వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మేమే గులాబీ పార్టీ ఓనర్లం..!

August 29, 2019

ఆరోగ్యశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌ను తెలంగాణ మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో రాజేందర్‌ ‌చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురువారం కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్‌… ‌తనకు దక్కిన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదన్నారు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని తాను ఏనాడూ అడగలేదన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పుడుమోసం చేయలేదన్నారు. తాను ఎవరి వద్దనైనా ఒక్క రూపాయి తీసుకొన్నట్టుగా రుజువు చేస్తారా?అని ఆయన ప్రశ్నించారు. తాను ఇల్లు కట్టుకొంటే ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు…వ్యక్తులెప్పుడూ చరిత్ర నిర్మాతలు కారు, కాలేరన్నారు. ఎవరు హీరో… ఎవరు జీరోలో త్వరలోనే తేలుతుందని  చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. తాను టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి మధ్యలో వచ్చిన వ్యక్తిని కాదన్నారు.  తాను ఎల్లప్పుడు వెలిగే దీపాన్ని అని ఆయన చెప్పుకొన్నారు. తాను పార్టీలో మధ్యలో వచ్చిన వ్యక్తి కాదన్నారు. గులాబీ పార్టీకి ఓనర్లమన్నారు.  అడుకొచ్చినోల్లం కాదు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల గెలుపుకై ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించాం. అందుకే మేము గులాబీ జెండా ఓనర్లమయ్యామన్నారు. అడుక్కొనే వాళ్లం కాదు… అడుక్కునే వారు ఎవరో తెలుస్తుంది అని ఈటెల ఉద్వేగంగా మాట్లాడారు. చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈటల అభిప్రాయపడ్డారు. తప్పులు చేసిన వారెవరికైనా ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తనను చంపుతామని రెక్కీ నిర్వహించినా కూడ బెదిరిపోలేదన్నారు. రాజశేఖర్‌ ‌రెడ్డి బతికున్న  సమయంలో గులాబీ జెండాను పట్టుకొనే ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో అత్యంత రహస్యంగా జరిగిన ప్రభుత్వ వ్యూహాలను, ప్రణాళికలను ఈటల రాజేందరే రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులకు బహిర్గతం చేసి ప్రభుత్వంపై రెవెన్యూ ఉద్యోగులను ఎగదోసే ప్రయత్నాలను చేశారన్న  రెండు పత్రికల (ప్రజాతంత్ర కాదు)  ప్రచారంపై కుడా  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పనిలేదని అన్నారు.