వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ముమ్మారు తలాక్‌… ‌తెరాస, బీఎస్పీ వంటి పార్టీల పరోక్ష సహకారం

August 3, 2019

ముమ్మారు తలాక్‌ ‌బిల్లు.. అధికారికంగా దీని పేరు ముస్లిం మహిళల(వివాహాలపై హక్కుల రక్షణ) బిల్లు-2019ని రాజ్యసభ కూడా ఆమోదించడంతో రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దాంతో అది చట్టం అయింది. ఈ బిల్లును జూలై 30వ తేదీన వోటింగ్‌కు పెట్టారు. 99 మంది బిల్లుకు అనుకూలంగాను, 84 మంది వ్యతిరేకంగానూ వోటు వేశారు. ఈ బిల్లు ఏ విధంగా ఆమోదం పొందిందో సమీక్షిస్తూ భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ఈ ‌బిల్లుపై వోటింగ్‌ ‌జరిగినప్పుడు కొన్ని పార్టీలు సభకు గైర్‌ ‌హాజరు కావడం ద్వారా ఇది సభ ఆమోదం పొందేట్టు చేయడంలో తమకు సహకరించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయాలను బాహాటంగా సమర్థించలేని వారు ఇలాంటి బిల్లులపై వోటింగ్‌ ‌జరిగినప్పుడు గైర్హాజర్‌ అవుతుండటం ఇటీవల కానవస్తున్న కొత్త పరిణామం. మాధవ్‌ ‌చెప్పింది నిజమే. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్న పలు పార్టీలు వోటింగ్‌కు గైర్హాజర్‌ ‌కావడం ద్వారా ప్రభుత్వానికి సహకరించారు. దీనిని బట్టి ప్రతిపక్షాల్లో పలు పార్టీలు ప్రభుత్వానికి సహకరించేందుకు సుముఖంగా ఉన్నట్టు స్పష్టం అవుతోంది. రాజ్యసభలో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే తలాక్‌ ‌బిల్లును వ్యతిరేకించేవారి సంఖ్యే ఎక్కువ. 245 మంది సభ్యులు గల రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించే 123 మంది సభ్యుల మద్దతును సమీకరించడం కష్టమేమీ కాదు. కానీ, వోటింగ్‌ ‌సమయానికి వచ్చే సరికి 84 మంది మాత్రమే బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పుకున్న పార్టీలలో చాలా మటుకు వోటింగ్‌కు గైర్హాజరై బిల్లు సభ ఆమోదం పొందేట్టు సహకరించాయి. వీటిలో అన్నా డిఎంకె (11), బీఎస్పీ(4), పీడీపీ(2) జేడీయూ(6), తెరాస(6) ఉన్నాయి. ఒడిషాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ ‌బిల్లుకు అనుకూలంగా వోటు వేశాయి.
ప్రాంతీయ పార్టీలు కూడా విఫలం
ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం ప్రతి పక్షాల వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షాలలో ప్రాంతీయ పార్టీల అనుబంధం చాలా బలహీనంగా ఉంది. బహుజన సమాజ్‌ ‌పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు వోటింగ్‌ ‌సమయంలో అదృశ్యం కావడం దిగ్భ్రాంతి కలిగించింది. వీరిలో పార్టీలో నంబర్‌ ‌టూగా పరిగణింపబడుతున్న సతీష్‌ ‌చంద్ర మిశ్రా కూడా ఉన్నారు. లోక్‌ ‌సభ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి బీఎస్పీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, బిల్లును వ్యతిరేకించే సమయం వచ్చే సరికి సభకు హాజరు కాలేదు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) కూడా. తలాక్‌ ‌బిల్లును వ్యతిరేకించినప్పటికీ రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు కూడా వోటింగ్‌లో పాల్గొనలేదు. తెలంగాణలో తెరాస మిత్రపక్షంగా ఆలిండియా మజ్లిస్‌ ఇత్తేహదుల్‌ ‌ముస్లిమీన్‌(ఎంఐఎం) ఉం‌ది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ముస్లిం మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకుని వచ్చిందంటూ ఆయన ఆరోపించారు. అయితే, ఒవైసీకి ఆయన మిత్ర పక్షమే చెయ్యిచ్చింది. బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేసిన పార్టీలు కూడా వోటింగ్‌ ‌జరిగేటప్పుడు తమ ఎంపీలు సభలో ఉండేట్టు చూసుకోలేదు. కాంగ్రెస్‌, ‌సమాజ్‌ ‌వాదీ పార్టీల నుంచి చెరి ఐదుగురు ఎంపీలు, ఎన్సీపీ ఎంపీలు ఇద్దరు, ఆర్జెడి, టిఎంసీ, డిఎంకె, సిపిఎం ఎంపీలు ఒక్కొక్కరు గైర్హాజర్‌ అయ్యారు. ఎన్సీపీ నుంచి గైర్హాజర్‌ అయిన వారిలో ఆ పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌, ఆయనకు సన్నిహితుడు ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌కూడా ఉన్నారు. దీంతో సభలో ప్రతిపక్షాల బలం బాగా తగ్గిపోయింది. సమాజ్‌ ‌వాదీ పార్టీ సభ్యులు సగానికి సగం తగ్గడం భరించరాని విషయంగా ఉంది. ఆ పార్టీ కనీసం తమ సభ్యులకు విప్‌ ‌కూడా జారీచేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ ‌వాదీ పార్టీ పూర్తిగా ముస్లింల మద్దతుపై ఆధారపడి ఉంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌ ‌వాదీ ఎంపీ జావేద్‌ ఆలీఖాన్‌ ‌ప్రసంగించారు. బిల్లుకు పలు సవరణలు కూడా చేశారు. అయితే, ఆయనకు సహచరులే హ్యాండిచ్చారు. గైర్హాజర్‌ అయిన కాంగ్రెస్‌ ‌సభ్యులలో రంజిబ్‌ ‌బిశ్వాల్‌, ‌ప్రతాప్‌ ‌సింగ్‌ ‌బజ్వా, ముకుత్‌ ‌మిథి, వివేక్‌ ‌ఠంకాలు ఉన్నారు. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌ ‌పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ‌నాయకుడు గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌మాట్లాడుతూ సభకు ప్రభుత్వం అన్ని విషయాలూ చెప్పడం లేదని ఆరోపించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం గురించి చెప్పలేదని అన్నారు. దాంతో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు తమ సభ్యులు వోటింగ్‌ ‌సమయంలో సభలో ఉండేట్టు చూసుకోలేకపోయారని అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ‌తమ సభ్యులంతా సభలో ఉండేట్టు చూసుకుంది. వారంతా బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేసేట్టు చూసుకుంది. పలు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఇష్టంగానో, అయిష్టంగానో తోడ్పడ్డాయి. రాం మాధవ్‌ ‌చెప్పినట్టు బహిరంగంగా ఈ బిల్లును వ్యతిరేకించడం ఇష్టం లేని పార్టీలు వోటింగ్‌కు గైర్హాజర్‌ అయ్యాయి. తాము లౌకిక వాద పార్టీలకు చెందిన వారమని పదే పదే చెప్పుకున్న ఈ పార్టీలకు చెందిన వారు మోడీ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలిచారు. వారు అలా చేయడంలో స్వీయ ప్రయోజనాలు తప్ప వేరే కారణాలు కనిపించడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో సరైన ప్రత్యామ్నాయం లేదు కనుక ముస్లింలు తమ వెంటే ఉంటారన్న దీమాతో తెరాస వ్యవహరించింది.

– ‘ద క్వింట్‌’ ‌సౌజన్యంతో..