వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మోడువారుతున్న మోడినామిక్స్!

September 9, 2019

నిరుద్యోగం తగ్గించడానికి, వినియోగం పెంచడానికి చిత్తశుద్ధితో ఎలాంటి చర్యలను, విధి విధానాలను రూపొందించలేదు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని ప్రకటించిన మోడీ పాలనలో పెట్టుబడుల ప్రవాహం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఫలితాలను ఇవ్వడం లేదు. తలుపులు బార్లా తెరిచినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతగా రావడం లేదు. కొద్దిగా వచ్చినా అవి ఉనికిలో ఉన్న పరిశ్రమలలో వాటాలు కొనుగోలు తప్ప నూతన పరిశ్రమలను స్థాపించలేదు. ఇటీవల కాశ్మీర్‌ ‌విషయంలో 370 అధికారణం రద్దుతో దేశ అంతర్గత భద్రత, పాకిస్థాన్‌తో యుద్ధ మేఘాలు వంటి భయాలతో తమ ముదుపు చేసిన పెట్టుబడిని పెద్ద ఎత్తున ఉపసంహరించుకున్నారు.స్వతంత్ర భారత చరిత్రలో ఆర్థిక కార్యకలాపాలు. వృద్ధి రేటు ఎన్నడూ లేనంతగా తిరోగమిస్తున్నాయి. జూన్‌ 2019 ‌త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి రేటు 5%నమోదు కావడం. ఆర్థిక వ్యవస్థ అస్థిరత క్షీణతను సూచిస్తున్నది. 2019-20ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 7శాతం నమోదైన ప్రజల వస్తువినియోగ సామర్థ్య వృద్ధి రేటు జూన్‌ ‌నాటికి 3 శాతంకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 12శాతం ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఇప్పుడు 0.6శాతం, 30%ఉన్న పెట్టుబడుల రేటు ఇప్పుడు 20%, 9.6%ఉన్న నిర్మాణ రంగ స్థూలవిలువ 5%, స్థూల మూలధనం ఏర్పాటు నాలుగు శాతంగా నమోదైనవి. కొనుగోళ్ళకు సంబంధించిన ప్రజల ఆచితూచి వ్యవహరించే ధోరణి 63.8%గా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఇది 37.3 శాతంగా ఉంది. ఈ గణాంకాలు రిజర్వ్ ‌బ్యాంకు, ఇతర ప్రభుత్వ ఆర్థిక గణాంక సంస్థలు అధికారికంగా వెలువరించినవే. ఈ సూచికలు పరిమాణాలు దేశ పారిశ్రామిక, వ్యవసాయరంగాల వృద్ధిలో మందగమనాన్ని సూచిస్తూ దేశాన్ని ఆర్థిక మాంద్యం, జీవన సంక్షోభం ముంగిట్లో నిలబెడుతున్నాయి.
ఆటోమొబైల్‌ ‌పరిశ్రమలో ఉత్పత్తులు పెరుకపోయి ఉత్పత్తిని నిలిపివేశాయి. ఉత్పత్తి ప్లాంట్‌ల నుండి మొదలు షోరూమ్‌లు మెకానిక్‌ ‌షెడ్ల వరకు పని చేసే ఉద్యోగులతో నాలుగు లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. స్నాక్స్, ‌బిస్కట్‌ ‌కంపెనీలు పార్లే, బ్రిటానియాలు తమ ఉద్యోగులతో 10 శాతం తొలగించాయి. వస్త్ర పరిశ్రమలో పని చేసే పది లక్షల కార్మికుల ఉపాధిని కోల్పోయారు. సుగంధ ద్రవ్యాలు, టీ, సబ్బుల వినియోగం తగ్గిపోతున్నది. నికరమైన ఆదాయాలు లేక శ్రామిక వర్గాలు, మధ్య తరగతి ప్రజలు నిత్యావసర వస్తువుల వినియోగం తగ్గించుకుంటున్నారు. అభివృద్ధి ఫలాలు అత్యధికంగా సమాజంలో అతి కొద్ది సంపన్నులు మాత్రమే అనుభవిస్తున్నారు. దేశంలో ఒక వైపు అతివృష్టి, మరొక వైపు అనావృష్టి, సరైన రైతు మద్దతు విధానాలు లేకపోవడం వలన వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల తగ్గుముఖం పట్టింది. మోడి ప్రభుత్వం గత ఐదేళ్లలో విద్య, వైద్య రంగాలకు అతి తక్కువ నిధులను ఇచ్చింది. జిడిపిలో విద్యకు ఆరు శాతం, వైద్యరంగానికి ఐదు శాతం కేటాయించాల్సి ఉండగా గత ఆరు బడ్జెట్‌లలో సగటున విద్యకు 0.50%, వైద్యంకు 0.34శాతం మాత్రమే ఇచ్చారు. ఫలితంగా సామాన్య ప్రజలు తమ సంపాదనలో అధికంగా తమ విద్య వైద్యాలకు ప్రవేట్‌ ‌రంగంలో వ్యయం చేస్తున్నారు. ఫలితంగా ఇతర వస్తువుల వినియోగం తగ్గింది. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు, వెనువెంటనే ప్రభుత్వం తన రెవెన్యూను పెంచుకోవడం కోసం నిర్దయగా, ఆశాస్రీయ ప్రమాణాలతో జిఎస్‌టిని విధించడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకపోయాయి. అసంఘటిత రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. ద్రవ్యోల్భణంకు అనుగుణంగా జీతాలు పెరగక పోగా జీతాలు తగ్గాయి. గ్రామీణ శ్రామిక కూలీల రేట్లు నిలకడగా ఉండడం లేదు. దీనితో నగర, గ్రామీణ ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గింది.
