వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందా ?

May 8, 2019

అధికారంలో ఉన్న అయిదేళ్ళలో దేశాభివృద్ధికి భారతీయ జనతాపార్టీ చేసిందేమీలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ ఇతర రాజకీయ పార్టీలపై విరుచుకుపడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు విడుతలుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయపక్షాలు మహా భారత సంగ్రామాన్ని గుర్తుకుతెస్తున్నాయి. అంతేకాదు మహాభారతంలోని పాత్రలను ఉటంకిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలపరంపరను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ‌వర్సెస్‌ ‌బిజెపిగా కొనసాగుతున్న ఈ మహా సంగ్రామంలో ఆయా పార్టీల అధినేతల మాటల బాణాలు ఈటల్లా తగులుతున్నాయి. దివంగత రాజీవ్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయరంగంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంద్వారా ప్రధాని ఆ పదవికున్న ఉన్నతిని భ్రష్టుపట్టిస్తున్నాడంటూ పలు రాజకీయపార్టీల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కనీస సంస్కారాన్ని కూడా మోదీ మరిచినట్లుందని కొందరు దుయ్యబడుతుంటే, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిద్రలేమితో మతిస్థిమితం తప్పి మాట్లాడి ఉండవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన ఈ అయిదేళ్ళలో తాను దేశ అభివృద్దికి చేసిన కార్యక్రమాలను, చేయాలనుకున్న ప్రణాళికలను కాకుండా ఎదుటిపార్టీపైన, ఆ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడంపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాడన్న విమర్శలు లేకపోలేదు. ఇదే విషయాన్ని కాం•గ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నిస్తున్నది. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తనతండ్రి రాజీవ్‌గాంధీని ప్రధాని మోదీ విమర్శించడమేంటని. దేశానికి తామేమీచేశామో చెప్పుకోలేని పరిస్థితిలో బిజెపి నేతలు తమకుటుంబాన్ని విమర్శించడం అనవాయితీగా మారిందన్నది ఆమె ఆరోపణ. ఈ ఎన్నికల వేళ గతఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ఏమేరకు నెరవేర్చామన్న విషయాన్ని బిజెపి ఎక్కడా చెప్పుకోలేకపోవడాన్ని ఎత్తిచూపుతూ తమ కుటుంబాన్ని విమర్శించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తున్నదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అంతే కాకుండా మోదీని మహాభారతంలోని దుర్యోదనుడితో పోలుస్తూ, దుర్యోధనుడి దురహంకారమే అతని పతనానికి కారణమైందని, అలాగే అభినవ భారతంలో నరేంద్రమోదీ పతనం జరుగుతుందంటూ ఆమె శాపనార్థాలు పెట్టింది. ఇదిలా ఉంటే నరేంద్రమోదీ ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న తీరుపైన కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తున్న తీరు ఆ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. వారణాసిలో నామినేషన్‌ ‌వేయడానికి ముందు ‘‘పోటీలో ఉన్న రాజకీయ పార్టీలేవీ మనకు శత్రుపార్టీలు కావు. ఆ పార్టీలుకూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నవే. అలాగే ఎన్నికలన్నది యుద్ధం కాదు. అదో పండుగ’’ అంటూ పార్టీశ్రేణులనుద్దేశించి మాట్లాడిన మోదీ, ఇప్పుడు పాత విషయాలను తవ్వి, మానిన గాయాలను గె•ర్తుచేయడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా రామ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఎప్పుడో అయిదేళ్ళ కింద జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల విభజనపై మాట్లాడటం అందరినీ విస్మయపరుస్తున్నది. పార్లమెంట్‌ ఎన్నికల మొదటి •విడుత పోలింగ్‌ ఈ ‌రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముందుగా జరిగాయి. అప్పుడు కూడా ఎత్తని ఈ అంశాన్ని మోదీ ఇప్పుడెందుకు లేవనెత్తాడన్నది అర్థంకాని విషయం. అలాగే ఆయన ప్రసంగించిన తీరు పరోక్షంగా విభజనను తప్పుపట్టినట్లుండడం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దేశాన్ని ముక్కలు చేయాలన్న దురాలోచన ఉన్నవారే ఏపి, తెలంగాణలుగా విడగొట్టారని, రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు మాట్లాడేవారే అయినా వారి మధ్య సఖ్యత లేదంటూ, వాజ్‌పాయ్‌ ‌కాలంలో జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ‌ఛత్తీస్‌గడ్‌ ‌ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మాతృ రాష్ట్రాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడంలో బిజెపి పాత్రను ఆయన విస్మరించారని అనుకోలేముగాని, అయిదేళ్ళ తర్వాత మానినగాయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాడన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడిని, తెలంగాణలో •కెసి•ఆర్‌ను, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వచ్చిన ప్రధాని మోదీ, భారత ప్రథమ ప్రధానిని కూడా వదలలేదు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ రిగ్గింగ్‌ ‌చేసి ప్రధాని అయ్యారని, వాస్తవంగా సర్థార్‌ ‌పటేల్‌నే పార్టీలోని అధిక సంఖ్యాకులు ఎన్నుకున్నారంటూ మరో కొత్త వివాదానికి మోదీ తెరదీశారు. అలాగే రాజీవ్‌ ‌గాంధీకి ఆయన భజన బృందం మిస్టర్‌ ‌క్లీన్‌ అం‌టూ కితాబిచ్చినా, ఆయన జీవితమంతా అవినీతి నెంబర్‌ 1 అం‌టూ చేసిన విమర్శ కూడా దేశవ్యాప్తంగా మరో సంచలనాంశంగా మారింది. తన తండ్రిపై మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంకా గాంధీ తీవ్రంగా విమర్శించింది. మోదీని ఆమె దురహంకారి అంటుంటే, రాహుల్‌ ‌గాంధీ కూడా తన తండ్రిపై మోదీచేసిన వ్యాఖ్యలకు ట్వీట్‌ద్వారా ఘాటుగానే స్పందించాడు. ఈఎన్నికల్లో ‘నాతండ్రిపైన చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని కాపాడలేవంటూనే.. యుద్ధం ముగిసింది, మీ ఖర్మఫలితం ఎదురు చూస్తోంది. మీలో నమ్మకం చెదిరిపో తున్నదని అంటూనే,,అయినా మీపై ప్రేమతో ఒక కౌగిలింత…’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన మనోజ్‌ ‌కశ్యప్‌ అనే వ్యక్తి మోదీ వ్యాఖ్యలు తనకు మనస్థాపాన్ని కలిగించిన తీరును తన రక్తంతో రాసిన ఫిర్యాదు లేఖను ఎన్నికల కమిషన్‌కు పంపించడం కొసమెరుపు.