వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మే 23 తర్వాత మూడు విధాల అవకాశం

May 10, 2019

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై ఎక్కువగా అధికారం ఎవరిది అనేది ఆధారపడి ఉంటుంది. 200 సీట్లకు లోపు అయితే బీజేపీ మిత్రపక్షాల షరతులకు లొంగాల్సి వస్తుంది. 220 సీట్లకు పైన వస్తే తన మాటేపైనుండేట్టు పెత్తనం చేస్తుంది. ప్రాంతీయ పార్టీల సంకీర్ణ కూటముల గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు, అవగాహన కుదుర్చుకోవడం వంటి తతంగాలు పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌కి ముందుగానే సంకేతాలు పంపుతున్నాయి. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మధ్య ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమలనాథ్‌ ‌కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బీజేపీ నాయకుడు రామ్‌ ‌మాధవ్‌ ‌తమ పార్టీ 271 సీట్లు గెల్చుకోగలదనీ, అయినప్పటికీ మిత్ర పక్షాల సహకారం అవసరమని అన్నారు. 271 సీట్లు వస్తే ఎక్కువ పార్టీల కోసం ప్రయత్నించనవసరం లేదు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదన్న విషయం తేలిపోయింది. చిన్న పార్టీలపై అది ఆధార పడాల్సిందే. స్థిరమైన ప్రాంతీయ పార్టీల కంటే నమ్మకమైన పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇదంతా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. 200 కన్నా తక్కువ వస్తే మిత్ర పక్షాలపై ఆధారపడి వాటి ఒత్తిళ్ళకు లొంగాల్సి వస్తుంది. 220పైన వస్తే తనదే పైచేయిగా వ్యవహరించవచ్చు.
1971లో ఇందిరాగాంధీ, 1984లో రాజీవ్‌ ‌గాందీ సాధించిన ఘనవిజయాలు అసాధారణ పరిస్థితుల్లో కానీ సాధ్యం కాదని ప్రధాని మోడీ, అమిత్‌షాలకు తెలుసు. అయినప్పటికీ గత ఎన్నికల్లో మోడీ బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీని సాధించారు. ఆయన వాగ్దానాలను విశ్వసించి ప్రజలు ఘనవిజయం సాధించి పెట్టారు. అప్పట్లో ప్రతిపక్షాలు కకావికలై ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. మళ్ళీ ఆనాటి విజయం సాధించడం కష్టం. ఐదేళ్ళలో మెరుగైన పాలన అందించి ప్రతిపక్షాలను సవాల్‌ ‌చేసే రీతిలో ఉండాల్సిన మోడీ విఫలమైన నాయకునిగా ముద్ర పడ్డారు. తాను అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవడం కన్నా, నెహ్రూ- గాంధీ కుటుంబంపై తరచూ ధ్వజమెత్తుతున్నారు. అది ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన అంశం. మాజీ ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ ప్రస్తావన తీసుకుని రావడం ఇప్పుడు తీసుకుని రావడం అవసరమా? గాంధీ కుటుంబంపై మోడీ అదే పనిగా విరుచుకుని పడటం వల్ల ఫలితం ఏమీ కనిపించడం లేదు. యువతరానికి మోడీ ఎవరిని గురించి మాట్లాడుతున్నారో తెలియదు. అయితే, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మోడీకే రాష్ట్రపతి మరో అవకాశం ఇచ్చి 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోమని అడుగవచ్చు. ఈ సందర్భంలో అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయి ప్రభుత్వానికి అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఆయన ప్రభుత్వం ఒక్క వోటు తేడాతో పడిపోయిన పరిస్థితి గుర్తొస్తుంది. మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏలో చేసే ఇతరపార్టీలు ఏమున్నాయో ఎవరు చెప్పగలరు . ఫలితాలు వెల్లడి అయిన తర్వాత స్పష్టత ఏర్పడవచ్చు. ఒకవేళ అనేక పార్టీలతో సంకీర్ణాలు అనివార్యం అయితే, ఈ కింది పరిస్థితులు తలెత్తవచ్చు.
1. బీజేపీకి 180 లేదా అంతకు మించి రావచ్చుననుకుందాం..
