వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మోడీ విభజనకారి…

May 10, 2019

వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు
‘టైమ్‌’ ‌మ్యాగజైన్‌ ‌కవర్‌ ‌కథనం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

‌ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందిన టైమ్‌ ‌మ్యాగజైన్‌ ‌భారత్‌లో లోక్‌ ‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కవర్‌ ‌పేజీ ముఖ చిత్రంతో 20 మే 2019 సంచికను విడుదల చేసింది. ఆ మ్యాగజైన్‌ ‌మోడీని ప్రధాన విభజనకారిగా అభివర్ణించింది. సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్టు అతీష్‌ ‌తషీర్‌ ఈ ‌వ్యాసాన్ని రాశారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం జనాకర్షక దిశగా పతనమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది భారత ప్రజాస్వామ్యమేనని ఆ వ్యాసంలో తషీర్‌ ‌పేర్కొన్నారు. మరో ఐదేళ్ళు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని భారత ప్రజలు భరించగంలరా అని కూడా ఆయన ప్రశ్నించారు. జనాకర్షక రాజకీయం అమెరికా సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రస్తుతం నడుస్తోందనీ, భారత్‌లో కూడా అదే రీతిలో జనాకర్షక రాజకీయం సాగుతోందని తషీర్‌ అన్నారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ నాటి నుంచి ఎక్కువ కాలం కాంగ్రెస్‌ ‌పాలన ఐదేళ్ళ క్రితం మోడీ వచ్చేవరకూ సాగిందని అన్నారు. మోడీ హయాంలో మైనారిటీల మీద దాడులు, మూక దాడులు, మహిళలపై లైంగిక దాడులు పెరిగాయనీ, ఇవన్నీ సామాజికంగా వివిధ వర్గాల మధ్య విభజన రేఖకు కారణమయ్యాయని ఆయన అన్నారు. అలాగే, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, ప్రస్తుత లోక్‌ ‌సభ ఎన్నికల్లో సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ని బీజేపీ అభ్యర్థినిగా నిలబెట్టడం మొదలైన అంశాలను ప్రస్తావించిన తషీర్‌ ‌మోడీ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో మోడీ అద్భుతాలు సృష్టిద్దామనుకున్నారనీ, ఆయన యత్నాలు విఫలమవడమే కాకుండా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అలాగే, సమాజంలో మతపరమైన జాతీయ వాదం వాతావరణం అలుముకుందని అన్నారు.

2014 నాటి ఎన్నికల సమయంలో మాదిరిగా ఈ సారి మోడీపై ప్రజలకు ఆశలు లేవనీ, అయినా బలహీనమైన ప్రతిపక్షం ఉండటం వల్ల పరిస్థితులు మోడీకి కలిసొచ్చాయని అన్నారు. మళ్ళీ ఆనాటి పరిస్థితి వస్తుందని మోడీ కలగనలేరని అన్నారు. మోడీ కేవలం రాజకీయ వేత్త అనీ, గడిచిన ఐదేళ్ళలో మోడీ వాగ్దానాల అమలు కోసం కృషి చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అన్నారు. టైమ్‌ ‌తాజా సంచికలో లాన్‌ ‌బెర్మర్‌ ‌రాసిన మోడీ సంస్కరణ కర్త అనే కథనం కూడా ప్రచురితం అయింది. 2015 మేలో టైమ్‌ ‌మ్యాగజైన్‌ ‌మోడీపై కవర్‌ ‌పేజీ వ్యాసం ప్రచురించింది. అప్పట్లో మోడీని ప్రశంసిస్తూ మోడీకి ఎందుకు విలువ ఇవ్వాలో ఆ వ్యాసంలో విపులంగా వివరించింది. ప్రపంచానికి ఇప్పుడు భారత్‌ ఎదగడం కావాలని అంటూ వ్యాసాన్ని ప్రచురుంచింది. మోడీ ఏడాది పాలనలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోగలరా? అని కూడా పేర్కొంది. గడిచిన కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియా ప్రధానిగా మోడీ ఐదేళ్ళ పాలనపై విస్తృతంగా చర్చ ప్రారంభించింది. ఏప్రిల్‌ 14‌వ తేదీన ‘వాల్‌ ‌స్ట్రీట్‌ ‌జనరల్‌ ’ ‌సంపాదక మండలి మోడీ సంస్కరణలు నిరాశ చేకూర్చాయంటూ ఒక అభిప్రాయాన్ని ప్రచురించింది. ఇలా ఉండగా మే 2వ తేదీన ‘ద ఎకానమిస్ట్’ ‌నరేంద్రమోడీ పాలనలో భారత్‌ అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా తయారైందని ఒక వ్యాసాన్ని ప్రచురించింది.