నిరుద్యోగం తగ్గించడానికి, వినియోగం పెంచడానికి చిత్తశుద్ధితో ఎలాంటి చర్యలను, విధి విధానాలను రూపొందించలేదు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని ప్రకటించిన మోడీ పాలనలో పెట్టుబడుల ప్రవాహం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఫలితాలను ఇవ్వడం లేదు. తలుపులు బార్లా తెరిచినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతగా రావడం లేదు. కొద్దిగా వచ్చినా అవి ఉనికిలో ఉన్న పరిశ్రమలలో వాటాలు కొనుగోలు తప్ప నూతన పరిశ్రమలను స్థాపించలేదు. ఇటీవల కాశ్మీర్‌ ‌విషయంలో 370 అధికారణం రద్దుతో దేశ అంతర్గత భద్రత, పాకిస్థాన్‌తో యుద్ధ మేఘాలు వంటి భయాలతో తమ ముదుపు చేసిన పెట్టుబడిని పెద్ద ఎత్తున ఉపసంహరించుకున్నారు. అలాగే నీరవ్‌ ‌మోడీ, విజయమాల్యా , మొహల్‌ ‌చోస్కి వంటి రుణ ఎగవేతదారులతో బ్యాంకులు భారీ లోన్స్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. పేరుకపోయిన నిరర్ధక ఆస్తులను ఉత్పత్తి రంగానికి మళ్ళింప చేయడంలో వైఫల్యం పొందాయి. ఈ పరిణామాలు జిడిపి తగ్గుదలతో పాటు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షిణత, ద్రవ్యోల్భణం, నిరుద్యోగ రేటు ఆరు శాతం పెరగడం మొదలగు విపత్తులను ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నది.
వాస్తవిక పరిస్థితి ఇలా ఉండగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదల కోసం ఆచరణాత్మక పనుల జాడ కానరావడం లేదు. పైగా మోడీ షా ఇతర సంఘ్‌ ‌పరివారం తమకాలంలో వృద్ధి రేటు వలన జి 8 అగ్రరాజ్యాల సరసన చేరనున్నామని, ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశంగా పి 5 క్లబ్‌ ‌లో స్థానం పొందనున్నామని ప్రకటిస్తున్నారు. కొనుగోలు సమానత్వ శక్తి పెరుగుతుందని మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తలసరి ఆదాయం పెరిగి పేదరికం మాయమవుతుందని, మధ్యమ ఆదాయం గల దేశాల సరసన చేరుతుందని పలుకుతున్నారు. ఈ తాత్కాలిక సంక్షభం యుపిఏ, కాంగ్రెస్‌ ‌వైఫల్యం అని తమ సహజాతమైన గోబెల్స్ ‌ప్రచారం చెస్తున్నారు. కాని భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నంత సంక్షోభాన్ని ఎప్పుడు ఎదుర్కోలేదు. 1950 నుండి 1980 వరకు గౌరవప్రదమైన వృద్ధిరేటును కలిగి ఉంది. 1980-1998 వరకు ఆకట్టుకునే పెరుగుదలను నమోదు చేసింది. 2005-2014 వరకు ‘‘పటిష్టమైన ఆర్థిక దశాబ్దముగా నిర్మించాయి’’. 1998-2004 ఎన్‌డిఏ హయాంలో 2.85% ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు యుపిఏ హయాంలో 15.44శాతం పెరిగాయి. అలాగే 5.9% ఉన్న జిడిపి 7,6% నుండి 10.2% పెరిగింది. పాలనలో పారదర్శకతను అభివృద్ధిలో ప్రజలకు న్యాయమైన వాటా కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, భూసేకరణ పరిహార పునరావాస చట్టం, ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టాలను రూపొందించి అమలు చేసింది. ఇలాంటి విప్లవాత్మక ప్రజానుకూల చట్టాలను మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వాటి స్ఫూర్తిని బలహీనం చేసే దిశగా సవరణలను చేసింది. జాతీయోద్యమ ఆకాంక్షలతో తొలి ప్రధాని నెహ్రూ ప్రజల ప్రగతికి తోడ్పడే మౌలిక రంగాలను విద్య, వైద్య సంస్థలను, శక్తి, గనులు, వనరులు, రవాణ, రక్షణ తదితర సంస్థలను, పరిశ్రమలను, ప్రభుత్వరంగములోనే స్థాపించాడు. 