బీజేపీ హిందీ రాష్ట్రాల్లో 90- 100 శాతం సీట్లు సాధించడం ఈసారి సాధ్యం కాకపోవచ్చు. ఈసారి గుజరాత్‌తో సహా హిందీ ప్రాంతాల్లో ఆ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌ ‌లలో ప్రతిపక్షాలు మహాకూటములను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ ‌గుజరాత్‌, ‌మహారాష్ట్ర , రాజస్థన్‌, ‌చత్తీస్‌ ‌గఢ్‌ ‌లలో గట్టి పోటీ ఇస్తోంది. ఒక వేళ ఈ రాష్ట్రాల్లో నష్టాలు అనివార్యం అయితే బెంగాల్‌, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధించే సీట్ల ద్వారా పూడ్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. అదే సందర్భంలో బీజేపీ మిత్ర పక్షాలైన శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, అన్నా డిఎంకెలు కూడా తమ బలాన్ని నిలబెట్టుకోవాలి. బీజేపీతో కొన్ని పార్టీలు తెరచాటు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఉదాహరణకు బిజూ జనతాదళ్‌, ‌తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌, ‌వంటివి బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ తగిన సంఖ్యా బలం లేకపోతే ఇతరులను చేర్చుకోవల్సి ఉంటుంది. బీఎస్‌ ‌పీ అధ్యక్షురాలు మాయావతి , కర్నాటక ముఖ్యమంత్రి, జెడీఎస్‌ ‌నాయకుడు కుమారస్వామి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పార్టీల్లో ఏవీ కూడా తమకు ప్రధానమైన మద్దతుదారులను దూరం చేసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడున్న మిత్ర పక్షాలతో మోడీ- షా ద్వయం వ్యవహరణ తీరు ఏమాత్రం బాగా లేదు. మాటలు విసిరేయడం, తగిన గౌరవం ఇవ్వకపోవడం వంటి కారణాలు ప్రతిబంధకంగా ఏర్పడవచ్చు. శివసేన మోడీ కూటమిలో ఉంటూనే విమర్శలు చేయడం గడిచిన ఐదేళ్లలో చూశాం. ఇతర పార్టీలు అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు. అలాంటి సందర్భాల్లో బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి సందిగ్ధంలో పడవచ్చు. ఇతరులు ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితిని నివారించడానికి మోడీ- షా ద్వయం ముందుగా చర్యలు తీసుకోవాలి
2. కాంగ్రెస్‌తో సంకీర్ణం
కాంగ్రెస్‌కు ఈసారి తగినన్ని సీట్లు వస్తే, బీజేపీ యేతర పార్టీలకు ప్రత్యామ్నాయం కావచ్చు ఈ పరిస్థితి రావాలంటే ఆ పరిస్థితి కనీసం 140 సీట్లు తెచ్చుకోవాలి. 120 సీట్లు మాత్రమే వస్తే ఇతరులకు మద్దతు ప్రకటించాల్సి వస్తుంది. కొందరు కాంగ్రెస్‌ ‌వాదులు తమ పార్టీ పునర్వ్వైభవం సాధించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యూపేఏ -3 ప్రభుత్వం మళ్ళీ వస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొనవచ్చు అని అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న 44 సంఖ్యా బలం నుంచి 140కి అది చేరుకోవాలి. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని కూటమిలో ఏ పార్టీలు చేరుతాయి. ప్రస్తుతం ఉన్న డిఎంకె, ఆర్‌జేడీ, ఎన్సీపీ చేరవచ్చు. కానీ, వైసీపీ, టిఆర్‌ఎస్‌ అనుమానమే, కానీ చేరుతాయని అనుకుందాం. తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అందరినీ సందిగ్ధంలో పడేస్తున్నారు. బీజేపీని ముఖ్యంగా మోడీని దూరంగా ఉంచేందుకు తన మద్దతు అవసరమని అంటున్నారు. తన పేరును ప్రత్యామ్నాయంగా సూచించాలన్నది ఆమె అభిమతం కావచ్చు.అలాగే, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మహాఘటబంధన్‌ ‌లో కీలకంగా ఉన్నారు.
3. బీజేపీ యేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు 280 కన్నా తక్కువ సీట్లు తెచ్చుకున్నప్పుడే ఇది సాధ్యం. ఇలాంటి పరిస్థితులలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. 1996 నాటి పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పట్లో జనతాదళ్‌ ఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డి దేవగౌడ ప్రధాని కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏ నాయకుడూ మరో నాయకుణ్ణి అంగీకరించే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. శరద్‌ ‌పవార్‌, ‌మమతా బెనర్జీలు బలమైన నాయకులుగానూ, ఎక్కువమందికి సమ్మతమైన వారిగానూ కనిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిలబడుతుందా? ఆనాడు విపి సింగ్‌, ‌చంద్రశేఖర్‌, ‌దేవెగౌడ్‌, ఐకె గుజ్రాల్‌ ‌ప్రభుత్వాలు అతి స్వల్ప కాలంలోనే పడిపోయాయి దాంతో తదుపరి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రాంతీయ పార్టీల్లో చాలా పార్టీలు వాస్తవాన్ని గ్రహించాయి.అందుకే శివసేన మళ్ళీ బీజేపీ దారిలోకి వచ్చింది. ఆర్‌జెడి వంటి పార్టీలు బీజేపీ వైపు ఎంత మాత్రం వెళ్ళవు. దీంతో పరిస్థితి మరింత గజిబిజి కావచ్చు. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోతే, ప్రధాన పార్టీలు సాధించే సీట్లను బట్టి సంకీర్ణాలు ఏర్పడటం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది చాలా కీలకమైనది.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..