రమోదీ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆయన దేశంలో ఏ సభలో మాట్లాడినా కాంగ్రెస్‌తో జతకట్టిన టిడిపి అధినేతను విమర్శించకుండా ఉండలేక పోతున్నాడు. దేశ ప్రధానిగా ఆయన నర్మగర్భంగా తన ప్రత్యర్థులను విమర్శించాల్సిన మోదీ వీధి పంచాయితీల్లో విమర్శలు చేసుకునే స్థాయిలో మాట్లాడతుండడాన్ని రాజకీయ విశ్లేషకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
చంద్రబాబు విషయంలో మోదీ చేస్తున్న విమర్శలు ఒక సాధారణ బిజెపి నాయకుడిలానే ఉన్నాయంటున్నారు. తాజాగా ఆయన ఏపి రాజధాని నగరానికి సమీపంలోని గుంటూరులో చేసిన ప్రసంగం అందుకేమాత్రం తీసిపోదంటున్నారు. దానిపై చంద్రబాబు స్పందించడం తప్పు అనలేముగాని, వీరిద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు మాత్రం ప్రజలకు కావాల్సినంత మేతను తెచ్చిపెట్టాయి. ఇప్పుడ ఇద్దరిలో ఎవరు వెన్నుపోటుదారులన్నది ప్రధాన చర్చగా మారింది. చంద్రబాబు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుండీ ఎదుర్కుంటున్న ఆరోపణనే మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించాడు. చాలామంది రాజకీయ నాయకుల్లో నానుతున్న అంశమే అయినా ప్రధాని అంతటివాడు కూడా చంద్రబాబును వెన్నుపోటుదారుడు అనడాన్ని రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగున్నరేళ్ళు ఎవరితోనైతే కలిసి సంసారం చేశారో అ వ్యక్తి ఎన్‌డిఏను వీడిన తర్వాతే వెన్నుపోటుదారుగా మోదీకి తెలిసివచ్చిందా అన్నదిప్పుడు అందరినోళ్ళలో నానుతున్న ప్రధాన ప్రశ్న. చంద్రబాబు ఎన్‌టి రామారావును వ్యతిరేకించినప్పుడు బిజెపి చంద్రబాబుకు ఏవిధంగా సహకరించింది ఆనాటి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి తెలియందికాదు. ఆనాటి విషయం పక్కకు పెడితే మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో తెలుగుదేశం ఎంపిలను మంత్రులుగా తీసుకున్నప్పుడు గాని, ఏపి క్యాబినెట్‌లో బిజెపి ఎంఎల్‌ఏలు మంత్రులుగా చలామణి అయిన ప్పుడుగాని చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారన్నది గుర్తుకు రాలేదు. కేవలం తన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని ఆయన నిలదీసిన నేపథ్యంలోనే ప్రధాని అంతటి వాడు వెన్నుపోటు అంశాన్ని ముందుకు తీసుకురావడం విచిత్రమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు నుండి కూడా ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. కొత్తరాష్ట్రానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తాడని భావించిన చంద్రబాబు మోదీపైన నాలుగేళ్ళు ఈగను కూడా వాలనీయలేదన్నది తెలియందికాదు. కాని, ఇప్పుడు ఆయన ప్రధాని మోదీ కూడా వెన్నుపోటు దారుడేనంటున్నాడు. తనకు గురువు లాంటి లాల్‌కృష్ణ అద్వానిని రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా మోదీని చంద్రబాబు తీవ్రంగా విమర్శిస్తున్నాడు. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లల్లో ముస్లింల ఊచకోతకు కారణమైనా మోదీని ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగించవద్దని ఆనాడు వాజ్‌పాయ్‌కి తాను సూచించినప్పుడు అద్వానీయే ఆడ్డుపడి మోదీని కాపాడిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు గుర్తు చేస్తున్నాడు. అలాంటి అద్వానీని రాజకీయంగా మోదీ దెబ్బతీశాడంటూ మోదీని విమర్శిస్తున్న చంద్రబాబుకు మోదీ ఏమిటన్నది ఆనాడే తెలిసినా ఆయనతో నాలుగేళ్ళు ఎలా దోస్తీ చేశాడంటున్నారు విశ్లేషకులు. అలాగే ప్రధాని చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ‌ప్రస్తావన తీసుకురాగా, చంద్రబాబు ప్రధాని భార్య గురించి మాట్లాడడం రాజకీయాలు వ్యక్తిగత విమర్శలకు దారిదీస్తున్న తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిగజారుడుతనం మాటలు ఆరోగ్యరాజకీయాలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయంటున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!