1998-2004 కాలంలో బీజేపీ ప్రభుత్వం సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం నెహ్రూ స్థాపించిన ప్రభుత్వ పరిశ్రమల నుండి పెట్టుబడుల ఉపసంహరణను ప్రాంభించింది. దీని కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత కూడా వారిదే.ఇప్పుడు కూడా అదే దారిలో నడుస్తూ 2019 బడ్జెట్‌లో పెట్టుబడులను ఉపసంహరణ చేసి లక్ష కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. వీటి వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోతున్నాయి. జాతీయ నమూనా సర్వే ఉపాధి 2018 గణాంకాల మేరకు తయారీ రంగం కేవలం12 శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారని తెలియచేసింది. దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ రాజ్య ఫలాలు అందిస్తామన్న మోడినామిక్స్ ‌మోడువారుతున్నది. ఆర్థిక సుస్థిరత, సమ్మిళిత అభివృద్ధే ప్రపంచ స్థాయిలో దేశాల పలుకుబడికి ప్రామాణికంగా మారిన కాలంలో ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని విఘాతం కలిగించే వైషమ్య, ఉద్రిక్త కలహాలతో పబ్బం గడుపుకునే పాలన ఇక చాలించాలి. సామాజిక బాధ్యతతో పని చేసే ప్రభుత్వ పరిశ్రమల నుండి పెట్టుబడుల ఉపసంహరణ తక్షణమే ఆపివేసి వాటిలో పెట్టుబడులు పెంచాలి. సంపద సమాన పంపిణీ అనే రాజ్యాంగ ఆదర్శం వెలుగులో ఆర్థిక విధానాలు రూపొందించాలి. సర్వ సత్తాక స్ఫూర్తితో అత్యధిక ప్రజల ప్రయోజనాలకు పాలన కొనసాగించాలి. వ్యవసాయ రంగంలో సబ్సిడీలను పెంచి గిట్టుబాటు ధరలను కల్పించాలి. వ్యవసాయరంగం వృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులు, ఎగుమతులతోనే వృద్ధిరేటు పెరుగుతుందని గ్రహించాలి. విద్య, ఆరోగ్య రంగాలలో సంస్కరణలు యుద్ధప్రాతిపదికగా చేపట్టి సాంకేతిక, సృజనాత్మక నైపుణ్యాలను కల్గించి ఉద్యోగ కల్పన చేయాలి. గుత్తాధిపత్య వ్యతిరేక చట్టాలకు జీవం పోసి అమలు చేయాలి. బ్యాంకుల పునరుజ్జీవనం కోసం ఇచ్చిన 70 వేల కోట్లను, ఆర్‌బిఐ నుండి తీసుకున్న 1.76 వేల కోట్లను మౌలిక సౌకర్యాల కల్పన కోసం, అపారంగా ఉన్న మానవ వనరుల అభివృద్ధి కోసం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను జవజీవాలు కల్పించడం కోసం ఉపయోగించాలి. ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలి. పనికి ఆహార పథకాన్ని విస్తరించి ధీర్ఘకాల అవసరాల కోసం భూ, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి. ఇలాంటి తక్షణ, దీర్ఘకాలిక చర్యలను వెంటనే ప్రారంభిస్తే మాంద్యం నుండి బయటపడి సవ్యమైన రీతిలో ఆర్థికాభివృద్ధి దిశగా సాగే అవకాశముంది. లేకపోతే అంబేద్కర్‌ అన్నట్లు ‘‘సామాజిక ఆర్థిక వైరుధ్యాలు, వ్యత్యాసాలు దీర్ఘకాలం కొనసాగినట్లైతే, వీలైనంత త్వరగా తొలగించనట్లైతే అసమానత్వంతో బాధపడే వారు రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి నిర్మించిన పాలన వ్యవస్థను కూలదోస్తారు.
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం